కొబ్బరి ఉండ్రాళ్లు సమర్పయామి!

వినాయక చవితి వస్తోందంటే ఉండ్రాళ్లతోపాటూ ఇంకా ఏమేం చేసి స్వామికి నివేదించాలా అని ఆలోచిస్తున్నారా... అయితే ఈసారి ఆ పదార్థాలతోపాటూ వీటినీ ట్రై చేసి చూడండి.

Published : 26 Jun 2021 11:12 IST

వినాయక చవితి వస్తోందంటే ఉండ్రాళ్లతోపాటూ ఇంకా ఏమేం చేసి స్వామికి నివేదించాలా అని ఆలోచిస్తున్నారా... అయితే ఈసారి ఆ పదార్థాలతోపాటూ వీటినీ ట్రై చేసి చూడండి.


డ్రైఫ్రూట్స్‌ మోదక్‌

కావలసినవి: జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్‌ పలుకులు: అన్నీ కలిపి ముప్పావుకప్పు, ఖర్జూరాలు: ఎనిమిది, ఆప్రికాట్లు: ఎనిమిది, కిస్‌మిస్‌: పది, అంజీర్‌: ఆరు, నెయ్యి: రెండు చెంచాలు.
తయారీవిధానం: స్టౌమీద కడాయి పెట్టి జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్‌ పలుకుల్ని వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి. వేడి తగ్గాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తరువాత నెయ్యి తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని మరోసారి గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు మోదక్‌ మౌల్డ్‌కు నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని అందులో కొద్దిగా ఉంచి నొక్కినట్లు చేస్తే మోదక్‌ తయారైనట్లే. ఇదే విధంగా మిగిలినవీ చేసుకోవాలి.


కొబ్బరి ఉండ్రాళ్లు

కావలసినవి:బియ్యప్పిండి:అరకప్పు, నీళ్లు: ఒకటింబావు కప్పు, ఉప్పు: పావుచెంచా, నెయ్యి: రెండు చెంచాలు, పచ్చి కొబ్బరి తురుము: పావుకప్పు, ఆవాలు: అరచెంచా, జీలకర్ర: చెంచా, మినప్పప్పు: చెంచా, సెనగపప్పు: ఒకటిన్నర చెంచా, పచ్చిమిర్చి: రెండు, ఎండుమిర్చి: రెండు, ఇంగువ: చిటికెడు, కరివేపాకు రెబ్బ: ఒకటి, నూనె: రెండు చెంచాలు.
తయారీవిధానం: స్టౌమీద గిన్నె పెట్టి నీళ్లు పోయాలి. అవి వేడిగా అవుతున్నప్పుడు పావుచెంచా నెయ్యి, ఉప్పు వేసి బాగా కలపాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. వేడి చల్లారాక చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని ఇడ్లీపాత్రల్లో సర్ది ఆవిరిమీద పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె, మిగిలిన నెయ్యి వేయాలి. అవి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు వేయించాలి. తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేయాలి. అవి వేగాయనుకున్నాక కొబ్బరితురుము వేయాలి. నిమిషం తరువాత ఆవిరిమీద ఉడికించుకున్న ఉండ్రాళ్లను వేసి బాగా కలిపి వాటికి కొబ్బరి మిశ్రమం పట్టిందనుకున్నాక దింపేయాలి.


అయ్యంగార్‌ పులిహోర

కావలసినవి: దనియాలు: చెంచా, మెంతులు: పావుచెంచా, ఎండుమిర్చి: నాలుగు, నువ్వులు: చెంచా, మిరియాలు: అరచెంచా, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: చెంచా, సెనగపప్పు: రెండు చెంచాలు, పల్లీలు: పావుకప్పు, ఇంగువ: కొద్దిగా, కరివేపాకు రెబ్బలు: రెండు, బెల్లం తరుగు: చెంచా, ఉప్పు: తగినంత, చింతపండు గుజ్జు: పావుకప్పు, అన్నం: ఒకటిన్నర కప్పు, పసుపు: కొద్దిగా.
తయారీవిధానం: ముందుగా దనియాలు, మెంతులు, రెండు ఎండుమిర్చి, నువ్వులు, మిరియాలను నూనె లేకుండా వేయించుకుని తరువాత మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, సెనగపప్పు, ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకు వేయించి ఇంగువ, బెల్లం, చింతపండు గుజ్జు, పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి. చింతపండు గుజ్జు ఉడికాక ముందుగా చేసుకున్న మసాలా వేయాలి. రెండు నిమిషాలయ్యాక స్టౌ కట్టేసి  అందులో అన్నం వేసి కలిపితే సరి.


తీపి మురుకు

కావలసినవి: సెనగపిండి: కప్పు, బియ్యప్పిండి: అరకప్పు, వెన్న: టేబుల్‌స్పూను, ఉప్పు: చిటికెడు, బెల్లం తరుగు: ఒకటిన్నర కప్పు, యాలకులపొడి: అరచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి వేయించేందుకు సరిపడా నూనె పోయాలి. ఓ గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి, వెన్న, ఉప్పు తీసుకుని ఓసారి కలిపి తరువాత నీళ్లు పోసుకుంటూ గట్టి పిండిలా చేసుకోవాలి. మురుకుల గొట్టానికి నూనె రాసి ఈ పిండిని అందులో ఉంచి కాగుతోన్న నూనెలో జంతికల్లా వత్తుకోవాలి. ఇవి ఎర్రగా వేగాక ఇవతలకు తీసుకోవాలి. స్టౌమీద మరో గిన్నె పెట్టి అరకప్పు నీళ్లు పోసి బెల్లం తరుగు వేయాలి. అది కరిగి ఉండపాకంలా అవుతున్నప్పుడు యాలకులపొడి, జంతికలు ఒకదాని తరువాత మరొకటి వేసి కలపాలి. రెండు నిమిషాలయ్యాక స్టౌ కట్టేసి ఈ జంతికల్ని ప్లేటులో ఆరబెట్టుకుంటే చాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని