క్రిస్‌మస్‌ విందు... నోరూరించేలా!

క్రిస్‌మస్‌ అంటేనే కేకులూ కుకీలూ పుడ్డింగులూ బిర్యానీలూ ఇలా ఎన్నో రుచులు నోరూరిస్తుంటాయి. వాటిల్లో కొన్ని మనమూ ట్రై చేద్దామా...

Published : 27 Jun 2021 18:14 IST

క్రిస్‌మస్‌ అంటేనే కేకులూ కుకీలూ పుడ్డింగులూ బిర్యానీలూ ఇలా ఎన్నో రుచులు నోరూరిస్తుంటాయి. వాటిల్లో కొన్ని మనమూ ట్రై చేద్దామా...

గోవా పుడ్డింగ్‌

కావలసినవి 
మైదాపిండి: 200గ్రా., కొబ్బరిపాలు: పావులీటరు, పంచదార: అరకిలో, గుడ్ల పచ్చసొనలు: 10, నెయ్యి: కప్పు, ఉప్పు: చిటికెడు, పైనాపిల్‌ లేదా చాకొలెట్‌ ఎసెన్స్‌: పావుటీస్పూను, బేకింగ్‌పౌడర్‌: చిటికెడు, బ్రౌన్‌ లేదా చాకొలెట్‌ ఫుడ్‌ కలర్‌: టీస్పూను

తయారుచేసే విధానం 
ఓ బౌల్‌లో గుడ్ల పచ్చసొనలు వేసి బాగా గిలకొట్టాలి. అందులోనే కొబ్బరిపాలు పోసి కలపాలి. 
మైదాపిండి, పంచదార పొడి కూడా వేసి బాగా కలపాలి. తరవాత ఎసెన్స్‌, బేకింగ్‌ పౌడర్‌ వేసి గిలకొట్టినట్లుగా కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి ఓ భాగంలో బ్రౌన్‌ కలర్‌ వేసి కలపాలి. 
బేకింగ్‌ ట్రేలో అడుగున నెయ్యి రాసి, పావు అంగుళం మందాన మిశ్రమాన్ని వేసి ముందుగానే 180 డిగ్రీల దగ్గర వేడి చేసిన ఓవెన్‌లో పెట్టి బేక్‌ చేయాలి. బయటకు తీసి దానిమీద టేబుల్‌స్పూను నెయ్యి రాసి కరిగిన తరవాత మళ్లీ అదే మందంలో బ్రౌన్‌ కలర్‌ మిశ్రమాన్ని వేసి బేక్‌ చేయాలి. 
ఇప్పుడు బయటకు తీసి దానిమీద మళ్లీ నెయ్యి రాసి కలర్‌ కలపని మిశ్రమాన్ని వేసి బేక్‌ చేయాలి. 
ఇలా ఆ రెండు మిశ్రమాలు అయ్యేంతవరకూ అలా చేస్తూనే ఉంటే పొరలు పొరలుగా ఉండే గోవా పుడ్డింగ్‌ తయార్‌.

బియ్యం లడ్డూ

కావలసినవి 

బాయిల్డ్‌ రైస్‌: పావుకిలో, బెల్లం తురుము: 200గ్రా., కొబ్బరి తురుము: 150గ్రా., యాలకుల పొడి: అరటీస్పూను, నువ్వులు: టేబుల్‌స్పూను, ఉప్పు: చిటికెడు

తయారుచేసే విధానం 
బియ్యం కడిగి ఆరనివ్వాలి. తరవాత మందపాటి బాణలిలో వేసి స్టవ్‌మీద పెట్టి అవి కాస్త ఉబ్బుగా అయ్యేవరకూ సుమారు పదినిమిషాలు వేయించాలి. 
బియ్యం, యాలకులు కలిపి మిక్సీలో వేసి కాస్త బరకగా ఉండేలా పట్టాలి. 
తరవాత బెల్లం తురుము, కొబ్బరి తురుము కూడా మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బరకగా పట్టిన బియ్యం పిండిలో వేసి, ఉప్పు, నువ్వులు కూడా చల్లి నెయ్యి రాసుకుంటూ గుండ్రని ఉండల్లా చుట్టాలి.

కల్‌కల్‌

కావలసినవి 
మైదా: అరకిలో, బేకింగ్‌ పౌడర్‌: 2 టీస్పూన్లు, గుడ్లు: రెండు, కొబ్బరిపాలు: కప్పు, పంచదార పొడి: 4 టేబుల్‌స్పూన్లు, వెన్న: టేబుల్‌స్పూను, నూనె: వేయించడానికి సరిపడా, పాకం కోసం: పంచదార: కప్పు, *మంచినీళ్లు: 4 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం 
మైదాలో బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలపాలి. తరవాత వెన్న వేసి మృదువుగా కలపాలి. 
విడిగా ఓ గిన్నెలో గుడ్లు వేసి బాగా గిలకొట్టి మైదా మిశ్రమంలో వేసి కలపాలి. తరవాత పంచదార-కొబ్బరి పాలు వేసి ముద్దలా కలిపి ఉంచాలి. ఈ పిండిముద్దని చిన్న ఉండల్లా చేసి నెయ్యి రాసిన గవ్వలబల్లమీద గవ్వల్లానే చేసుకుని కాగిన నూనెలో కొద్దికొద్దిగా వేయించి తీయాలి. 
మందపాటి గిన్నెలో పంచదార వేసి అది కరిగి తీగ పాకం వచ్చేవరకూ ఉడికించాలి. తరవాత అందులో వేయించిన కల్‌కల్‌ వేసి బాగా కలిపి ఆరనివ్వాలి.

స్పైసీ చికెన్‌ మసాలా

కావలసినవి 

చికెన్‌ ముక్కలు: పావుకిలో, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, పెరుగు: 2 టేబుల్‌స్పూన్లు, కాశ్మీరీ కారం: 2 టీస్పూన్లు, పసుపు: అరటీస్పూను, దనియాలపొడి: అరటీస్పూను, జీలకర్రపొడి: అరటీస్పూను, గరంమసాలా: అరటీస్పూను, లవంగాలు: 6 రెబ్బలు, కశ్మీరీ మిర్చి: ఏడు, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేసే విధానం 
చికెన్‌ ముక్కలకు కారం, గరంమసాలా, పసుపు, దనియాలపొడి, జీలకర్ర, ఉప్పు అన్నీ పట్టించాలి. తరవాత అల్లంవెల్లుల్లి, పెరుగు కూడా పట్టించి ఫ్రిజ్‌లో సుమారు అరగంటసేపు ఉంచాలి. 
మిక్సీలో కశ్మీరీ ఎండుమిర్చి, లవంగాలు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. 
బాణలిలో నూనె వేసి కాగాక అన్నీ పట్టించిన చికెన్‌ ముక్కలు వేసి పది నిమిషాలు వేయించాలి. తరవాత మూతపెట్టి ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి. ఇప్పుడు రుబ్బిన కారం ముద్ద కూడా వేసి సిమ్‌లో దగ్గరగా అయ్యేవరకూ ఉడికించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని