lentils: పప్పులతో కూర.. వారెవా!

పెసలూ శనగల్లాంటివి నానబెట్టి మొలకలొచ్చాక తింటుంటాం కదా! ఈ పోషకాల గనులు ఎంత మంచివని చెప్పినా.. పిల్లలకు పెద్దగా నచ్చవు. మరి వాళ్లు పేచీ పెట్టకూడదంటే..వాటితో కూరలు చేస్తే సరి.. వద్దనకపోగా, ఇంకా కావాలంటారు. అదిరే రుచి అదనంగా వస్తుంది మరి!

Published : 23 Jun 2024 00:51 IST

పెసలూ శనగల్లాంటివి నానబెట్టి మొలకలొచ్చాక తింటుంటాం కదా! ఈ పోషకాల గనులు ఎంత మంచివని చెప్పినా.. పిల్లలకు పెద్దగా నచ్చవు. మరి వాళ్లు పేచీ పెట్టకూడదంటే.. వాటితో కూరలు చేస్తే సరి.. వద్దనకపోగా, ఇంకా కావాలంటారు. అదిరే రుచి అదనంగా వస్తుంది మరి!

వీటిలో ఏ పప్పులనైనా ముందు రోజు రాత్రి కడిగి, నానబెట్టాలి. మర్నాడు ఉదయం ఆ నీళ్లు వడకట్టి, ఉడికించాలి.


శనగలతో

కావలసినవి: కొబ్బరి పాలు - అర కప్పు, ఉల్లిపాయ ముక్కలు - ముప్పావు కప్పు, శనగలు - రెండు కప్పులు, కొబ్బరి తురుము - కప్పు, నూనె - 5 చెంచాలు, సన్నగా తరిగిన అల్లం - టేబుల్‌ స్పూన్, వెల్లుల్లి తరుగు - చెంచా, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - అర చెంచా, కారం, గరం మసాలా, కర్రీ పౌడర్, జీలకర్ర పొడి - చెంచా చొప్పున, కొత్తిమీర తరుగు - అర కప్పు, నిమ్మరసం - అర చెంచా, ఉల్లి, టొమాటో, నిమ్మచెక్కలు - అలంకరించేందుకు

తయారీ:  కడాయిలో నూనె వేడయ్యాక.. ఉల్లి, అల్లం, వెల్లుల్లి తరుగులను వేయించాలి. ఇవి లేత గోధుమ రంగులోకి మారాక.. ఉడికిన శనగలు, కారం,   గరం మసాలా, కర్రీ పౌడర్, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు.. ఇలా అన్నీ జతచేసి సన్న సెగ మీద మగ్గనివ్వాలి. ఇందుకు ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది. తర్వాత కొబ్బరి తురుము, కొబ్బరి పాలు జోడించి, మరోసారి కలియ తిప్పాలి. దగ్గరగా అయ్యాక.. కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి దించేయాలి. ఇక ఉల్లి, టొమాటో, నిమ్మచెక్కలతో అలంకరిస్తే సరి.. ఎప్పుడెప్పుడు తిందామా అనిపించేట్లు ఊరిస్తుందీ శనగల కూర.


పెసలతో

కావలసినవి: నూనె - 3 చెంచాలు, పెసలు - ముప్పావు కప్పు, ఉల్లి, టొమాటో తరుగు - పావు కప్పు చొప్పున, పచ్చిమిర్చి ముక్కలు - చెంచా, ఉప్పు - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి ముద్ద - టేబుల్‌ స్పూన్, పసుపు, ఆమ్‌చూర్‌ పౌడర్, గరంమసాలా, బెల్లం పొడి - అర చెంచా చొప్పున, కశ్మీరీ కారం, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర - చెంచా చొప్పున, ఇంగువ - చిటికెడు, కొత్తిమీర తరుగు - పావు కప్పు

తయారీ: కుక్కర్‌లో నూనె వేడయ్యాక.. ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు ఇంగువ, ఆ వెంటనే ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలియ తిప్పాలి. అవి దోరగా వేగి, మంచి వాసన వస్తుండగా టొమాటో తరుగు, పసుపు, ధనియాల పొడి, కశ్మీరీ కారం, ఆమ్‌చూర్‌ పౌడర్, గరం మసాలా, బెల్లం పొడి, ఉప్పు, ఉడికించిన పెసలు, మూడు కప్పుల నీళ్లు జోడించి ఒక విజిల్‌ వచ్చేదాకా ఉడికించాలి. ఆవిరి పోయాక.. మూత తీసి, కొత్తిమీర తరుగు చల్లాలి.


రాజ్మాతో

కావలసినవి: రాజ్మా (రెడ్‌ బీన్స్‌) గింజలు- కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - ముప్పావు కప్పు, టొమాటో గుజ్జు - కప్పు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద - టేబుల్‌ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - అర చెంచా, కశ్మీరీ కారం - రెండు చెంచాలు, ధనియాల పొడి, జీలకర్ర, జీలకర్ర పొడి, గరంమసాలా, ఆమ్‌చూర్‌ పౌడర్, పంచదార - చెంచా చొప్పున, మెంతి ఆకుల పొడి - రెండు చెంచాలు, వెన్న - 3 చెంచాలు, కొత్తిమీర తరుగు - చారెడు, కీరదోస, టొమాటో స్లైసులు - అలంకరించేందుకు

తయారీ: కడాయిలో వెన్న కరిగాక.. జీలకర్ర, అది వేగాక.. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద, ఉల్లి తరుగులను వేయించాలి. అవి బంగారు రంగులోకి మారాక.. పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కశ్మీరీ కారం, జీలకర్ర పొడి, గరంమసాలా, టొమాటో గుజ్జు వేసి కలియ తిప్పాలి. టొమాటో పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. అందులో ఉడకబెట్టిన రాజ్మా, ఆమ్‌చూర్‌ పౌడర్, అర కప్పు నీళ్లు జోడించి, సన్న సెగ మీద ఏడెనిమిది నిమిషాలు ఉడికించాలి. చివర్లో పంచదార, మెంతి ఆకుల పొడి, కొత్తిమీర తరుగు వేసి దించేసి.. కీరదోస, టొమాటో స్లైసులతో అలంకరించాలి. అంతే.. ఘుమఘుమలాడే ‘రాజ్మా కూర’ తయారైపోతుంది. ఇది అన్నం, రొట్టెలు ఎందులోకి అయినా అనువుగా ఉంటుంది.


బఠాణీలతో

కావలసినవి: బఠాణీలు - కప్పున్నర, ఉల్లి తరుగు, టొమాటో గుజ్జు - కప్పు చొప్పున, జీడిపప్పులు - 10, పచ్చిమిర్చి - 2, వెల్లుల్లిపాయ - 1, వెన్న, నెయ్యి - టేబుల్‌ స్పూన్‌ చొప్పున, పసుపు, జీలకర్ర - అర చెంచా చొప్పున, ఉప్పు - రుచికి సరిపడా, బిర్యానీ ఆకు - 1, దాల్చినచెక్క - అంగుళం ముక్క, ధనియాల పొడి, గరంమసాలా, పంచదార - చెంచా చొప్పున, కశ్మీరీ కారం - 2 చెంచాలు, ఫ్రెష్‌ క్రీమ్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, మెంతి ఆకుల పొడి - చెంచా

తయారీ: జీడిపప్పులను అరగంట నానబెట్టాలి. ఉల్లి తరుగు, నానిన జీడిపప్పు, పచ్చిమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను జార్‌లో వేసి గ్రైండ్‌ చేయాలి. కడాయిలో వెన్న, నెయ్యి వేడయ్యాక.. బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, జీలకర్ర, వేసి సన్న సెగ మీద కాస్త వేయించాలి. అందులో ఉల్లి తరుగు, పచ్చిమిర్చి మిశ్రమం జోడించి.. రెండు నిమిషాలు కలియబెడుతూ వేయించాలి. దీనికి టొమాటో గుజ్జు, ఉడకబెట్టిన బఠాణీలు, అర కప్పు నీళ్లు, పంచదార, గరంమసాలా, ధనియాల పొడి, కశ్మీరీ కారం, ఉప్పు, పసుపు జోడించి సన్న సెగ మీద ఉడికించాలి. ఐదారు నిమిషాల తర్వాత.. ఫ్రెష్‌ క్రీమ్, మెంతి ఆకుల పొడి వేసి, దించేస్తే సరి.. రుచికరమైన బాఠాణీల కూర సిద్ధం. ఇక తిని ఆనందించడమే తరువాయి. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుంది.


సోయాబీన్‌తో

కావలసినవి: సోయా బీన్‌ - కప్పు, ఉల్లిపాయలు - 2, కొబ్బరి తురుము - ముప్పావు కప్పు, నూనె - 4 చెంచాలు, పసుపు - అర చెంచా, ఉప్పు - రుచికి సరిపడా, మిరియాలు, జీలకర్ర, ధనియాలు - 2 చెంచాల చొప్పున, ఎండుమిర్చి - 4, వెల్లుల్లి - అర పాయ, ఆవాలు - చెంచా, కరివేపాకు - 3 రెబ్బలు

తయారీ: ఉల్లిపాయలు సన్నగా తరగాలి. మిరియాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చిలను మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కనుంచాలి. కడాయిలో 3 స్పూన్ల నూనె కాగనిచ్చి.. ఆవాలు వేయాలి. అవి చిటపట లాడుతుండగా కరివేపాకు, ఉల్లి తరుగు వేయాలి. అది దోరగా వేగాక.. ఉడికించిన సోయాబీన్‌ గింజలు, పసుపు, నూరిన మసాలా పేస్టు, పావు కప్పు నీళ్లు జతచేసి ఉడికించాలి. ఏడెనిమిది నిమిషాల తర్వాత.. మిగిలిన చెంచా నూనె చల్లి.. కలియ తిప్పి దించేయాలి. అంతే.. నోరూరించే ‘సోయా బీన్‌ ఇగురు’ తయారై పోతుంది. ఇది అన్నం కంటే చపాతీలు, పూరీల్లోకి మరింత బాగుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని