Mango Recipes: మామిడితో మజా రుచులు

వేసవి అంటే ఠక్కున గుర్తొచ్చేది మామిడే!  పండ్లలో రారాజులాంటి మామిడి రుచిని తక్కిన పండ్లకీ అద్దితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది.. ఇలా స్మూతీలుగా మారి నోరూరిస్తుంది. ఎండ నుంచి ఉపశమనంతోపాటు పోషకాలనీ అందించే పానీయాలివి..

Published : 16 Apr 2023 00:09 IST

వేసవి అంటే ఠక్కున గుర్తొచ్చేది మామిడే!  పండ్లలో రారాజులాంటి మామిడి రుచిని తక్కిన పండ్లకీ అద్దితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది.. ఇలా స్మూతీలుగా మారి నోరూరిస్తుంది. ఎండ నుంచి ఉపశమనంతోపాటు పోషకాలనీ అందించే పానీయాలివి..


స్ట్రాబెర్రీతో...

కావల్సినవి: చల్లని మామిడిపండు ముక్కలు- కప్పు, స్ట్రాబెర్రీ ముక్కలు- అర కప్పు, ఆపిల్‌ ముక్కలు- అర కప్పు, మామిడిరసం- కప్పు, చల్లటి పాలు- అరకప్పు, ఐస్‌ ముక్కలు- కప్పు, పంచదార- రెండు చెంచాలు, తేనె- కొద్దిగా, పెరుగు- పావుకప్పు.

తయారీ: మామిడి, స్ట్రాబెర్రీ, ఆపిల్‌్ ముక్కలు, మామిడిపండు రసం, పాలు, పంచదార, పెరుగు వీటిని జార్‌లో వేసి మెత్తగా బ్లెండ్‌ చేసుకోవాలి. తీపి కావాలనిపిస్తే కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. గ్లాస్‌లోకి తీసుకొని ఐస్‌ ముక్కలతో సర్వ్‌ చేసుకుంటే ఎండలు మండేవేళ చల్లని పలకరింపులా ఉంటుంది.


మిక్స్‌డ్‌ ఫ్రూట్‌తో

కావల్సినవి: మామిడిపండు ముక్కలు- కప్పు, బొప్పాయి ముక్కలు- పావుకప్పు, ద్రాక్ష- పావు కప్పు, స్ట్రాబెర్రీ ముక్కలు- పావుకప్పు, ఆపిల్‌ ముక్కలు- పావుకప్పు, పైనాపిల్‌ ముక్కలు- పావు కప్పు, పాలు- ఒకటిన్నర కప్పు, అరటిపండు ముక్కలు- పావుకప్పు, ఐస్‌క్యూబ్‌లు- కప్పు, పంచదార- రెండు చెంచాలు, తేనె- కొద్దిగా, పెరుగు- పావుకప్పు.

తయారీ: ముందుగా పండ్ల ముక్కలు, పంచదార, పెరుగు.. వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. దాంట్లో పాలు వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. అవసరమయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. తీపి సరిపోకపోతే కొద్దిగా తేనె వేసుకోవాలి. ఇప్పుడు స్మూతీని గ్లాసులోకి తీసుకొని ఐస్‌ముక్కలతో సర్వ్‌ చేసుకుంటే ఎండ నుంచి ఉపశమనంతోపాటు పోషకాలూ అందుతాయి.


పైనాపిల్‌తో..

కావల్సినవి:  పైనాపిల్‌ ముక్కలు- కప్పు, ఫ్రోజెన్‌ మామిడిపండు ముక్కలు- కప్పు, మామిడిపండు రసం- అరకప్పు, ఐస్‌ముక్కలు- ఎనిమిది, పంచదార- రెండు చెంచాలు, తేనె- కొద్దిగా, పెరుగు- పావుకప్పు.

తయారీ: పైనాపిల్‌, మామిడిపండు ముక్కలు, రసం, పంచదార, పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తని  స్మూతీ తయారయ్యాక ఒక గ్లాసులోకి తీసుకోవాలి. దాంట్లో ఐస్‌ ముక్కలు, తేనె వేసుకొని సర్వ్‌ చేసుకోవటమే


అరటి పండుతో 

కావల్సినవి: అరటిపండు ముక్కలు- కప్పు, మామిడి పండు ముక్కలు- ఒకటిన్నర కప్పు, చల్లటి పాలు- ఒకటిన్నర కప్పు, ఐస్‌ముక్కలు- కప్పు, వెనీలా ఎసెన్స్‌- అరచెంచా, తేనె- కొద్దిగా, పంచదార- రెండు చెంచాలు, పెరుగు- పావుకప్పు.

తయారీ: పండ్లముక్కలు, పాలు, పెరుగు, పంచదార, వెనీలా ఎసెన్స్‌ వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా చేసుకోవాలి. గ్లాసులోకి తీసుకొని తేనె, ఐస్‌ముక్కలు వేసుకొని సర్వ్‌ చేసుకోవటమే.


ఆపిల్‌తో 

కావల్సినవి: అరటిపండు ముక్కలు- కప్పు, ఆపిల్‌ ముక్కలు- కప్పు, గడ్డకట్టిన మామిడి పండు ముక్కలు- ఒకటిన్నర కప్పు, మామిడిపండు రసం- కప్పు, పంచదార- రెండు చెంచాలు, తేనె- కొద్దిగా, ఐస్‌ ముక్కలు- ఎనిమిది..

తయారీ: పండ్లముక్కలు, మామిడిపండు రసం, పంచదార వేసి మిక్సీ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా నీళ్లు వేసుకోండి. దాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని ఐస్‌ముక్కలు, కొద్దిగా తేనె వేసుకొని సర్వ్‌ చేసుకోవటమే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు