ఏ దోసె కావాలి?

రోజూ ఏ దోసె వేస్తాం? సాదా దోసె లేదంటే రవ్వ దోసె. మహా అయితే ఎగ్‌ దోసె. పైగా వాటిన్నింటికీ ముందే బోలెడు ప్రిపరేషన్‌ కావాలి. అలా కాకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా వేయాలి... అదీ కొత్తకొత్తగా ఉండాలి... అలాంటి దోసెలు వేసేద్దామా..!

Published : 27 Jun 2021 16:53 IST

రోజూ ఏ దోసె వేస్తాం? సాదా దోసె లేదంటే రవ్వ దోసె. మహా అయితే ఎగ్‌ దోసె. పైగా వాటిన్నింటికీ ముందే బోలెడు ప్రిపరేషన్‌ కావాలి. అలా కాకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా వేయాలి... అదీ కొత్తకొత్తగా ఉండాలి... అలాంటి దోసెలు వేసేద్దామా..!


నీర్‌ దోసె

కావలసినవి
బియ్యప్పిండి: కప్పు, కొబ్బరిపాలు: అరకప్పు, మంచినీళ్లు: తగినన్ని, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: వేయించడానికి తగినంత
తయారుచేసే విధానం
* బియ్యప్పిండిలో ఉప్పు వేసి కలపాలి. తరవాత కొంచెంకొంచెంగా నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు కొబ్బరిపాలు పోసి పలుచగా చేయాలి.
* స్టవ్‌మీద బాణలి పెట్టి పెనం కాగాక గరిటెతో పైనుంచి దోసె పిండిని చిల్లులు పడేలా వేసి కొద్దిగా నూనె చిలకరించి మూతపెట్టాలి. దోసె కాలిన తరవాత మెల్లగా అంచుల నుంచి లేపి, మధ్యకు మడిచి తీయాలి.


ఓట్స్‌ దోసె

కావలసినవి
ఓట్స్‌: అరకప్పు, బియ్యప్పిండి: అరకప్పు, జీలకర్ర: టీస్పూను, బొంబాయిరవ్వ: పావుకప్పు, పెరుగు: అరకప్పు, అల్లంతురుము: టీస్పూను, పచ్చిమిర్చి తురుము: 2 టీస్పూన్లు, మిరియాలపొడి: అరటీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లిముక్కలు: అరకప్పు, ఉప్పు: తగినంత, నీళ్లు: మూడు కప్పులు, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
* ఓట్స్‌ మిక్సీలో వేసి పొడి చేయాలి. తరవాత దానికి బియ్యప్పిండి, రవ్వ, పెరుగు జోడించి కలపాలి. తరవాత జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర తురుము, మిరియాలపొడి, ఉల్లిముక్కలు, ఉప్పు అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు మంచినీళ్లు పోసి కలిపి ఓ 20 నిమిషాలు నాననివ్వాలి.
* పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాసి పిండి మిశ్రమాన్ని గరిటెతో రవ్వదోసె మాదిరిగానే  వేయాలి. బాగా కాలిన తరవాత రెండోవైపున కూడా కాల్చి తీసి ఇష్టమైన చట్నీ లేదా కూరతో అందిస్తే సరి.


అన్నం దోసె

కావలసినవి
అన్నం: కప్పు, గోధుమపిండి: అరకప్పు, బియ్యప్పిండి: కప్పు, మంచినీళ్లు: ఒకటిన్నర కప్పులు, పెరుగు: పావుకప్పు, ఉప్పు: రుచికి సరిపడా, కుకింగ్‌సోడా: చిటికెడు, నూనె: తగినంత
తయారుచేసే విధానం
* మిక్సీలో అన్నం, గోధుమపిండి, బియ్యప్పిండి వేసి కలపాలి. తరవాత సుమారు కప్పు నీళ్లు పోసి కలపాలి. తరవాత అవసరమైతే కొంచెంకొంచెంగా మరో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు పెరుగు కూడా వేసి కలపాలి.
* ఉప్పు, వంటసోడా వేసి అవసరమైతే మరికాసిని నీళ్లు పోసి కలిపి, కాగిన పెనంమీద దోసె వేసి రెండువైపులా కాల్చి తీయాలి.


రవ్వ దోసె

కావలసినవి
బొంబాయి రవ్వ: కప్పు, బియ్యప్పిండి: కప్పు, మైదా: అరకప్పు, పచ్చిమిర్చి తురుము: 2 టీస్పూన్లు, ఉల్లితురుము: 2 టేబుల్‌స్పూన్లు, అల్లంతురుము: టీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: టీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా, నీళ్లు: తగినన్ని
తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో రవ్వ, బియ్యప్పిండి, మైదా, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి. తరవాత సుమారు ఓ కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి.
* ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. అన్నీ వేసి కలిపిన తరవాత అవసరమైతే మరికాసిని నీళ్లు పోసి మిశ్రమాన్ని పలుచగా చేయాలి. దీన్ని ఓ అరగంట పక్కన ఉంచాలి. తరవాత పెనం కాలాక దోసెలా వేసి నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.


గోధుమ దోసె

కావలసినవి
గోధుమపిండి: కప్పు, బియ్యప్పిండి: ముప్పావుకప్పు, పుల్లనిమజ్జిగ: పావుకప్పు, పచ్చిమిర్చి: ఒకటి, ఆవాలు: అరటీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, కరివేపాకు తురుము: కొద్దిగా, నూనె: తగినంత, నీళ్లు: 3 కప్పులు, ఉప్పు: సరిపడా
తయారుచేసే విధానం
* గోధుమపిండిలో బియ్యప్పిండి, పుల్లని మజ్జిగ, పచ్చిమిర్చి తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి.
* తరవాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలపాలి. బాణలిలో టీస్పూను నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక పిండి మిశ్రమంలో వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నాన్‌స్టిక్‌ పాన్‌మీద దోసెల్లా వేసి, నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని