చిన్నారులకు... నోరూరెలా!

పిల్లలు ఇంట్లో ఉండే సమయం ఇది. వాళ్లకు ఏ మాత్రం తోచకపోయినా ఆకలేస్తోందంటూ సతాయించడం మామూలే. అలాగని అన్నం, ఇడ్లీ, దోశ లాంటివి తింటారా అంటే... అబ్బే. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు తీసుకెళ్లలేం కాబట్టి... ఇంట్లోనే సాయంత్రం పూట వీటిని చేసి పెట్టేందుకు ప్రయత్నించండి.

Updated : 30 Apr 2022 15:54 IST

పిల్లలు ఇంట్లో ఉండే సమయం ఇది. వాళ్లకు ఏ మాత్రం తోచకపోయినా ఆకలేస్తోందంటూ సతాయించడం మామూలే. అలాగని అన్నం, ఇడ్లీ, దోశ లాంటివి తింటారా అంటే... అబ్బే. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు తీసుకెళ్లలేం కాబట్టి... ఇంట్లోనే సాయంత్రం పూట వీటిని చేసి పెట్టేందుకు ప్రయత్నించండి.


పొటాటో స్మైలీ

కావలసినవి: ఉడికించిన బంగాళాదుంపలు:రెండు, బ్రెడ్‌పొడి: పావుకప్పు, మొక్క జొన్నపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, కారం: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ఓ గిన్నెలో బంగాళాదుంపల ముద్ద తీసుకుని... దానిపైన నూనె తప్ప  మిగిలిన పదార్థాలన్నీ వేసి కలిపి అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత దాన్ని ఇవతలకు తీసి మరోసారి కలపాలి. ఈ ముద్దను సగం చేసి చపాతీ పీటమీద చేత్తోనే కాస్త మందంగా చపాతీలా వత్తి, ఏదయినా గుండ్రటి మూతతో దీనిమీద అక్కడక్కడా నొక్కినట్లు చేస్తే బిళ్లల్లా వస్తాయి. కళ్లకోసం స్ట్రాతో నొక్కాలి. వాటి అడుగున చెంచాతో అర్ధచంద్రాకారంలో  గీసినట్లు చేస్తే నవ్వుతున్నట్లుగా వస్తుంది. ఇలా అన్నీ చేసుకుని రెండుమూడు చొప్పున కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


తవా పిజా

కావలసినవి: గోధుమపిండి: ఒకటింబావుకప్పు, వంటసోడా: పావుచెంచా, ఉప్పు: పావుచెంచా, ఆలివ్‌నూనె: రెండుటేబుల్‌స్పూన్లు, పెరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.టాపింగ్‌ కోసం: క్యాప్సికం ముక్కలు: అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు, ఎండుమిర్చి గింజలు: అరచెంచా, మిరియాలపొడి: పావుచెంచా చీజ్‌: అరకప్పు. సాస్‌కోసం: టొమాటోలు: మూడు, ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు, వెల్లుల్లి తరుగు: ఒకటిన్నర టేబుల్‌స్పూను, ఆలివ్‌నూనె: ఒకటిన్నర టేబుల్‌స్పూను,ఎండుమిర్చి గింజలు: అరచెంచా,ఆరెగానో: పావుచెంచా, ఉప్పు: తగినంత, చక్కెర: ముప్పావుచెంచా, మిరియాలపొడి: అరచెంచా.

తయారీ విధానం: గోధుమపిండి, కొద్దిగా ఉప్పు, వంటసోడాను ఓ గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ కలపాలి. తరువాత ఆలివ్‌నూనె, పెరుగు వేసి, నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా చేసుకుని గంటసేపు నాననివ్వాలి. ఇప్పుడు సాస్‌ చేసుకోవాలి. స్టౌమీద పాన్‌పెట్టి నూనె వేసి వెల్లుల్లి తరుగుతోపాటూ మిగిలిన పదార్థాలు వేసుకోవాలి. టొమాటోలు ఉడికాక స్టౌ కట్టేయాలి. ఇది చల్లరాక మిక్సీజారులోకి తీసుకుని మెత్తగా గ్రైండ్‌ చేస్తే సాస్‌ తయారవుతుంది.  నానిన పిండిని నాలుగు ఉండల్లా చేసుకోవాలి. ఒక ఉండను కాస్త మందంగా చపాతీలా వత్తాలి. స్టౌమీద పెనంపెట్టి ఈ చపాతీని వేసి దోరగా కాల్చి ఒకవైపు సాస్‌ రాయాలి. నిమిషమయ్యాక కొన్ని క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, చీజ్‌ తురుమూ వేసి చాలా కొద్దిగా ఎండుమిర్చి గింజలు, మిరియాలపొడి అంతటా చల్లి స్టౌని సిమ్‌లో పెట్టాలి. చీజ్‌ కరిగాక తీసేయాలి. మిగిలిన చపాతీలనూ ఇలాగే చేసుకోవాలి.


చిల్లీ ఇడ్లీ

కావలసినవి: ఇడ్లీలు: అయిదు, ఉల్లిపాయ: ఒకటి, క్యాప్సికం: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి తరుగు: రెండుచెంచాలు, కారం: చెంచా, గరంమసాలా: అరచెంచా, టొమాటో కెచెప్‌: రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా, నీళ్లు: కొద్దిగా.

తయారీవిధానం: ఇడ్లీలను రెండుగంటలసేపు ఫ్రిజ్‌లో పెట్టి తరువాత ముక్కల్లా కోయాలి. వీటిని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. స్టౌమీద మరో కడాయి పెట్టి టేబుల్‌స్పూను నూనె వేయాలి.    తరువాత ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి తరుగు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించుకోవాలి. రెండు నిమిషాలయ్యాక కెచెప్‌, కారం, కొద్దిగా ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలిపి, కాసిని నీళ్లు పోయాలి. ఇది గ్రేవీలా అయ్యాక వేయించిన ఇడ్లీలు వేసి ఓసారి కలిపి  కొత్తిమీర చల్లి దింపేయాలి.


బ్రెడ్‌ దహీ వడ

కావలసినవి: బ్రౌన్‌బ్రెడ్‌ స్లైసులు: ఎనిమిది, పెరుగు: ముప్పావుకప్పు, నల్లఉప్పు:  అరచెంచా, కారం: చెంచా, జీలకర్రపొడి: చెంచా, ఉప్పు: తగినంత, మజ్జిగ: అరకప్పు, చక్కెర: పావుచెంచా, టొమాటోసాస్‌: రెండు పెద్ద చెంచాలు, నూనె: అరకప్పు.

తయారీ విధానం: బ్రెడ్‌ అంచుల్ని తీసేసి ముక్కల్లా కోసి నల్లఉప్పు, జీలకర్రపొడి, తగినంత ఉప్పు, మజ్జిగ పోసి ముద్దలా చేసుకోవాలి. వీటిని చిన్నచిన్న వడల్లా తట్టుకోవాలి. స్టౌమీద పాన్‌పెట్టి ఈ వడల్ని రెండుచొప్పున ఉంచి.. నూనె వేస్తూ రెండువైపులా కాల్చుకుని ఓ ప్లేటులోకి తీసుకోవాలి. ఇప్పుడు పెరుగు, చక్కెర, కొద్దిగా ఉప్పు ఓ గిన్నెలోకి తీసుకుని గిలకొట్టినట్లుగా కలుపుకోవాలి. వడలపైన పెరుగు వేసి టొమాటోసాస్‌, కారం, వేస్తే సరిపోతుంది. దీన్ని అప్పటికప్పుడు తయారుచేసుకుంటేనే బాగుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని