ఎండవేళలో చల్లచల్లగా...

ఎండల్లో చల్లగా ఏదైనా తిన్నా తాగినా ఆ హాయే వేరు. అందుకే ఇంట్లోనే తేలికగా చేసుకోగలిగే కొన్ని చల్లని రుచులు...

Published : 27 Jun 2021 16:46 IST

ఎండల్లో చల్లగా ఏదైనా తిన్నా తాగినా ఆ హాయే వేరు. అందుకే ఇంట్లోనే తేలికగా చేసుకోగలిగే కొన్ని చల్లని రుచులు...


కీరాదోస జ్యూస్‌

కావలసినవి
కీరాదోస: ఒకటి(తొక్కు తీసి చిన్న ముక్కలుగా కోయాలి), పుదీనా ఆకులు: ఎనిమిది, మంచినీళ్లు: 3 కప్పులు, నిమ్మరసం: టేబుల్‌స్పూను, పంచదార: 3 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: పావు టీస్పూను, మిరియాలపొడి: పావుటీస్పూను, ఐస్‌ముక్కలు: కొన్ని
తయారుచేసే విధానం
* మిక్సీలో కీరాదోస ముక్కలు, ఉప్పు, మిరియాలపొడి, పంచదార, పుదీనా ఆకులు వేసి మెత్తగా చేయాలి. తరవాత గుజ్జును వెడల్పాటి చిల్లులున్న దాంట్లో వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చేత్తో రుద్దుతూ వడబోయాలి.
* ఇప్పుడు ఇందులో నిమ్మరసం పోసి కలిపి గ్లాసుల్లో పోసి ఐస్‌క్యూబ్స్‌ వేసి అందించాలి.

 


బాదం మిల్క్‌షేక్‌

కావలసినవి
పాలు: 2 కప్పులు, బాదం: అరకప్పు, పంచదార: 4 టేబుల్‌స్పూన్లు, కస్టర్డ్‌ పౌడర్‌: 2 టీస్పూన్లు(చల్లని నీటిలో కరిగించాలి)
తయారుచేసే విధానం
* బాదం రాత్రే నానబెట్టి తొక్క తీయాలి.
* బాణలిలో రెండు కప్పుల పాలు పోసి మరిగించాలి.
* కస్టర్డ్‌ పౌడర్‌లో కాసిని చల్లని పాలు పోసి కరిగించి మరిగించిన పాలల్లో వేసి కలపాలి. తరవాత పంచదార కూడా వేసి కరిగించాలి.
* బాదం పొట్టు తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. దీన్ని మరిగించిన పాలల్లో వేసి కలిపి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీయాలి. విడిగా రెండుమూడు బాదం పప్పుల్ని సన్నని ముక్కలుగా చేసి మిశ్రమంలో వేసి గ్లాసుల్లో పోసి అందించాలి.


స్ట్రాబెర్రీ ప్రొటీన్‌ షేక్‌

కావలసినవి
పాలు: 2 కప్పులు, స్ట్రాబెర్రీలు: అరకప్పు, బాదంపొడి: టేబుల్‌స్పూను, పుచ్చగింజలపొడి: టేబుల్‌స్పూను, కకోవాపొడి: టీస్పూను
తయారుచేసే విధానం
* పాలను మరిగించి చల్లారనివ్వాలి.
* మిక్సీలో స్ట్రాబెర్రీలు, బాదంపొడి, పుచ్చగింజలపొడి, కకోవాపొడి వేసి మెత్తగా చేసి చల్లారిన పాలు పోసి బాగా గిలకొట్టి, గ్లాసుల్లో పోసి ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్లచల్లగా అందించాలి.


మసాలా సోడా

కావలసినవి
సోడా: ముప్పావు లీటరు, కోకమ్‌ సిరప్‌: 6 టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం: టేబుల్‌స్పూను, మిరియాలపొడి: పావుటీస్పూను, సైంధవలవణం: అర టేబుల్‌స్పూను, పుదీనా ఆకులు: పది, ఐస్‌ముక్కలపొడి: తగినంత
తయారుచేసే విధానం
* బీకరులో కోకమ్‌ షర్బత్‌, సైంధవ లవణం, నిమ్మరసం, మిరియాలపొడి వేసి బాగా కలపాలి.
* తరవాత సోడా కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లో పోసి తరిగిన పుదీనా ఆకులు వేసి, ఐస్‌ముక్కలపొడి వేసి అందించాలి.


బనానా స్మూతీ

కావలసినవి
అరటిపండ్లు: 2, వెనీలా యోగర్ట్‌: ఒకటిన్నర కప్పులు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌: ముప్పావు టీస్పూను, తేనె: అరకప్పు, ఐస్‌ముక్కలపొడి: అరకప్పు
తయారుచేసే విధానం
* అరటిపండ్లు, వెనీలా యోగర్ట్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, ఐస్‌ముక్కలపొడి అన్నీ మిక్సీలో వేసి బాగా గిలకొట్టి, గ్లాసుల్లో వేసి అందించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని