మామిడితో మజా మజా రుచులు!

మామిడిపండ్లతో మిల్క్‌షేక్‌, లస్సీ లాంటివి చేసుకోవడం అందరికీ తెలిసిందే. అయితే... వాటితో అవి మాత్రమే కాకుండా ఇలాంటివి కూడా ప్రయత్నిస్తే... ఈ కాలంలో ఇంట్లో ఉండే పిల్లలకు అప్పుడప్పుడూ చేసిపెట్టొచ్చు.

Published : 24 Jun 2021 19:29 IST

మామిడిపండ్లతో మిల్క్‌షేక్‌, లస్సీ లాంటివి చేసుకోవడం అందరికీ తెలిసిందే. అయితే... వాటితో అవి మాత్రమే కాకుండా ఇలాంటివి కూడా ప్రయత్నిస్తే... ఈ కాలంలో ఇంట్లో ఉండే పిల్లలకు అప్పుడప్పుడూ చేసిపెట్టొచ్చు.

బర్ఫీ

కావలసినవి
మామిడిపండు గుజ్జు: ఒకటిన్నర కప్పు, చక్కెర పొడి: ముప్పావుకప్పు, పాలపొడి: అరకప్పు, యాలకులపొడి: చెంచా, బాదం, జీడిపప్పు పలుకులు: పావుకప్పు, నెయ్యి: పావుకప్పు, కొబ్బరిపొడి: పావుకప్పు.
తయారీవిధానం  స్టౌమీద కడాయి పెట్టి చెంచా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పలుకుల్ని వేయించి తీసుకోవాలి. వాటి వేడి కొద్దిగా తగ్గాక మిక్సీలో తీసుకుని ఓసారి గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేయాలి. అది వేడెక్కాక మామిడి పండు గుజ్జు వేసి వేయించి స్టౌని సిమ్‌లో పెట్టాలి. రెండు నిమిషాలయ్యాక అందులో చక్కెరపొడి వేసి బాగా కలపాలి. ఆ తరువాత పాలపొడి, కొబ్బరిపొడి, యాలకులపొడి, బాదంపొడి వేసి అన్నింటినీ కలపాలి. ఈ మిశ్రమం పూర్తిగా దగ్గరకు అయ్యాక స్టౌ కట్టేసి నెయ్యిరాసిన ప్లేటులో పరిచి వేడి చల్లారాక ముక్కల్లా కోసుకుంటే సరి.


ఫిర్నీ

కావలసినవి
మామిడిపండ్లు: రెండు (ముక్కల్లా కోయాలి), పాలు: లీటరు, బియ్యం: పావుకప్పు, చక్కెర: అరకప్పు, పిస్తా పలుకులు: రెండు టేబుల్‌స్పూన్లు, బాదం: రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి: అరచెంచా.
తయారీవిధానం
బియ్యాన్ని కడిగి కనీసం రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీళ్లు వంపేసి బియ్యాన్ని ఆరబెట్టి... కాసేపయ్యాక పొడిలా చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ముప్పావు వంతు మామిడి ముక్కల్ని గుజ్జులా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి పాలు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు సిమ్‌లో పెట్టి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి సగం అవుతాయి. అప్పుడు బియ్యప్పిండి వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం చిక్కగా అవుతున్నప్పుడు చక్కెర, యాలకులపొడి వేసి కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి. ఇది పూర్తిగా వేడి చల్లారాక మామిడిపండు గుజ్జు వేసి బాగా కలిపి కనీసం అయిదుగంటలసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. కప్పుల్లో వడ్డించే ముందు బాదం, పిస్తా పలుకులు, కొన్ని మామిడిపండు ముక్కలు వేస్తే చాలు.


ఠండాయి

కావలసినవి బాదంపప్పులు: పావుకప్పు, జీడిపప్పు: పావుకప్పు, మిరియాలు: చెంచా, యాలకులు: పదిహేను, సోంపు: టేబుల్‌స్పూను, గసగసాలు: టేబుల్‌స్పూను, తర్బూజా గింజలు: ఒకటిన్నర టేబుల్‌స్పూను, గులాబీరేకలు: ఒకటిన్నర టేబుల్‌స్పూను, చిక్కని పాలు: లీటరు, మామిడిపండు గుజ్జు: రెండు కప్పులు, పిస్తా పలుకులు: కాసిని, చక్కెర: ముప్పావుకప్పు.
తయారీవిధానం
బాదంపప్పుల్ని ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ఆ తరువాత పొట్టుతీసి మిక్సీలో వేసుకోవాలి. ఇందులో జీడిపప్పు, మిరియాలు, యాలకులు, సోంపు, గసగసాలు, తర్బూజా గింజలు, గులాబీరేకలు, కాసిని పాలు పోసి ముద్దలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి పాలు పోయాలి. అవి మరిగాక స్టౌని సిమ్‌లో పెట్టి చక్కెర, ముందుగా చేసుకున్న మిశ్రమం వేసి బాగా కలపాలి. చక్కెర పూర్తిగా కరిగి పాలు దగ్గరకు అవుతున్నప్పుడు దింపేసి నాలుగైదు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత ఇందులో మామిడిపండు గుజ్జును కలిపి మరోసారి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది బాగా చల్లగా అయ్యాక గ్లాసుల్లోకి తీసుకుని పిస్తా పలుకులు అలంకరిస్తే సరి.


కుల్ఫీ

కావలసినవి
వెన్న తీయని పాలు: నాలుగు కప్పులు, పాలపొడి: రెండుంబావు కప్పులు, మొక్కజొన్నపిండి: ఒకటిన్నర టేబుల్‌స్పూను, డ్రైఫ్రూట్స్‌ పలుకులు: మూడు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి: చెంచా, కండెన్స్‌డ్‌ మిల్క్‌: అరకప్పు, మామిడిపండు గుజ్జు: రెండు పెద్ద కప్పులు.
తయారీవిదానం
స్టౌమీద కడాయి పెట్టి పాలు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు స్టౌని సిమ్‌లో పెట్టాలి. మొక్కజొన్నపిండిలో కాసిని పాలు కలిపి గరిటెజారుగా చేసుకుని పాలల్లో వేయాలి. ఇది చిక్కగా అవుతున్నప్పుడు పాలపొడి వేసి ఉండల్లేకుండా కలిపి రెండు నిమిషాలయ్యాక కండెన్స్‌డ్‌మిల్క్‌, డ్రైఫ్రూట్స్‌ పలుకులు, యాలకులపొడి వేసి కలిపి మిశ్రమం దగ్గరకు అయ్యాక స్టౌ కట్టేయాలి. ఇది పూర్తిగా చల్లారాక మామిడిపండు గుజ్జు వేసి కలిపి ఆ తరువాత కుల్ఫీమౌల్డ్‌లలోకి తీసుకుని అయిదు గంటలసేపు ఫ్రిజ్‌లో పెట్టి తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని