ఉండ్రాళ్లయ్యకి... ఆరగింపులు!

పిండి గోరువెచ్చగా అయ్యాక ముద్దలా కలిపి దానిమీద పలుచని తడిబట్టను వేసి ఉంచాలి. తరవాత బియ్యప్పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని ఉండలా చేసుకుని చిన్న పూరీలా వత్తి ..

Published : 26 Jun 2021 16:41 IST

కొబ్బరి మోదకాలు

కావలసినవి
తాజా కొబ్బరితురుము: ఒకటిన్నర కప్పులు, బెల్లం తురుము: కప్పు, యాలకులపొడి: అరటీస్పూను, నెయ్యి: టీస్పూను, పిండి కోసం: బియ్యప్పిండి: కప్పు, ఉప్పు: పావుటీస్పూను, నెయ్యి: టీస్పూను, మంచినీళ్లు: ఒకటిన్నర కప్పులు

తయారుచేసే విధానం
* మందపాటి బాణలిలో తాజా కొబ్బరితురుము, బెల్లం తురుము వేసి సిమ్‌లో ఉడికించాలి. అందులోనే నెయ్యి కూడా వేయాలి.
* చివరగా యాలకుల పొడి కూడా వేసి మిశ్రమం దగ్గరగా అయి ఉండ వస్తుంది అనుకున్నాక దించి పక్కన ఉంచాలి.
* మందపాటి బాణలిలో నీళ్లు పోసి, ఉప్పు, నెయ్యి వేసి మరిగించాలి. తరవాత బియ్యప్పిండి కూడా వేసి బాగా కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉంచాలి.
* పిండి గోరువెచ్చగా అయ్యాక ముద్దలా కలిపి దానిమీద పలుచని తడిబట్టను వేసి ఉంచాలి. తరవాత బియ్యప్పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని ఉండలా చేసుకుని చిన్న పూరీలా వత్తి అందులో కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి, అంచుల్ని మూసేసి మోదకం ఆకారంలో చేయాలి. ఇలాగే అన్నీ చేసుకోవాలి.
* మోదకాల్ని చేత్తోనే చేసుకోవచ్చు లేదా కజ్జికాయల మాదిరిగానే ఉండే మోల్డ్‌లో పెట్టి కూడా నొక్కి తీయవచ్చు.


ఉండ్రాళ్ల పాయసం

కావలసినవి
పెసరపప్పు: ఒకటిన్నర కప్పులు, మంచినీళ్లు: సుమారు మూడున్నర కప్పులు, కొబ్బరి తురుము: కప్పు, పంచదార: కప్పు, బెల్లం తురుము: ఒకటిన్నర కప్పులు, యాలకులపొడి: అరటీస్పూను, ఉండ్రాళ్ల కోసం: బియ్యప్పిండి: కప్పు, పంచదార: 4 టేబుల్‌స్పూన్లు, మంచినీళ్లు: ఒకటిన్నర కప్పులు

తయారుచేసే విధానం
* పెసరపప్పు కడిగి, ప్రెషర్‌ కుక్కర్‌లో వేసి, తగినన్ని నీళ్లు పోసి విజిల్‌ వచ్చే వరకూ ఐదు నిమిషాలపాటు ఉడికించాలి.
* అదే సమయంలో ఉండ్రాళ్లకోసం మరో గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి, పంచదార వేసి మరిగించాలి. తరవాత బియ్యప్పిండి వేసి పది నిమిషాలపాటు ఉడికించి, దించి పిండిని వెడల్పాటి ప్లేటులోకి వేసి చిన్న చిన్న ఉండ్రాళ్లలా చేయాలి.
* మరో నాన్‌స్టిక్‌ పాన్‌లో బెల్లం, పంచదార వేసి అవి మునిగేవరకూ నీళ్లు పోసి మరిగించాలి. తరవాత కొబ్బరి తురుము, ఉడికించిన పెసరపప్పు, ఉండ్రాళ్లు, యాలకులపొడి వేసి నెమ్మదిగా కలుపుతూ సుమారు పది నిమిషాలు సిమ్‌లో ఉడికించి దించితే మధురమైన ఉండ్రాళ్ల పాయసం రెడీ.


గోధుమ కుడుములు

కావలసినవి
గోధుమపిండి: కప్పు, బెల్లం తురుము: ముప్పావుకప్పు, కొబ్బరితురుము: 6 టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి: అరటీస్పూను

తయారుచేసే విధానం
* నాన్‌స్టిక్‌ పాన్‌లో గోధుమ పిండి వేసి సిమ్‌లో మంచి వాసన వచ్చేవరకూ వేయించాలి. తరవాత స్టవ్‌ ఆఫ్‌ చేశాక యాలకులపొడి, నెయ్యి, కొబ్బరి తురుము వేసి బాగా కలిపి అలాగే ఉంచాలి.
* విడిగా గిన్నెలో బెల్లం తురుము వేసి, తగినన్ని నీళ్లు పోసి సిమ్‌లో కరిగించాలి. తరవాత నీటిని వడబోయాలి. ఇప్పుడు ఈ కరిగించిన బెల్లం నీటిని గోధుమపిండి మిశ్రమంలో పోసి, గరిటెతో బాగా కలపాలి. అవసరమైతే మరికాసిని నీళ్లు పోసి పిండిని బాగా కలిపి నెయ్యి రాసుకుని వాటిని కావలసిన ఆకారంలో కుడుముల్లా చేసుకోవాలి. వీటిని నెయ్యి రాసిన ఇడ్లీ రేకుల్లో పెట్టి సుమారు పది నిమిషాలు ఉడికించి దించాలి.


సగ్గుబియ్యం వడ

కావలసినవి
బంగాళాదుంపలు:మూడు, సగ్గుబియ్యం: ముప్పావుకప్పు, ఉప్పు: తగినంత, జీలకర్ర: టీస్పూను, పచ్చిమిర్చి: ఒకటి, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు నిమ్మరసం: టీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* సగ్గుబియ్యం మూడు నాలుగు గంటలు నానబెట్టాలి. తరవాత నీళ్లు వంపేసి పక్కన ఉంచాలి.
* బంగాళాదుంపలు మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలా ఉడికించాలి. చల్లారాక పొట్టు తీసి గ్రేటర్‌తో తురమాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన సగ్గుబియ్యం, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. చేతులకి నూనె రాసుకుని, మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దల్లా చేసుకుని వడల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.

1 సెప్టెంబరు 2019


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని