ఊరించే... వెల్లుల్లి ఊరగాయ!

ఈ సీజనులో ఆవకాయ ఎలాగూ పెట్టుకుంటాం. దాంతోపాటూ మరికొన్ని రకాల పచ్చళ్లూ సిద్ధం చేసుకుంటే అప్పుడప్పుడూ ఆవకాయకు బదులు వాటినీ వేసుకోవచ్చు. ...

Published : 26 Jun 2021 13:04 IST

ఈ సీజనులో ఆవకాయ ఎలాగూ పెట్టుకుంటాం. దాంతోపాటూ మరికొన్ని రకాల పచ్చళ్లూ సిద్ధం చేసుకుంటే అప్పుడప్పుడూ ఆవకాయకు బదులు వాటినీ వేసుకోవచ్చు. అలాంటివే ఇవన్నీ.


నువ్వుల ఆవకాయ

కావలసినవి: మామిడికాయ ముక్కలు: రెండున్నర కప్పులు, నువ్వులు: అరకప్పు, కారం: అరకప్పు, ఆవపిండి: అరకప్పు, ఉప్పు: తగినంత, నువ్వులనూనె: ముప్పావుకప్పు.
తయరీ విధానం: ముందుగా నువ్వుల్ని నూనె లేకుండా వేయించుకుని పొడి చేసుకోవాలి. ఓ గిన్నెలో నువ్వులపొడి, కారం, ఆవపిండి, తగినంత ఉప్పు తీసుకుని అన్నింటినీ కలపాలి. ఇందులో మామిడి ముక్కలు వేసి కారం అన్నింటికీ పట్టేలా కలపాలి. తరువాత నూనె పోసి మరోసారి కలిపి సీసాలోకి తీసుకోవాలి. రెండు రోజులయ్యాక ఇది ఊరుతుంది. అప్పుడు తిరగగలపాలి. అవసరం అనుకుంటే   మరికొంచెం నూనె పోసుకుంటే... పచ్చడి సిద్ధమైనట్లే.


వడు మంగాయ్‌

కావలసినవి: మామిడి పిందెలు: ఆరు కప్పులు, కారం: కప్పు, ఆవపిండి: కప్పు, ఉప్పు: కప్పు, పసుపు: రెండు టేబుల్‌స్పూన్లు, నూనె: టేబుల్‌స్పూను.
తయారీ విధానం: ఓ గిన్నెలో పసుపు, ఉప్పు తీసుకుని కలుపుకోవాలి. మామిడి పిందెల్ని కడిగి, తొడిమల్ని తీసేయాలి. వీటికి కొద్దిగా నూనె రాసి పెట్టుకోవాలి. వెడల్పాటి మూతి ఉన్న సీసాలో ఒక వరస ఉప్పు వేసి, దానిపైన రెండుమూడు మామిడిపిందెల్ని వేసి మళ్లీ ఉప్పు వేయాలి. ఇలా పిందెలన్నింటినీ వేసుకుని మూత పెట్టాలి. మూడో రోజుకు మామిడి పిందెల నుంచి నీరు వస్తుంది. అప్పుడు ఆవపిండి, కారం కలిపి సీసాలో వేసి బాగా కుదిపి మూత పెట్టాలి. ఇది బాగా ఊరాక తింటే సరి. దీనికి నూనె అవసరం పెద్దగా ఉండదు. కావాలనుకుంటే ఈ పచ్చడి పూర్తిగా తయారయ్యాక తాలింపు పెట్టుకోవచ్చు.


వెల్లుల్లి ఆవకాయ

కావలసినవి: పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు: అరకప్పు, మెంతులు: అరటేబుల్‌స్పూను, ఆవాలు: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు, నువ్వులు: ముప్పావు టేబుల్‌స్పూను, కారం: మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నిమ్మకాయ: ఒకటి, బెల్లం తరుగు: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు, నూనె: ముప్పావుకప్పు.
తయారీ విధానం: వెల్ల్లుల్లి రెబ్బల్ని మూడునాలుగు గంటలసేపు ఎండలో ఉంచి తీసుకోవాలి. స్టౌమీద పాన్‌పెట్టి, మెంతులు, నువ్వులు, ఆవాల్ని నూనె లేకుండా విడివిడిగా వేయించుకుని ఆ తరువాత అన్నింటినీ దేనికదే పొడి చేసుకోవాలి. వెడల్పాటి గిన్నెలో వెల్లుల్లి రెబ్బలు తీసుకుని, వీటిపైన ఒక్కొక్క పదార్థం వేసుకుంటూ అన్నింటినీ కలిపి మూత పెట్టాలి. ఓ రోజయ్యాక మళ్లీ కలిపి అవసరం అనుకుంటే మరికాస్త నూనె పోయాలి. ఈ ఊరగాయ రెండుమూడు వారాల పాటు ఉంటుంది.


నీళ్ల మాగాయ

కావలసినవి: సన్నగా పొడుగ్గా తరిగిన మామిడి ముక్కలు: ఒకటిన్నర కప్పు, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, వెల్లుల్లి తరుగు: పావుకప్పు, ఎండుమిర్చి: రెండు, కరివేపాకు: ఒక రెబ్బ, నువ్వులనూనె: మూడు టేబుల్‌స్పూన్లు, కారం: మూడు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: అరచెంచా, వేయించిన మెంతులపొడి: అరచెంచా, ఇంగువ: పావు చెంచా, నీళ్లు: ఒకటిన్నర కప్పు.
తయారీ విధానం: మామిడిముక్కలపైన పసుపు, సరిపడా ఉప్పు వేసి ఓసారి కలిపి మూత పెట్టాలి. మర్నాడు వాటిని ప్లేటులోకి తీసుకుని ఎండలో పెట్టాలి. అవి ఒరుగుల్లా అయ్యేవరకూ ఎండబెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి. రెండు నిమిషాలయ్యాక ఇంగువ, కారం, మెంతిపొడి, ఎండబెట్టిన మామిడి ముక్కలు ఒకదాని తరువాత మరొకటి వేసి, నీళ్లు పోసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. మామిడి ముక్కలకు మసాలా పట్టి... పచ్చడిలా అయ్యాక దింపేయాలి. ఇది టిఫిన్లు, పెరుగన్నంలోకి బాగుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని