వంటింట్లో లంకోత్సవం

లంకంత ఇల్లు.. పెద్ద ఇల్లని గర్వంగా చెప్పడానికి వాడే పదం. లంకంత రుచి. అంటే. అల్లాటప్పా రుచి కాదు. కుంభకర్ణుడి ముక్కుపుటాలు అదరగొట్టిన ఘుమఘుమలవి ఆ భోజనప్రియుడి జిహ్వ చాపల్యమంతా తీర్చిన పసందైన వంటకాలవి...

Updated : 30 Jun 2019 00:13 IST

లంకంత ఇల్లు.. పెద్ద ఇల్లని గర్వంగా చెప్పడానికి వాడే పదం.. లంకంత రుచి.. అంటే.. అల్లాటప్పా రుచి కాదు.. కుంభకర్ణుడి ముక్కుపుటాలు అదరగొట్టిన ఘుమఘుమలవి ఆ భోజనప్రియుడి జిహ్వ చాపల్యమంతా తీర్చిన పసందైన వంటకాలవి.. రామాయణంలోని ఈ ఘట్టమొక్కటి చాలు.. లంకేయులు ఎంతటి భోజనప్రియులో.. మరెంతటి పాకయాజులో చెప్పడానికి. యుగాలు దాటినా.. కొత్త రుచులను వడ్డించడంలో వారి తీరు మారలేదు. కావాలంటే ఈ సింహళ ద్వీప వెరైటీలు మీరూ ప్రయత్నించి చూడండి..

పరదేశీ పసందు!

ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన అత్యుత్తమ టీల్లో సిలోన్‌ బ్లాక్‌టీ ఒకటి. క్రిమిసంహారకాలు అతి తక్కువ ఉన్న తేయాకుగా పేరుగాంచింది.
దాల్చిన చెక్కను ఎక్కువగా ఎగుమతి చేసే దేశం శ్రీలంక.

వాంబతు మోజు / వంకాయ పచ్చడి

కావాల్సినవి: వంకాయలు- అరకిలో, సాంబారు ఉల్లిపాయలు(చిన్నవి)- పావుకిలో, నూనె- పావుకిలో, పచ్చిమిర్చి- 100గ్రా, అల్లంవెల్లుల్లిపేస్ట్‌- చెంచా, కారం- చెంచా, అప్పడికప్పుడు దంచిన ఆవపిండి- అరచెంచా, వెనిగర్‌- ముప్పావుకప్పు, చక్కెర- చెంచా, ఉప్పు- తగినంత
తయారీ: వంకాయలని సన్నగా పొడవుగా లేదా నచ్చిన ఆకృతిలో తరిగి పెట్టుకోవాలి. వీటిని ఒక గిన్నెలో పసుపు, ఉప్పు, నీళ్లు వేసి అందులో వంకాయ ముక్కలని వేసి పది నిమిషాలపాటు పక్కన ఉంచాలి. మందపాటి పాత్రలో నూనె పోసుకుని నీళ్లు పిండేసిన వంకాయ ముక్కలని బంగారువర్ణంలోకి వచ్చేంతవరకూ వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలకి, పచ్చిమిర్చికి గాట్లు పెట్టి వాటినీ నూనెలో వేయించుకోవాలి. వీటిని పేపర్‌ టవల్‌లో ఉంచి అధికంగా ఉన్న నూనెను పీల్చుకునేలా చేయాలి. ఒక పాత్రలో అల్లంవెల్లుల్లి పేస్ట్‌, ఆవపిండి, ఉప్పు, కారం, పంచదార, వెనిగర్‌ అన్నింటిని కలిపి సాస్‌లా తయారుచేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమంలో వేయించిన వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలిపి తాలింపు వేసుకోవాలి. నాలుగైదు గంటల తర్వాత తింటే బాగుంటుంది.

ఎగ్‌ హాపర్స్‌ / గుడ్డు ఆప్పమ్‌

కావాల్సినవి: నానబెట్టిన బియ్యం- రెండు కప్పులు, అన్నం- కప్పు, కొబ్బరి కోరు- కప్పు, బ్రెడ్‌ స్లైసులు- మూడు, పంచదార- పావుచెంచా, బేకింగ్‌సోడా- పావుచెంచా, ఉప్పు- తగినంత, మిరియాలపొడి- పావుచెంచా, గుడ్లు- నాలుగు
తయారీ: నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఆ తర్వాత అన్నం, కొబ్బరికోరు, బ్రెడ్‌స్లైసులు కూడా వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకుని బియ్యప్పిండితో కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. తెల్లారి ఆ పిండిలో పంచదార, బేకింగ్‌సోడా, ఉప్పు వేసుకుని పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ హాపర్స్‌ లేదా ఆప్పమ్‌ తయారుచేసుకోవడానికి ప్రత్యేకించి కడాయిలు ఉంటాయి. ఇవి కాస్త లోతుగా ఉంటాయి. కొద్దిగా నూనె వేసుకుని ఇందులో ఓ గరిటె పిండి వేసి దానిపై గరిటె పెట్టకుండా కడాయిని అటూఇటూ తిప్పాలి. ఒక నిమిషం ఆగి అందులో గుడ్డు పగలకొట్టి వేసి మూత పెట్టేయాలి. దానిపై మిరియాలపొడి చల్లుకుంటే గుడ్డు ఆప్పమ్‌ సిద్ధం. ఇలానే మిగిలిన గుడ్లతో కూడా ఆప్పమ్‌ వేసుకోవాలి.

ఆస్మీ

కావాల్సినవి: బియ్యప్పిండి- అరకిలో, కొబ్బరి పాలు- మూడు కప్పులు, పంచదార- కప్పున్నర, వెనిల్లా ఎసెన్స్‌- కొద్దిగా, పచ్చి దాల్చిన చెక్క ఆకులు- పది లేదా బెండకాయలు- నాలుగు, నూనె- తగినంత
తయారీ: బియ్యాన్ని నానబెట్టి నీళ్లు వడకట్టి ఆ బియ్యాన్ని పొడికొట్టుకోవాలి. పచ్చిదాల్చినచెక్క ఆకుల్లో కొద్దిగా కొబ్బరికోరు వేసి చేత్తో నలిపితే జిగురు వస్తుంది. ఇవి అందుబాటులో లేకపోతే... బెండకాయలని కొద్దిగా నీళ్లు పోసి మిక్సీపడితే బెండకాయ జిగురు వస్తుంది. ఈ జిగురుని తీసుకుని బియ్యప్పిండిలో కొద్దికొద్దిగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కొబ్బరిపాలను కలిపి మరీ జారుగా కాకుండా కలిపి పెట్టుకోవాలి. కళాయిలో నూనె పోసుకుని వేడెక్కాక.. చేతివేళ్లను పిండిలో ముంచి కదుపుతూ సన్నకారప్పూస మాదిరిగా వేసుకోవాలి. చిల్లుల గరిటెతో కూడా వేసుకోవచ్చు. వీటిని నూనెలోంచి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారాక... పంచదార పాకం పట్టుకుని అందులో వెనిల్లా, కొద్దిగా ఫుడ్‌ కలర్‌ కలుపుకొని షుగర్‌ సిరప్‌ తయారుచేసుకోవాలి. ఈ పాకాన్ని తయారుచేసి పెట్టుకున్న వాటిపై చిలకరిస్తే ఆస్మీ సిద్ధం.

కుకుల్‌ మాస్‌ కర్రీ

కావాల్సినవి: మసాలాపొడి కోసం: ధనియాలు- చెంచా, జీలకర్ర- చెంచా, మిరియాలు- చెంచా, ఆవాలు- అరచెంచా, లవంగాలు- నాలుగు, మెంతులు- పావుచెంచా, యాలకులు- మూడు, సోంపు- అరచెంచా, ఎండుమిరపకాయలు- నాలుగు, దాల్చినచెక్క చిన్నది- ఒకటి
కూరకోసం: చికెన్‌- 300గ్రా, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- చెంచా, ఉల్లిపాయలు- రెండు, ఎండు మిరపకాయలు- రెండు, ఉల్లికాడలు- రెండు, పసుపు- తగినంత, ఉప్పు- తగినంత, కొబ్బరిపాలు- పావులీటరు, నూనె- తగినంత
తయారీ: ఒక పాన్‌లో మసాలా పొడికోసం సిద్ధం చేసుకున్న దినుసులని తక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు మందపాటి అడుగున్న ప్రెజర్‌ కుక్కర్‌లాంటి పాత్రను తీసుకుని నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయలు, ఎండు మిరపకాయలు వేసి వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్‌, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. అవన్నీ పూర్తిగా వేగాక రెడీగా పెట్టుకున్న మసాలాపొడి వేసి బాగా కలిపి చికెన్‌ ముక్కలని అందులో వేసుకోవాలి. మసాలా మొత్తం ముక్కలకు పట్టి రంగుమారే సమయానికి ఉప్పు, రెండు కప్పుల నీళ్లని జోడించుకోవాలి. కుక్కర్‌ మూతపెట్టి మూడు విజిల్స్‌ వచ్చిన తర్వాత మూత తీసి తక్కువ మంట మీద ఉంచి కొబ్బరి పాలు కలుపుకోవాలి. అవి ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత పొయ్యి కట్టేయడమే.

కొట్టు రోటీ

కావాల్సినవి: పుల్కా లేదా చపాతీలు- ఏడు(రోటీలని సన్నగా నూడుల్స్‌లా చాకుతో తరిగి పెట్టుకోవాలి), గుడ్లు- మూడు, ఉల్లిపాయ- ఒకటి, కరివేపాకు రెబ్బలు- రెండు, దాల్చినచెక్క- ఒకటి, జీలకర్ర- అరచెంచా, పచ్చిమిర్చి- నాలుగు, క్యారెట్‌ తురుము- నాలుగు చెంచాలు, ఉల్లికాడలు- రెండు, వెల్లుల్లిపలుకులు- అరచెంచా, అల్లం తురుము- అరచెంచా, చిల్లీ ఫ్లేక్స్‌, ఉప్పు- రుచికి తగినంత, కాయగూరముక్కలు( క్యాబేజీ, బఠాణీలు, పుట్టగొడుగులు)- కప్పు, పసుపు- తగినంత, ఉప్పు- రుచికి తగినంత, బటర్‌- తగినంత, నూనె- తగినంత
తయారీ: వెడల్పాటి పాన్‌లో కొద్దిగా బటర్‌, నూనె వేసి వేడి చేసుకోవాలి. కరివేపాకు, దాల్చినచెక్క, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి పలుకులు, అల్లం తురుము, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగాక క్యారెట్‌, కాయగూర ముక్కలు వేసి వేయించాక చిల్లీఫ్లేక్స్‌, పసుపు, మిరియాలపొడి, ఉప్పు వేసి చివరిగా గుడ్లు కూడా పగలకొట్టి వేసుకోవాలి. ఇవన్నీ  వేగిపోయాక అప్పుడు రోటీముక్కలు కూడా వేసి కలిపి వేయించుకోవాలి. స్టౌ కట్టేసి మూత పెట్టేయాలి. ఆవిరిమీద చపాతీముక్కలు ఉడికి రుచిగా ఉంటాయి.
కొబ్బరిపాలు, పచ్చి పనసతో చేసిన వంటకాలని చాలా ఇష్టంగా తింటారు. పచ్చిపనసతో మసాలా పెట్టి చేసే పోలోస్‌ అనే వంటకాన్ని వీళ్లు భలే పసందుగా చేసుకుంటారు. దాదాపుగా వీరి వంటకాలన్నీ కొబ్బరిపాలతోనే చేస్తారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని