వయసు కువకువలాడేలా!

చలువ అని కీరా ముక్కలతో కలువ కన్నులు మూసేస్తాం.. మేను నిగనిగలాడాలని దానిమ్మ రసాన్ని పూతపూస్తాం.. పైపై మెరుగులు ఆ పూటకు పనికొస్తాయి.. వయసుకు గాలం వేసి అందాన్ని అందలం ఎక్కించాలంటే.. ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాల్సిందే! అందులో ఈ వెరైటీలు ఉండాల్సిందే..

Updated : 21 Jan 2023 16:51 IST

ఆహారం- అందం

చలువ అని కీరా ముక్కలతో కలువ కన్నులు మూసేస్తాం.. మేను నిగనిగలాడాలని దానిమ్మ రసాన్ని పూతపూస్తాం.. పైపై మెరుగులు ఆ పూటకు పనికొస్తాయి.. వయసుకు గాలం వేసి అందాన్ని అందలం ఎక్కించాలంటే.. ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాల్సిందే! అందులో ఈ వెరైటీలు ఉండాల్సిందే..
యాంటీ ఏజింగ్‌ ఫుడ్‌. వయసుని వెనక్కి పరుగులు పెట్టించే ఆహారం. దీని ప్రయోజనం జీవితకాలాన్ని పెంచడం మాత్రమే అనుకుంటే పొరపాటు. ఆరోగ్యవంతమైన చర్మం, నిగనిగలాడే జుట్టు వంటివి కూడా తోడయ్యేలా చేసి పెరుగుతున్న వయసు ఛాయలని తొలగించి యౌవ్వనంగా కనిపించేటట్టు చేస్తుంది.
మేని మెరుపు తగ్గకూడదంటే?: అందం బయట నుంచి రాదు... లోపల నుంచి ప్రారంభమవుతుంది. ఆశ్చర్యపోవద్దు. జీర్ణశక్తి చక్కగా ఉంటే తక్కిన వ్యవస్థలన్నీ సవ్యంగా పనిచేసి ఆ అందమంతా ముఖంలో ప్రతిఫలిస్తుంది.
ఆరోగ్యకరమైన చర్మానికి: ముదురురంగు కాయగూరల నుంచి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. మామిడి, బొప్పాయి, గుమ్మడి, క్యారెట్‌, చిలగడదుంపలు వంటివి మేని సౌందర్యాన్ని పెంచుతాయి.
* ముఖంలో వయసుతోపాటు వచ్చే ముడతలు, మచ్చలు పోవాలంటే విటమిన్‌ సి అధికంగా ఉండే పండ్లని తీసుకోవాలి.
* చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, తృణధాన్యాలతో చేసిన అల్పాహారాలు విటమిన్‌ డిని తగినంతగా అందించి... ఎముకలు, జుట్టు, చర్మం, దంతాలని బలంగా ఉంచుతాయి.
* విటమిన్‌ కె తగినంతగా అందితే చర్మం సాగేగుణం కోల్పోకుండా ఉంటుంది.


పెసలతో సలాడ్‌
కావాల్సినవి: దానిమ్మ గింజలు- అరకప్పు, ఉడికించిన గుడ్డు- ఒకటి, మొలకెత్తిన పెసలు- పావుకప్పు
తయారీ: ఒక గిన్నెలో దానిమ్మ గింజలు, మొలకెత్తిన పెసలని కలుపుకోవాలి. వీటికి ఉడికించిన గుడ్డు తోడయితే శక్తిమంతమైన సలాడ్‌ తయారవుతుంది.
* ఈ సలాడ్‌ చెడు కొలెస్ట్రాల్‌ని నియంత్రించి గుండెజబ్బులు రాకుండా నివారిస్తుంది. తగినన్ని ప్రొటీన్లతోపాటు వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి, డి లని అధికంగా అందించే సలాడ్‌ ఇది.


సోయా తోటకూర
కావాల్సినవి: సోయాగ్రాన్యూల్స్‌- ముప్పావుకప్పు, తోటకూర- కట్ట(ఎర్రతోటకూర దొరికితే ఇంకా మంచిది), జీలకర్ర- పావుచెంచా, నూనె- తగినంత, ఎండుమిర్చి- రెండు, ఉప్పు- తగినంత, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, ధనియాలపొడి- అరచెంచా  
తయారీ: ముందుగా సోయాగ్రాన్యూల్స్‌ని ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత  సోయాపలుకుల్లోని నీళ్లని పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి పాత్రను తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి జీలకర్ర, దంచిన వెల్లుల్లి పలుకులు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగాక అందులో తరిగిన తోటకూర, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తోటకూర ఉడికిన తర్వాత.. సోయాపలుకులు వేసి బాగా కలిపి మళ్లీ ఓ పదినిమిషాలపాటు ఉడికించుకోవాలి. చివరిగా ధనియాలపొడి వేసుకుని దింపుకొంటే సరి.
* ప్రొటీన్లతోపాటు కెరొటిన్‌, విటమిన్‌ కెలని అందించి రక్తహీనత రాకుండా చూస్తుందీ కూర.


ఇంగువ టీ
కావాల్సినవి:
ధనియాలపొడి- అరచెంచా లేదా తాజా కొత్తిమీర- నాలుగైదు కాడలు, ఇంగువ- చిటికెడు, నిమ్మరసం- కొద్దిగా, దాల్చినచెక్కపొడి- చిటికెడు, నీళ్లు- రెండు కప్పులు
తయారీ: ధనియాలపొడి వేసుకుని నీళ్లని మరిగించుకుని చివర్లో ఇంగువ వేసి దింపుకోవాలి. రుచికోసం నిమ్మరసం కలుపుకోవచ్చు.
* ఈ టీ నుంచి క్వైరిసిటిన్‌ అనే శక్తిమంతమైన పాలీఫినాల్స్‌ అందుతాయి. వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవడానికీ, క్యాన్సర్‌పై పోరాడటానికి ఈ ఫ్లెవనాయిడ్‌ ఉపకరిస్తుంది.


గడ్డి నువ్వుల జావ
కావాల్సినవి: గడ్డి నువ్వులు- రెండు చెంచాలు, రాగిపిండి- పావుకప్పు, గోధుమగడ్డి పొడి- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత
తయారీ: ముందుగా గడ్డి నువ్వులని మిక్సీలో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు లోతైన పాత్రలో తగినన్ని నీళ్లు తీసుకుని ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఇందులో గడ్డినువ్వులు, రాగిపిండి, గోధుమగడ్డిపొడి వేసి జావలా కాచుకోవాలి.  

* ఈ జావలో పాలీఫినాల్స్‌, చర్మానికి అందాన్నిచ్చే విటమిన్‌ ఇ అధికంగా ఉంటాయి.


ఎర్రజామతో చాట్‌
కావాల్సినవి: ఎర్రజామకాయ- ఒకటి, ఉడికించిన బార్లీలు- రెండు చెంచాలు, ఉల్లిపాయముక్కలు- చెంచా, ఉడికించిన స్వీట్‌కార్న్‌- మూడుచెంచాలు, పుదీనాఆకులు- ఐదు, నిమ్మకాయరసం- అరచెంచా, ఉప్పు- కొద్దిగా
తయారీ: ఒక పాత్రలో ఉల్లిపాయముక్కలు, తరిగిన ఎర్రజామకాయముక్కలు, ఉడికించిన బార్లీలు, స్వీట్‌కార్న్‌, పుదీనాఆకులు, ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకొంటే చక్కని చాట్‌ తయారవుతుంది.
* ఫోలిక్‌యాసిడ్‌, విటమిన్‌సితోపాటు... ప్రోబయాటిక్‌ ప్రయోజనాలని అందించే చాట్‌ ఇది.


అవిసెగింజల స్మూథీ
కావాల్సినవి:
వేయించిన అవిసెగింజలు- 10గ్రా, బొప్పాయిగింజలు- 200గ్రా, తరిగిన బీట్‌రూట్‌- 50గ్రా
తయారీ: వీటన్నింటిని కలిపి మిక్సీలో మెత్తగా స్మూథీలా చేసుకుని తాగొచ్చు.
* యాంటీఆక్సిడెంట్లు, పీచు అధికంగా ఉండే స్మూథీ వల్ల బరువు తగ్గడం తేలిక. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని