చిరుధాన్యాలతో...కరకరలు!

ఓ చల్లని సాయంకాలం కాస్త వేడివేడిగా ఏమైనా తినాలనుందా.. అలా తినే వాటిలో పోషకాలూ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుందా.. అయితే ఈ చిరుతిళ్లు మీకోసమే. ఇంకెందుకాలస్యం... నూనెలో అందమైన ముగ్గులు వేస్తారో... చందమామలనే వదిలేస్తారో అంతా మీ ఇష్టం...

Updated : 15 Jun 2021 13:00 IST

ఓ చల్లని సాయంకాలం కాస్త వేడివేడిగా ఏమైనా తినాలనుందా.. అలా తినే వాటిలో పోషకాలూ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుందా.. అయితే ఈ చిరుతిళ్లు మీకోసమే. ఇంకెందుకాలస్యం... నూనెలో అందమైన ముగ్గులు వేస్తారో... చందమామలనే వదిలేస్తారో అంతా మీ ఇష్టం...

ఊదల పకోడి

కావాల్సినవి: ఊదలు- కప్పు, సెనగపిండి- కప్పు, కారం- టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు- టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి- ఆరు, కరివేపాకు- కొద్దిగా, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు- నాలుగు, ఉప్పు- తగినంత, నెయ్యి- కొద్దిగా.
తయారీ: ఊదల్ని ఎనిమిది గంటలపాటు నానబెట్టి తర్వాత ఎండబెట్టుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. గిన్నెలో ముందుగా నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. దీంట్లో ఊదలపిండి, సెనగపిండి మిగిలిన పదార్థాలన్నీ వేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపాలి. అరగ్లాసు నీళ్లు పోసి పిండిని ముద్దలా చేయాలి. పిండి మరీ పలచగా, గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి పకోడీలు వేసుకుని ఎర్రగా వేయించాలి.  వేరుసెనగ నూనె వాడితే పకోడీలు మరింత రుచిగా ఉంటాయి.


జొన్న జంతికలు

కావాల్సినవి: జొన్నపిండి- రెండు కప్పులు,  బియ్యప్పిండి- కప్పు, ఉప్పు- సరిపడా, కారం- టేబుల్‌స్పూన్‌, వాము- అర టీస్పూన్‌(కాస్త నలపాలి), జీలకర్ర- టీస్పూన్‌, తెల్లనువ్వులు- టేబుల్‌స్పూన్‌.
తయారీ: వెడల్పాటి గిన్నెలో జొన్నపిండి, బియ్యప్పిండి... మిగిలిన పదార్థాలన్నీ వేసి కాస్త నూనె వేడిచేసి పోయాలి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలపాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి జంతికలు వేసుకుని రెండు వైపులా వేయించాలి. వీటిని వేయడానికి ముందు జంతికల గొట్టంలో నూనె రాస్తే అవి నున్నగా, చక్కగా వస్తాయి.


చిరుధాన్యాల లడ్డు

కావాల్సినవి: కొర్రలు, అవిసెగింజలు, నువ్వులు- కప్పు చొప్పున, బాదం, జీడిపప్పు- గుప్పెడు, నెయ్యి- రెండు టేబుల్‌స్పూన్లు, బెల్లం తురుము- కప్పున్నర, యాలకుల పొడి- చిటికెడు.
తయారీ: కొర్రలు, అవిసె గింజలు, నువ్వులను తక్కువ మంట మీద నూనె లేకుండా వేర్వేరుగా వేయించి చల్లార్చుకోవాలి. కడాయిలో నెయ్యి వేసి వేడిచేసి జీడిపప్పు, బాదం వేయించుకోవాలి. వీటిని కొర్రలు, అవిసెగింజల్లో వేసుకుని కాస్త బరగ్గా పొడిచేసుకోవాలి. చివర్లో బెల్లం పొడి వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమంలో యాలకుల పొడి, నెయ్యి వేసి గుండ్రంగా ఉండలు చుట్టాలి. పోషకాలు అధికంగా ఉండే ఈ లడ్డూలు పిల్లలు, పెద్దల ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి.


కొర్ర చెక్కలు

కావాల్సినవి: కొర్రపిండి- కప్పు, బియ్యప్పిండి- పావుకప్పు, జీలకర్ర- టీస్పూన్‌, ఉప్పు- తగినంత, కరివేపాకు, కొత్తిమీర తురుము- రెండు టీస్పూన్ల చొప్పున, పచ్చిమిర్చి పేస్టు- టీస్పూన్‌.
తయారీ: గిన్నెలో కొర్రపిండి, బియ్యప్పిండి మిగిలిన పదార్థాలన్నీ వేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా వేడినూనె పోస్తే చెక్కలు కరకరలాడుతూ వస్తాయి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలపాలి. తర్వాత చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి. నూనె రాసిన కవరు మీద ఉండలను పెట్టుకుని చెక్కల్లా ఒత్తుకోవాలి. ఇవి కాస్త పలచగా, గుండ్రంగా ఉండేలా చూసుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి చెక్కలను రెండు వైపులా వేయించి తీయాలి. ఒకేసారి మూడు నాలుగు చెక్కలను వేయించుకోవచ్చు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని