చక్కెరలేని చక్కని స్వీట్లు!

స్వీట్లులేని దీపావళి పండగను ఊహించలేం కదా... ఆ మాటకొస్తే పండగేదైనా దానికి అదనపు రుచిని తెచ్చేవి స్వీట్లు మాత్రమే. కానీ పంచదారతో చేసినవి ఆరోగ్యానికి మంచిదికాదుగా అంటారా... అయితే చక్కెరలేని ఈ చక్కని స్వీట్లు మీ కోసమే....

Updated : 15 Jun 2021 12:59 IST

స్వీట్లులేని దీపావళి పండగను ఊహించలేం కదా... ఆ మాటకొస్తే పండగేదైనా దానికి అదనపు రుచిని తెచ్చేవి స్వీట్లు మాత్రమే. కానీ పంచదారతో చేసినవి ఆరోగ్యానికి మంచిదికాదుగా అంటారా... అయితే చక్కెరలేని ఈ చక్కని స్వీట్లు మీ కోసమే.


ఆపిల్‌ బాసుంది

కావాల్సినవి:  టోన్డ్‌మిల్క్‌- అరలీటరు, కుంకుమపువ్వు రేకలు- ఎనిమిది (వీటిని గోరువెచ్చని పాలల్లో నానబెట్టాలి), యాలకుల పొడి- పావు టీస్పూన్‌, సన్నగా తురిమిన ఆపిల్‌- కప్పు, చియాసీడ్స్‌- టీస్పూన్‌, షుగర్‌ సబ్‌స్టిట్యూట్‌ - నాలుగు గ్రా., నిమ్మరసం- అర టీస్పూన్‌, బాదం, పిస్తా తురుము- రెండు టీస్పూన్లు.
తయారీ: మందపాటి గిన్నెలో పాలు పోసి తక్కువ మంట మీద గంటపాటు మరిగించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. దీంట్లో మూడు గ్రాముల షుగర్‌ సబ్‌స్టిట్యూట్‌, యాలకుల పొడి వేసి కలిపి పావుగంటపాటు మరిగించాలి. ఇప్పుడు గిన్నెలో ఆపిల్‌తురుము, కొద్దిగా షుగర్‌ సబ్‌స్టిట్యూట్‌ వేసి కాసిన్ని నీళ్లు పోయాలి. దీన్ని మూడు నిమిషాల పాటు ఉడికించి, చల్లార్చి ఈ మిశ్రమాన్ని పాలల్లో వేయాలి. దీంట్లో నానబెట్టిన చియాసీడ్స్‌ వేసి బాగా కలిపితే ఆపిల్‌ బాసుందీ సిద్ధమవుతుంది. చివరగా బాదం, పిస్తా తురుముతో అలంకరించాలి.


సొరకాయ హల్వా

కావాల్సినవి: లేత సొరకాయ - సగం ముక్క,  నెయ్యి- టేబుల్‌స్పూన్‌, జీడిపప్పు, కిస్‌మిస్‌, బాదం- గుప్పెడు, బెల్లంతురుము- అరకప్పు, పాలు- కప్పు, యాలకుల పొడి- చిటికెడు.
తయారీ: సొరకాయ విత్తనాలను తీసేసి సన్నగా తురుమి పెట్టుకోవాలి. తర్వాత గట్టిగా పిండి దీంట్లోని నీళ్లు తీసేయాలి. కడాయిలో నెయ్యి వేసి తక్కువ మంట మీద జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌లను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో సొరకాయ తురుము వేసి తక్కువ మంట మీద పది నిమిషాలపాటు వేయించాలి. దీంట్లోనే బెల్లం తురుము వేసి కరిగేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు పాలు పోసి తక్కువ మంట మీద అవి ఇగిరేంత వరకు ఉడికించాలి. తర్వాత యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌, బాదం వేసి దించేయాలి. ఈ మిశ్రమాన్ని నచ్చిన ఆకృతిలో కోసుకోవాలి.


అవిసెగింజల లడ్డు

కావాల్సినవి: గోధుమరవ్వ- అరకప్పు, గోధుమపిండి- అరకప్పు, అవిసెగింజలు- మూడు టేబుల్‌స్పూన్లు, నెయ్యి- ఐదు టేబుల్‌స్పూన్లు, బెల్లం తురుము- పావుకప్పు, బాదం, పిస్తా తురుము- మూడు టీస్పూన్లు, ధనియాలు, జాజికాయ పొడి- పావు టీస్పూన్‌ చొప్పున.
తయారీ: గోధుమరవ్వను నాలుగైదు గంటలపాటు నానబెట్టాలి. అవిసెగింజలను తక్కువ మంట మీద దోరగా వేయించి, చల్లారిన తర్వాత పొడి చేయాలి. గోధుమ పిండిని దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు గోధుమరవ్వలోని నీటిని వడకట్టాలి. మందపాటి గిన్నెలో నెయ్యి పోసి వేడిచేసి గోధుమరవ్వ వేసి రంగు మారేంతవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో నెయ్యి, బెల్లం తరుము వేసి పాకం పట్టి కలుపుతూ ఉండాలి. దీంట్లో  అవిసెగింజలపొడి, వేయించిన గోధుమపొడి, ధనియాలపొడి, బాదం, పిస్తా తురుము వేసి బాగా కలపాలి. తర్వాత గోధుమపిండిని వేయాలి. ఈ మిశ్రమాన్ని ఉండల్లా చుట్టి బాగా ఆరిన తర్వాత భద్రపరచాలి.


డేట్స్‌ లడ్డు

కావాల్సినవి:  జొన్నపిండి- అరకప్పు, గింజలు తీసి, సన్నగా తురిమిన డేట్స్‌- పన్నెండు, బాదం, వాల్‌నట్స్‌ తురుము- మూడు టేబుల్‌స్పూన్లు, నీళ్లు- అరకప్పు, నెయ్యి- రెండు టీస్పూన్లు, అవిసెగింజలు- అర టీస్పూన్‌.
తయారీ: జొన్నపిండిని రంగు మారేంత వరకు వేయించి చల్లార్చాలి. గిన్నెలో నీళ్లు పోసి దాంట్లో తురిమిన డేట్స్‌ వేసి తక్కువ మంట మీద ఉడికించాలి. నీళ్లను పీల్చుకుని డేట్స్‌ మెత్తగా అయ్యాక వేయించిన జొన్నపిండి, బాదం, పిస్తా తురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రం కాస్త వేడిగా ఉండగానే ఉండలు చుట్టాలి. అరచేతులకు కాస్త నెయ్యి రాసుకుని ఉండలు చుడితే గుండ్రంగా వస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని