ఉసిరి నీడలో రుచుల విందులు!

వేడివేడి అన్నంలో కమ్మని పప్పు, కాచిన నెయ్యి... ఆ పక్కనే కందాబచ్చలీ, పసనపొట్టు, అప్పడం, దప్పళం, పులిహోరా, బూరెలు... ఇవన్నీ కలిస్తేనే.. కార్తికమాసంలో తినే కమ్మని వన భోజనం అవుతుంది. నోరూరించే ఈ భోజనాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.......

Published : 22 Nov 2020 01:07 IST

వేడివేడి అన్నంలో కమ్మని పప్పు, కాచిన నెయ్యి... ఆ పక్కనే కందాబచ్చలీ, పసనపొట్టు, అప్పడం, దప్పళం, పులిహోరా, బూరెలు... ఇవన్నీ కలిస్తేనే.. కార్తికమాసంలో తినే కమ్మని వన భోజనం అవుతుంది. నోరూరించే ఈ భోజనాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.


కందాబచ్చలి

కావాల్సినవి: బచ్చలికూర- రెండు కట్టలు, కంద- పావుకేజీ (ముక్కలు కోసి పెట్టుకోవాలి), ఆవాలు, మినప్పప్పు, పచ్చిసెనగపప్పు- టేబుల్‌స్పూన్‌ చొప్పున, ఎండుమిర్చి- మూడు, పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి- రెండు, చింతపండు గుజ్జు- టేబుల్‌స్పూన్‌, ఉప్పు- తగినంత, పసుపు- అర టీస్పూన్‌, కారం- రెండు టీస్పూన్లు.
తయారీ: ఆవాలను పది నిమిషాలపాటు నీళ్లలో నానబెట్టి మిక్సీజార్‌లో వేసి మెత్తగా పేస్టు  చేసుకోవాలి. కంద ముక్కలను మెత్తగా ఉడికించి నీళ్లు వార్చి పక్కన పెట్టాలి. బచ్చలిని చిన్నగా తురుముకుని ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి పచ్చిసెనగపప్పు, మినప్పప్పు వేసి కాసేపు వేయించి ఆవాలు, ఎండు, పచ్చిమిర్చి వేయాలి. తర్వాత ఉడికించిన కందగడ్డ ముక్కలు, బచ్చలికూర వేసి వేయించాలి. దీంట్లోనే పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసి కంద ముక్కలను మెత్తగా మెదుపుకోవాలి. చివరగా ఆవాల పేస్టు వేసి బాగా కలిపి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. ఎక్కువసేపు వేయిస్తే కూర చేదెక్కుతుంది.  


పనసపొట్టు

కావాల్సినవి: పనసపొట్టు- పావుకేజీ, వేరుసెనగపప్పు- రెండు టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు- టేబుల్‌స్పూన్‌, జీలకర్ర, ఆవాలు- టీస్పూన్‌ చొప్పున, కరివేపాకు- రెబ్బ, ఎండుమిర్చి- రెండు, పచ్చిసెనగపప్పు- టేబుల్‌స్పూన్‌, చీల్చిన పచ్చిమిర్చి- మూడు, కారం- టీస్పూన్‌, ఉప్పు- తగినంత, పసుపు- అర టీస్పూన్‌, ఆవపొడి- టీస్పూన్‌, చింతపండు గుజ్జు- రెండు టేబుల్‌స్పూన్లు, ఇంగువ- చిటికెడు.
తయారీ: పనసపొట్టును బాగా కడిగి నీళ్లు వాడ్చాలి. కొన్ని నీళ్లను మరిగించి అందులో పనసపొట్టు, పసుపు, ఉప్పు వేసి పది నిమిషాలపాటు ఉడికించాలి. ఇప్పుడు పొట్టును మాత్రమే వడకట్టి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి వేరుసెనగపప్పు, పచ్చిసెనగపప్పు, మినప్పప్పు వేసి ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి రెండు నిమిషాలపాటు తక్కువ మంట మీద వేయించాలి. దీంట్లో పనసపొట్టును వేసి బాగా కలిపి పది నిమిషాలపాటు ఉడికించాలి. తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు, కారం వేసి, ఆవపిండి చల్లి కూరను బాగా కలపాలి. చివరగా ఇంగువ వేసి దించేయాలి. పొడిపొడిగా ఉండే ఈ కూర పప్పులోకి చాలా బాగుంటుంది.


ఉసిరి పులిహోర


కావాల్సినవి: అన్నం-అరకేజీ, ఉసిరికాయలు- ఆరు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి- ఎనిమిది, ఎండుమిర్చి- నాలుగు, సెనగపప్పు- రెండు టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు- టేబుల్‌స్పూన్‌, వేరుసెనగపప్పు- నాలుగు టేబుల్‌స్పూన్లు, ఆవాలు- టేబుల్‌స్పూన్‌, అల్లంతురుము- టీస్పూన్‌, నువ్వులు- టేబుల్‌స్పూన్‌, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత, పసుపు- టీస్పూన్‌, కరివేపాకు- గుప్పెడు.
తయారీ: ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కోసి కొంచెం ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి వేరుసెనగపప్పు, పచ్చిసెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆవాలు, అల్లం తురుము, ఎండుమిర్చి, నువ్వులు, కరివేపాకు, ఇంగువు, పసుపు, ఉప్పు వేయాలి. ఇప్పుడు ఉసిరికాయ పేస్టును వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. చివరగా అన్నం వేసి బాగా కలపాలి. అన్నం పొడిగా ఉండేలా చూసుకోవాలి. దీంట్లో జీడిపప్పు వేసుకున్నా రుచిగా ఉంటుంది.


గుమ్మడికాయ పులుసు

కావాల్సినవి: మధ్యస్థంగా ఉండే గుమ్మడికాయ- ఒకటి, బెల్లం- 100 గ్రా., ఆవాలు- టీస్పూన్‌, జీలకర్ర- టీస్పూన్‌, చింతపండు- 100 గ్రా., ఎండుమిర్చి- నాలుగు, కరివేపాకు- రెబ్బ, పచ్చిమిర్చి ముక్కలు- టీస్పూన్‌, ఉప్పు- తగినంత, కారం- టీస్పూన్‌, పసుపు- అర టీస్పూన్‌, మినప్పప్పు, సెనగపప్పు- టీస్పూన్‌ చొప్పున, బియ్యప్పిండి- టేబుల్‌స్పూన్‌, ఉప్పు- తగినంత.
తయారీ: గుమ్మడికాయను  చిన్నముక్కల్లా కోసుకోవాలి. చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్‌లో నూనె పోసి వేడిచేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా కలిపి పసుపు, ఉప్పు, కారం వేయాలి. ముక్కలు మునిగేలా నీళ్లు పోసి మూతపెట్టి విజిల్‌ వచ్చేంతవరకు ఉడికించాలి. తర్వాత చింతపండు పులుసు, బెల్లం వేసి విజిల్‌ లేకుండా కుక్కర్‌ను మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. బియ్యప్పిండిలో నీళ్లు పోసి పేస్టులా చేసి పులుసులో వేసి కాసేపు ఉడికిస్తే చిక్కగా అవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని