ఆవకాయ... నోరూరా!

ఎర్రటి కొత్తావకాయని చూస్తే ఎవరికైనా మనసు గతి తప్పుతుంది. ముద్దపప్పుతో కలిపేసుకోవాలనో... పెరుగన్నంలోకి చేర్చుకోవాలనో జిహ్వచాపల్యం పోరుపెడుతుంది. అచ్చంగా అలాగే తినేయడానికీ ఏమాత్రం సందేహించదు. అలాంటి ఆవకాయకి అక్కాచెల్లెళ్లలాంటి కొత్తావకాయలివన్నీ. అలాగని రుచిలో రాజీపడతాయనుకునేరు... నువ్వా-నేనా అన్నట్టుండే వీటి తయారీ తెలుసుకోండి మరి.

Updated : 15 Jun 2021 12:34 IST

ఎర్రటి కొత్తావకాయని చూస్తే ఎవరికైనా మనసు గతి తప్పుతుంది. ముద్దపప్పుతో కలిపేసుకోవాలనో... పెరుగన్నంలోకి చేర్చుకోవాలనో జిహ్వచాపల్యం పోరుపెడుతుంది. అచ్చంగా అలాగే తినేయడానికీ ఏమాత్రం సందేహించదు. అలాంటి ఆవకాయకి అక్కాచెల్లెళ్లలాంటి కొత్తావకాయలివన్నీ. అలాగని రుచిలో రాజీపడతాయనుకునేరు... నువ్వా-నేనా అన్నట్టుండే వీటి తయారీ తెలుసుకోండి మరి.

కాయల లెక్కన, డబ్బాల కొలతతో ఆవకాయ అందరికీ కుదరకపోవచ్చు. కొత్తవారికి ఈ లెక్కలు కరెక్టుగా తెలియక ఉప్పు కారం ఎక్కువ తక్కువై  మొత్తం ఆవకాయ పాడవుతుంది. అందుకే మామిడి ముక్కలను తూకంలో కేజీ చొప్పున, మిగతా దినుసులు ఇలానే తీసుకుంటే ఆవకాయ కచ్చితంగా ఉంటుంది. కొత్తవారు కూడా ఈ కొలతలతో సులువుగా ఆవకాయ పెట్టుకోవచ్చు.  అలాగే ముందుగా మామిడి ముక్కలను శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి.

అల్లం ఆవకాయ

కావాల్సినవి: మామిడి ముక్కలు- కిలో, ఉప్పు- 250 గ్రా., కారం- 125 గ్రా., నువ్వుల నూనె-250 గ్రా., అల్లం ముద్ద- 125 గ్రా., వెల్లుల్లి ముద్ద- 125 గ్రా., పసుపు- 25 గ్రా., జీలకర్ర పొడి- 50 గ్రా., మెంతిపొడి- 10 గ్రా., ఇంగువ- పావు చెంచా, ఆవాలు, జీలకర్ర, మెంతులు- చెంచా.
తయారీ: ఓ గిన్నెలో ఉప్పు, పచ్చళ్ల కారం, జీలకర్ర, మెంతిపొడులు; పసుపు వేసి ఉండలు లేకుండా కలపాలి. మరో గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే అల్లం,వెల్లుల్లి ముద్దలు వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత తయారుచేసి పెట్టుకున్న మసాలా పొడులను కలపాలి. ఇందులోనే మామిడికాయ ముక్కలు వేసి కలిపి జాడీలోకి పెట్టుకోవాలి. మూడు రోజుల తర్వాత ఇంకోసారి కలిపితే చాలు.   

నువ్వు ఆవకాయ

కావాల్సినవి: మామిడి ముక్కలు- కిలో, నువ్వులు- 250 గ్రా., ఉప్పు- 250 గ్రా., నువ్వుల నూనె- 500 గ్రా., అల్లంవెల్లుల్లి ముద్ద - 250 గ్రా., ఆవపొడి- 50 గ్రా., పసుపు- పెద్దచెంచా, జీలకర్ర పొడి- 25 గ్రా., మెంతిపొడి- చెంచా, ఇంగువ- చిటికెడు, ఆవాలు, జీలకర్ర - ఒకటిన్నర చెంచా.
తయారీ: నువ్వులను దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. గిన్నెలో ఉప్పు, నువ్వులు, జీలకర్ర, మెంతి,  ఆవపొడులు; పసుపు వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దింపేయాలి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. దీనివల్ల అందులోని పచ్చివాసన పోయి కమ్మగా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి పెట్టుకున్న పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. అన్ని ముక్కలకు మసాలా అంటిన తర్వాత శుభ్రమైన జాడీలోకి తీసుకుని మూతపెట్టేయాలి.. మూడునాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవచ్చు. ఇందులో కారం వేయలేదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 

ఉడికిన తొక్కు/ఆవకాయ

కావాల్సినవి: మామిడికాయ గుజ్జు- కిలో, ఉప్పు- 250 గ్రా., పసుపు- పెద్ద చెంచా, కారం- 125 గ్రా., అల్లంవెల్లుల్లి ముద్ద- 250 గ్రా., నువ్వుల నూనె-  250 గ్రా., జీలకర్ర పొడి- 25 గ్రా.,  మెంతిపొడి- చెంచా, ఇంగువ- పావు చెంచా, ఆవాలు, జీలకర్ర, మెంతులు - ఒకటిన్నర చెంచా.
తయారీ: మంచి కండ ఉన్న మామిడికాయలను కడిగి, తుడిచి కుక్కర్లో తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత చెక్కు తీసి చెంచాతో లోపలి గుజ్జంతా తీసి పెట్టుకోవాలి. ఈ గుజ్జు కొలతతోనే మిగతా దినుసులన్నీ కలపాలి. గిన్నెలో ఉప్పు, పసుపు, పచ్చళ్ల కారం, జీలకర్ర, మెంతిపొడులు వేసి ఉండలు లేకుండా కలపాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె పోసి వేడి చేయాలి. ఇందులో ఇంగువ వేసి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఎర్రబడ్డాక దింపేయాలి. నూనె కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి పెట్టుకున్న పొడుల మిశ్రమం, మామిడి గుజ్జు వేసి బాగా కలియబెట్టాలి. దీన్ని శుభ్రమైన జాడీలో నిల్వ చేసుకుంటే సరి. మూడు రోజుల తర్వాత మరోసారి కలిపి తినడానికి తీసుకోవచ్చు. ఈ ఆవకాయని చట్నీలా ఇడ్లీ, దోశ, ఉప్మాలకు, అన్నంలోకి కూడా వాడుకోవచ్చు.  

కొబ్బరి ఆవకాయ

కావాల్సినవి:  మామిడి ముక్కలు- కిలో, ఉప్పు- 250 గ్రా., పసుపు- పెద్దచెంచా, కారం- 125 గ్రా., ఎండు కొబ్బరి పొడి- 250 గ్రా., ఆవపొడి- 50 గ్రా., జీలకర్ర పొడి- 25 గ్రా., మెంతిపొడి-  చెంచా, అల్లం వెల్లుల్లి ముద్ద- 250 గ్రా., నువ్వులనూనె- 300 గ్రా., ఇంగువ- పావు చెంచా, జీలకర్ర, మెంతులు - చెంచా.
తయారీ: గిన్నెలో పసుపు, పచ్చళ్ల కారం, జీలకర్ర, మెంతి, కొబ్బరి, ఆవపొడులు; ఉప్పు వేసి ఉండలు లేకుండా కలపాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. జీలకర్ర, మెంతులు వేసి వేగిన తర్వాత దింపేయాలి. నూనె చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. చల్లారిన తర్వాత మసాలా పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి జాడీలో నిల్వ చేసుకోవాలి. నాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవచ్చు.

మసాలా ఆవకాయ 

కావాల్సినవి: మామిడి ముక్కలు- కిలో, నువ్వుల నూనె- 250 గ్రా., అల్లం ముద్ద- 125 గ్రా., వెల్లుల్లి ముద్ద- 100 గ్రా., ఉప్పు- 250 గ్రా., జీలకర్ర పొడి- 50 గ్రా., ధనియాల పొడి- రెండు పెద్ద చెంచాలు,  గరంమసాలా పొడి- పెద్ద చెంచా, మెంతిపొడి- చెంచా, పసుపు- పెద్దచెంచా,  ఇంగువ- పావు చెంచా, కారం- 125 గ్రా., జీలకర్ర, మెంతులు - చెంచా, ఎండుమిర్చి- ఆరు.
తయారీ: గిన్నెలో ఉప్పు, పసుపు, పచ్చళ్ల కారం, జీలకర్ర పొడి, మెంతి, ధనియాలు, గరంమసాలా పొడులు వేసి ఉండలు లేకుండా కలపాలి. తర్వాత మామిడి ముక్కలూ వేసి కలపాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. ఇందులో జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అల్లం, వెల్లులి ముద్దలు వేసి కలపాలి. చల్లారాక మామిడికా ముక్కలు, మసాలా పొడులతో కలియబెట్టాలి. ఇందులోనే కొన్ని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీర కూడా వేసి మొత్తం బాగా కలిశాక శుభ్రమైన జాడీలో భద్రపరుచుకోవాలి. మామూలు ఆవకాయ కంటే ఇది కాస్త ఘాటుగా ఉంటుంది..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని