జలపుష్పాల జోరు.. చూస్తే నోరూరు!

చేపల వేపుడు నోరూరిస్తే... పులుసు ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.. మసాలా కూర... మనసు లాగేస్తుంది. ఇగురు... మరింత ఉంటే బాగుండనిపిస్తుంది... స్నాక్స్‌ క్షణాల్లో హాంఫట్‌ అయిపోవాల్సిందే... అలాంటి యమ్మీ యమ్మీ చేప రుచులు చూద్దామా!

Published : 13 Jun 2021 01:08 IST

చేపల వేపుడు నోరూరిస్తే... పులుసు ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.. మసాలా కూర... మనసు లాగేస్తుంది. ఇగురు... మరింత ఉంటే బాగుండనిపిస్తుంది... స్నాక్స్‌ క్షణాల్లో హాంఫట్‌ అయిపోవాల్సిందే... అలాంటి యమ్మీ యమ్మీ చేప రుచులు చూద్దామా!

ఫిష్‌ బాల్స్‌...

కావాల్సినవి: చేప ముక్కలు- 250 గ్రా., వెల్లుల్లి, అల్లం తరుగు- చెంచా చొప్పున, ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తురుముకోవాలి), నూనె- తగినంత,  కారం- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్‌- చెంచా, మిరియాల పొడి- పావు చెంచా, పసుపు- పావుచెంచా, ఉడికించిన బంగాళాదుంప ముద్ద- ఒకటి, కొత్తిమీర తరుగు- కొద్దిగా, కార్న్‌ఫ్లోర్‌- రెండు పెద్ద చెంచాలు, బ్రెడ్‌పొడి- అర కప్పు, నూనె- తగినంత.

తయారీ: పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి నీళ్లు పోయాలి. ఇందులో పసుపు, ఉప్పు వేసి కలపాలి. దీంట్లోనే చేప ముక్కలు వేసి పదినిమిషాలపాటు ఉడికించాలి. ఆ తర్వాత ముక్కలను నీటిలో నుంచి తీసి చల్లార్చాలి. ఇప్పుడు ముళ్లన్నీ తీసేసి ముక్కలను చిన్నగా చేసుకోవాలి.  మరోసారి పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టుకుని నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక వెల్లుల్లి, అల్లం తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇందులోనే చేప ముక్కల మిశ్రమాన్ని వేసి మరోసారి వేయించాలి. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్‌, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు ఉడికించిన ఆలూను వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి.

గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌ వేసి కాసిన్ని నీళ్లు కలపాలి. మరో ప్లేట్‌లో బ్రెడ్‌ పొడిని తీసుకోవాలి. చేప ముక్కల మిశ్రమాన్ని లడ్డుల్లా చేసి మొక్కజొన్నపిండి మిశ్రమంలో ముంచి బ్రెడ్‌ పొడిలో దొర్లించాలి. ఇలా అన్నింటిని తయారుచేసుకుని మరిగే నూనెలో లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని టొమాటో కెచప్‌, మయోనైజ్‌ సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.

వేపుడు...

కావాల్సినవి:  చేప ముక్కలు- అయిదారు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, నిమ్మరసం- రెండు చెంచాల చొప్పున, పసుపు- చెంచా, కారం- పెద్ద చెంచా, ఉప్పు- తగినంత, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి- చెంచా చొప్పున, సెనగపిండి- రెండు చెంచాలు (తప్పనిసరి కాదు), నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: మొదట గిన్నెలో అన్ని పదార్థాలను ఒకదాని తర్వాత మరొకటి వేసుకుని కలపాలి. కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించి అరగంటపాటు పక్కన పెట్టాలి. పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక చేప ముక్కల్ని వేసి రెండు వైపులా బాగా వేయించుకోవాలి.

పులుసు...

కావాల్సినవి: చేప ముక్కలు- కొన్ని, ఉల్లిపాయలు- మూడు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగైదు (కచ్చాపచ్చాగా దంచుకోవాలి), పచ్చిమిర్చి- నాలుగైదు, ఉల్లిపాయ ముక్కలు- కప్పు, ఉప్పు- తగినంత, కారం, గరంమసాలా, అల్లంవెల్లుల్లి ముద్ద- రెండు చెంచాల చొప్పున, పసుపు- చెంచా, మెంతులు, ఆవాలు- అర చెంచా చొప్పున, చింతపండు- 50 గ్రా., నూనె- తగినంత.

తయారీ:  మొదట ఉల్లిపాయలను పొయ్యి మీద మంటపై నేరుగా కాల్చి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి కడాయి పెట్టి ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఒకదాని తర్వాత మరొకటి వేసుకుంటూ వేయించాలి. కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయలపై పొట్టు తీసి శుభ్రం చేయాలి. వీటిని, దినుసులన్నింటినీ మిక్సీ పట్టి మసాలా ముద్దను తయారుచేసుకోవాలి.

పొయ్యి వెలిగించి ఓ వెడల్పాటి పాత్రను పెట్టి నూనె పోసుకోవాలి. అది వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. దీంట్లోనే పసుపు, కారంతోపాటు, చింతపండు పులుసు పోసి ఒక పొంగు వచ్చే వరకు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మసాలా పేస్ట్‌ వేసి మరోసారి కలిపి కాసేపు మరిగించాలి. కావాలనుకుంటే కాసిన్ని నీళ్లు కలపొచ్చు. పులుసు బాగా మరుగుతున్నప్పుడు చేప ముక్కలను వేసి మూత పెట్టాలి. వీటిని చిన్న మంటపై పదినిమిషాలపాటు ఉడికించాలి.

ఫిష్‌ ఫింగర్స్‌...

కావాల్సినవి: చేప ముక్కలు- ఆరు, నూనె- తగినంత, మైదా, కారం, నిమ్మరసం- రెండు చెంచాల చొప్పున, ఉప్పు- తగినంత, బ్రెడ్‌ పొడి- అర కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, గరంమసాలా, చిల్లీ ఫ్లేక్స్‌- చెంచా చొప్పున, మిరియాల పొడి- అర చెంచా, గుడ్డు- ఒకటి.

తయారీ: గిన్నెలో చేప ముక్కలు, ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, మిరియాల పొడి, గరంమసాలా, నిమ్మరసం, నూనె వేసి కలిపి కాసేపు నానబెట్టాలి. మరోప్లేట్‌లో మైదా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్‌ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో గుడ్డును బాగా గిలక్కొట్టాలి. చేప ముక్కలను మైదాలో దొర్లించి ఆ తర్వాత గుడ్డు సొనలో ముంచి, చివరకు బ్రెడ్‌ పొడి అద్దాలి. ఇలా తయారుచేసుకున్న వీటిని డీప్‌ ఫ్రై చేసుకోవాలి. 

గ్రీన్‌ మసాలా కర్రీ...

కావాల్సినవి:  చేప ముక్కలు- అయిదు, నిమ్మరసం- రెండు చెంచాలు, కొత్తిమీర- కప్పు, పుదీనా, పెరుగు- అర కప్పు చొప్పున, పచ్చిమిర్చి, వెల్లుల్లి- అయిదారు చొప్పున, జీలకర్ర, మిరియాలు, గరంమసాలా- చెంచా చొప్పున, నూనె- తగినంత, ఉప్పు- రుచికి సరిపడా.

తయారీ: ముందుగా చేప ముక్కలకు నిమ్మరసం, ఉప్పు కలిపి కాసేపు పక్కన పెట్టాలి. మిక్సీలో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు, కాస్తంత ఉప్పు వేసి మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి నూనె పోసి అది వేడయ్యాక తయారుచేసి పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.  అర కప్పు పెరుగు వేసి, కొన్ని నీళ్లు పోసి పదినిమిషాలపాటు ఉడికించాలి. ఇప్పుడు చేప ముక్కలను వేసి చిన్న మంటపై అయిదారు నిమిషాలపాటు ఉడికించాలి. చివరగా గరంమసాలా వేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని