కావాలా కాయ బజ్జీలు!

చల్లటి గాలులు... జోరున వర్షం.. మీటింగ్‌ స్పాట్‌లో కలుసుకున్న స్నేహబృందం.. ఇంట్లోనే ఉంటోన్న చిన్నారులు... ఇలా సందర్భమేదైనా... చిన్నపెద్దా ఎవరైనా... స్నాక్స్‌ అనగానే గుర్తుకువచ్చేవి బజ్జీలే...అందునా మిరపకాయ బజ్జీలుంటే మైమరచిపోవడం ఖాయం. మిర్చీ కన్నా రుచిలో మేమేం తక్కువ ....

Published : 05 Sep 2021 02:23 IST

చల్లటి గాలులు... జోరున వర్షం.. మీటింగ్‌ స్పాట్‌లో కలుసుకున్న స్నేహబృందం.. ఇంట్లోనే ఉంటోన్న చిన్నారులు... ఇలా సందర్భమేదైనా... చిన్నపెద్దా ఎవరైనా... స్నాక్స్‌ అనగానే గుర్తుకువచ్చేవి బజ్జీలే... అందునా మిరపకాయ బజ్జీలుంటే మైమరచిపోవడం ఖాయం. మిర్చీ కన్నా రుచిలో మేమేం తక్కువ కాదనే వంకాయ, సొరకాయ, బీరకాయ, బచ్చలి ఆకు బజ్జీలు... అన్నింటినీ ఓ పట్టు పట్టేయండి మరి.


మిర్చీతో...

కావాల్సినవి: మిరపకాయలు- ఏడెనిమిది, సెనగపిండి- కప్పు, నువ్వులు, పల్లీలు- పావుకప్పు చొప్పున, చింతపండు గుజ్జు-  అర కప్పు, వాము- పావుచెంచా, వంటసోడా, పసుపు- చిటికెడు చొప్పున, కారం- పావుచెంచా, ఉప్పు- సరిపడా, నూనె- తగినంత, గరంమమసాలా, ధనియాలపొడి, చాట్‌మసాలా, కొత్తిమీర తరుగు- కొద్దిగా.

తయారీ: పాన్‌లో నువ్వులు, పల్లీలు వేసి వేయించి పెట్టుకోవాలి. ఇవి  చల్లారిన తర్వాత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని చింతపండు రసాన్ని జత చేయాలి. పచ్చిమిర్చిని శుభ్రంగా తుడిచి మధ్యలోకి కోసి చింతపండుగుజ్జు మిశ్రమాన్ని ఇందులో కూర్చాలి. మరొక గిన్నెలో సెనగపిండి, వాము, వంటసోడా, ఉప్పు, పసుపు, కాస్తంత కారం వేసి, నీళ్లు పోసి కలపాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక సెనగపిండిలో మిరపకాయలను ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఈ బజ్జీలపై గరంమసాలా, ధనియాలపొడి, చాట్‌మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర కలిపిన మిశ్రమాన్ని చల్లి, ఉల్లిపాయలతో కలిపి తింటే వావ్‌ అనకుండా ఉండలేరు.


బచ్చలి ఆకుతో..

కావాల్సినవి:  సెనగపిండి- పెద్ద కప్పు, బచ్చలి ఆకులు- కొన్ని, బియ్యప్పిండి- రెండు చెంచాలు, వాము- పావుచెంచా, కారం- అరచెంచా, వంటసోడా- చిటికెడు, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి, వాము, ఉప్పు, వంటసోడా, కారం... అన్నీ వేసుకుని  తగినన్ని నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా పిండిని జారుగా కలిపి పెట్టుకోవాలి.  పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక బచ్చలి ఆకులను పిండిలో ముంచి బజ్జీలా నూనెలో వేసుకోవాలి. లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.


బెండకాయతో...

కావాల్సినవి: సెనగపిండి- కప్పు, బెండకాయలు- పావుకిలో, పల్లీలు- అరకప్పు, ఉప్పు- తగినంత, వంటసోడా- పావు చెంచా, కారం- అరచెంచా, చింతపండు గుజ్జు- పావు కప్పు, పసుపు, వాము- చిటికెడు, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. వీటికి గాట్లు పెట్టి కాగే నూనెలో వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో పల్లీలు, వాము, పసుపు వేసి పొడి చేసుకోవాలి. గిన్నెలో సెనగపిండి, పల్లీల పొడి, ఉప్పు, వంటసోడా, సరిపడా నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలపాలి. మరో గిన్నెలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం వేసి కలిపి ఈ మిశ్రమాన్ని బెండకాయ మధ్యలో పెట్టాలి. ఈ బెండకాయలను సెనగపిండిలో ముంచి బజ్జీల్లా కాగే నూనెలో వేయాలి. ముదురు పసుపు రంగు వచ్చే వరకు బాగా వేయించాలి.


సొరకాయతో...

కావాల్సినవి: కొర్రల పిండి, సెనగపిండి,  బియ్యప్పిండి- అర కప్పు చొప్పున, సొరకాయ ముక్కలు- ఏడెనిమిది, ఉప్పు- తగినంత,  పసుపు, వంటసోడా- చిటికెడు చొప్పున, నూనె- తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద- అరచెంచా, కారం, గరంమసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, చాట్‌ మసాలా- పావు చెంచా చొప్పున.

తయారీ: కొర్రలపిండి, సెనగపిండి, బియ్యప్పిండి... ఈ మూడింటిని సమాన పరిమాణంలో గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, గరంమసాలా, చాట్‌ మసాలా, మిరియాల పొడి, వంటసోడా, అల్లంవెల్లుల్లి ముద్ద... అన్ని పదార్థాలను ఒకదాని తర్వాత మరొకటి వేసుకుంటూ తగినన్ని నీళ్లు పోసుకుంటూ బజ్జీ పిండిలా కలిపి పావుగంటపాటు పక్కన పెట్టాలి. పొయ్యి మీద బాండీ పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక సొరకాయ ముక్కలను సెనగపిండి మిశ్రమంలో ముంచి బజ్జీల్లా వేసుకోవాలి. రెండు వైపులా బాగా కాలేలా వేయించాలి. 


వంకాయతో...

కావాల్సినవి: వంకాయలు- పావుకిలో, సెనగపిండి- కప్పు, ఉప్పు- తగినంత, కారం- చెంచా, ఆమ్‌చూర్‌ పొడి, చాట్‌ మసాలా- అర చెంచా చొప్పున, వాము- అరచెంచా,  వంటసోడా- చిటికెడు, నూనె- తగినంత. 

తయారీ: వంకాయలకు గాట్లు పెట్టి, చివర్లు కోసేయాలి. వీటిని నూనెలో కాసేపు వేయించి (పూర్తిగా కాకుండా) తీయాలి. తర్వాత ఓ ప్లేట్‌లో కారం, చాట్‌మసాలా, ఆమ్‌చూర్‌ పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని వంకాయల్లో కూర్చి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో సెనగపిండి, వాము, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలపాలి. చిటికెడు వంటసోడా, కాస్తంత వేడి నూనెను కూడా జత చేయాలి. ఇప్పుడు కాగుతున్న నూనెలో సెనగపిండిలో ముంచిన వంకాయలను వేయాలి. వీటిని చక్కటి రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, వేయించిన పల్లీలతో తింటే టేస్ట్‌ అదిరిపోతుంది.


బీరకాయతో...

కావాల్సినవి: బీరకాయలు- రెండు, సెనగపిండి- కప్పు, బియప్పిండి- అరకప్పు,  వాము- చిటికెడు, పచ్చిమిర్చి తురుము- రెండు చెంచాలు, కరివేపాకు తురుము- చెంచా, ఉప్పు- తగినంత, వంటసోడా- చిటికెడు, నూనె- డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: బీరకాయ పొట్టు తీసి ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నూనె తప్ప పై పదార్థాలన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి వేసుకుంటూ కలపాలి. తగినన్ని నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా బజ్జీ పిండిలా తయారుచేసుకోవాలి. పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నూనె పోయాలి. బీరకాయ ముక్కలను పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి బాగా వేయించాలి. వీటిని చాట్‌ మసాలా లేదా టొమాటో కెచప్‌తో తీసుకుంటే బాగుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని