మనసు కచోరీ!

వెలుపలి వైపు కరకరలాడుతూ, లోపల కారంకారంగా, తియ్యతియ్యగా... భిన్న రుచులతో నోరూరించే కచోరీ అంటే ఇష్టపడని వారుండరు. కారంకారంగా ఖస్తా కచోరీ నోరూరిస్తుంది. అరటికాయలు, కూరగాయ ముక్కలతో వెజ్‌ కచోరీ చూస్తేనే చాలు తినాలనిపిస్తుంది.

Updated : 19 Sep 2021 04:35 IST

వెలుపలి వైపు కరకరలాడుతూ, లోపల కారంకారంగా, తియ్యతియ్యగా... భిన్న రుచులతో నోరూరించే కచోరీ అంటే ఇష్టపడని వారుండరు. కారంకారంగా ఖస్తా కచోరీ నోరూరిస్తుంది. అరటికాయలు, కూరగాయ ముక్కలతో వెజ్‌ కచోరీ చూస్తేనే చాలు తినాలనిపిస్తుంది. పిండి లేకుండా బ్రెడ్‌తో చేసే కచోరీ టేస్టే వేరు... ఇలా భిన్నమైన రుచుల మేళవింపును ప్రయత్నిద్దామా మరి.


ఖస్తా కచోరీ..

కావాల్సినవి:

చపాతీ పిండి కోసం.. మైదా- రెండు కప్పులు, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, నూనె- పెద్ద చెంచా, ఉప్పు- తగినంత, నీళ్లు- సరిపడా.  

ఫిల్లింగ్‌ కోసం... పెసరపప్పు- అర కప్పు, కారం- రెండు చెంచాలు, ఆమ్‌చూర్‌ పొడి, చాట్‌ మసాలా, ధనియాల పొడి- చెంచా చొప్పున, నల్లుప్పు- కొద్దిగా, నీళ్లు- తగినన్ని.

తయారీ: వెడల్పాటి గిన్నెలో మైదా, ఉప్పు, నెయ్యి, నూనె వేసి కలపాలి. కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలపాలి. ఈ ముద్దను అరగంట పక్కన పెట్టాలి.  

గిన్నెలో పెసరపప్పు వేసి నీళ్లు పోసి రెండు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లు వంపేసి పప్పును బరకగా మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక పప్పు మిశ్రమాన్ని వేసి వేయించాలి. ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, నల్లుప్పు, చాట్‌ మసాలా, ఆమ్‌చూర్‌ పొడి వేసి చిన్నమంటపై  మరికాసేపు తడి అంతా ఇగిరిపోయే వరకు వేయిస్తూనే ఉండాలి. కాస్తంత నూనె చేరిస్తే అడుగు అంటదు. ఇలా తయారుచేసిన మిశ్రమాన్ని పక్కన పెట్టి చల్లార్చాలి.

చిన్న చపాతీలా చేసి వాటి మధ్యలో పెసరపప్పు మిశ్రమాన్ని వేసి అన్ని వైపులా మూసేసి వడి తిప్పి అదనపు పిండిని తీసేయాలి. ఇప్పుడు ఈ ముద్దను కాస్తంత వెడల్పుగా కచోరీలా చేసి కాగే నూనెలో వేసి చిన్నమంటపై రెండు వైపులా గోల్డెన్‌ బ్రౌన్‌ రంగు వచ్చేవరకు డీప్‌ ఫ్రై చేసుకోవాలి.


అరటికాయతో...

కావాల్సినవి: అరటికాయలు- నాలుగు, మైదా- కప్పు, వాము- అర చెంచా, పచ్చిమిర్చి తురుము, జీలకర్ర, ఆమ్‌చూర్‌ పొడి- అర చెంచా చొప్పున, పసుపు- పావు చెంచా, కారం, ధనియాల పొడి- చెంచా చొప్పున, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, కొత్తిమీర తురుము- కొద్దిగా, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా.

తయారీ: పొయ్యి వెలిగించి కుక్కర్‌ పెట్టి అందులో అరటికాయలు వేసి, నీళ్లు పోసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. వీటిని చల్లార్చి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. దీంట్లో మైదా, వాము, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర, ఆమ్‌చూర్‌ పొడి, నెయ్యి, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి. ఇందులో కాసిన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ ముద్దను చిన్న పూరీల్లా కాస్త మందంగా చేసుకోవాలి. వీటిని కాగే నూనెలో వేసి రెండు వైపులా బాగా వేయించాలి. ఇవి చక్కగా పొంగి నోరూరిస్తాయి.


కీమాతో...

కావాల్సినవి: మైదా- కప్పు, కీమా- 200 గ్రా., జీలకర్ర, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్‌ మసాలా- చెంచా చొప్పున, ఉప్పు- తగినంత, పసుపు- చిటికెడు, కొత్తిమీర- కొద్దిగా, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: మైదాలో ఉప్పు, నూనె, నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి నూనె పోసి వేడయ్యాక జీలకర్ర, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. దీంట్లో కీమా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్‌ మసాలా, కొత్తిమీర తరుగు వేసి వేగనివ్వాలి. పిండి ఉండలను తీసుకుని కాస్త మందంగా పూరీల్లా చేసుకుని మధ్యలో కీమా మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి కచోరీల్లా చేసుకోవాలి. ఆపై వేడి నూనెలో వేసి బాగా వేయించాలి. వీటిని గ్రీన్‌ చట్నీతో తింటే చాలా బాగుంటాయి.


వెజ్‌తో...

కావాల్సినవి: ఉడికించిన క్యారెట్‌, ఆలూ, బీన్స్‌, క్యాలిఫ్లవర్‌ ముక్కలు, పచ్చి బఠాణీ- పావు కప్పు చొప్పున, మైదా- కప్పు, ఉల్లిపాయ తరుగు- అర కప్పు, పచ్చిమిర్చి తరుగు- రెండు చెంచాలు, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్‌, చాట్‌ మసాలా- చెంచా చొప్పున, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా, కొత్తిమీర- కొద్దిగా, నెయ్యి- పెద్ద చెంచా.

తయారీ: పిండిలో నెయ్యి, ఉప్పు, నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి కాసేపు వేయించాలి. దీంట్లో ఉడికించిన క్యారెట్‌, బంగాళాదుంప, బీన్స్‌ ముక్కలు, క్యాలీఫ్లవర్‌, పచ్చిబఠాణీ వేసి మరికాసేపు మగ్గించాలి. ఈ మిశ్రమంలోనే జీలకర్ర, చాట్‌మసాలా, ఆమ్‌చూర్‌ పొడి, తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి మరికాసేపు మగ్గనివ్వాలి. పిండితో మందమైన పూరీలు చేసుకుని వాటిలో వెజ్‌ మిశ్రమం పెట్టి కచోరీల్లా చేసుకోవాలి. వీటిని కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా బాగా వేయించాలి.


బ్రెడ్‌తో...

కావాల్సినవి: బ్రెడ్‌ స్లైస్‌లు- నాలుగు, ఉడికించిన బఠాణీలు- అరకప్పు, కారం- అర చెంచా, ధనియాలపొడి, చాట్‌ మసాలా, ఆమ్‌చూర్‌ పొడి, జీలకర్ర పొడి- పావు చెంచా చొప్పున, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా.

తయారీ: బ్రెడ్‌ స్లైస్‌లను గుండ్రంగా కోసి పెట్టుకోవాలి. గిన్నెలో బఠాణీలు, కారం, ఆమ్‌చూర్‌ పొడి, చాట్‌ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్తంత ఉప్పు వేసి కలపాలి.స్లైస్‌ను నీటిలో ముంచి, నీళ్లు పూర్తిగా బయటకు వచ్చేలా ఒత్తేయాలి. ఆ తర్వాత  దీంట్లో బఠాణీల మిశ్రమం వేసి దానిపై మరో తడి బ్రెడ్‌ ముక్క పెట్టి అంచులనూ మూసేయాలి. వీటిని కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా ముదురు గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని