బిర్యానీ ఉంటే వేడుకే!

వేడుక... పార్టీ... సంతోష సందర్భం ఏదైనా సందడంతా బిర్యానీదే. కొత్తిమీర, పుదీనా పరిమళాలు.. కమ్మని నెయ్యి సువాసనలు.. ఘాటైన మసాలాలు..  ఘుమఘుమలాడే రుచులతో... వావ్‌ అనిపించే మటన్‌, చికెన్‌, ఫిష్‌, ప్రాన్స్‌.. బిర్యానీలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. లాగించేయండి మరి.

Updated : 28 Sep 2022 16:00 IST

వేడుక... పార్టీ... సంతోష సందర్భం ఏదైనా సందడంతా బిర్యానీదే. కొత్తిమీర, పుదీనా పరిమళాలు.. కమ్మని నెయ్యి సువాసనలు.. ఘాటైన మసాలాలు..  ఘుమఘుమలాడే రుచులతో... వావ్‌ అనిపించే మటన్‌, చికెన్‌, ఫిష్‌, ప్రాన్స్‌.. బిర్యానీలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. లాగించేయండి మరి.


మటన్‌తో...

కావాల్సినవి:
మారినేషన్‌ కోసం... మటన్‌- కేజీన్నర, అల్లంవెల్లులి ముద్ద- ఒకటిన్నర చెంచా, పసుపు- అర చెంచా, నిమ్మరసం, కారం, పెరుగు- రెండు చెంచాల చొప్పున, గరంమసాలా- చెంచా, ఉప్పు- తగినంత, తరిగిన పచ్చిమిర్చి - రెండు, బొప్పాయి కాయ పేస్ట్‌- అయిదు చెంచాలు, పుదీనా, కొత్తిమీర- కొద్దిగా, వేయించిన ఉల్లిపాయలు- పెద్ద చెంచా.

వేయించిన ఉల్లిపాయ ముక్కల కోసం...  నూనె- నాలుగు పెద్ద చెంచాలు, ఉల్లిపాయలు- ఏడెనిమిది(సన్నగా ముక్కలుగా)

దమ్‌ బిర్యానీ కోసం... బాస్మతి బియ్యం- కేజీ, నూనె- చెంచా, నెయ్యి- మూడు పెద్ద చెంచాలు, మసాలాదినుసులు (దాల్చిన చెక్క, ఇలాచీ, బిర్యానీ ఆకులు), కుంకుమపువ్వు కలిపిన పాలు- కొన్ని.

తయారీ: వెడల్పాటి గిన్నెలో మటన్‌, అల్లంవెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, పసుపు, కారం, గరంమసాలా, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. దీనికి పెరుగు, పచ్చిబొప్పాయి తురుము జత చేయాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా ఆకులు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని దాదాపు ఏడెనిమిది గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి.

పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి కాస్త నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేసి కరకరలాడే వరకు వేయించాలి. మరోవైపు బియ్యాన్ని అరగంట నానబెట్టాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఎక్కువ మొత్తంలో నీళ్లు పోయాలి. అవి మరిగేటప్పుడు బియ్యం వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు జత చేయాలి.

మరో పొయ్యి మీద మందమైన అడుగు ఉండే పెద్ద పాత్ర పెట్టి నూనె, నెయ్యి వేసుకోవాలి. దీంట్లో గరంమసాలా దినుసులు, మారినేట్‌ చేసిన మటన్‌ వేసి అయిదు నిమిషాలు ఉడికించాలి. కొత్తిమీర, పుదీనా, మూడొంతులు ఉడికించిన బియ్యంతోపాటు, కుంకుమపువ్వు పాలు జత చేయాలి. దీనిపై మరోపొర బియ్యం, కుంకుమపువ్వు పాలు పోసి, కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టాలి. మూత అంచును గోధుమ పిండితో పూర్తిగా మూసేయాలి. మూతపై ఏదైనా బరువు పెట్టాలి. ఈ గిన్నెను చిన్నమంటపై 45 నిమిషాల నుంచి గంటపాటు ఉడికించాలి. ఆ తర్వాత సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని మరిన్ని వేయించిన ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన గుడ్లతో గార్నిష్‌ చేసుకుంటే టేస్టీ టేస్టీ మటన్‌ బిర్యానీ రెడీ.


చికెన్‌తో...

కావాల్సినవి: చికెన్‌ ముక్కలు- కిలో, బాస్మతి- కిలో, వేయించిన ఉల్లిపాయ ముక్కలు- కప్పు, పచ్చిమిరపకాయలు- ఏడెనిమిది, మసాలా దినుసులు- కొన్ని, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి ముద్ద, జీలకర్ర, ధనియాల పొడి, బిర్యానీ మసాలా- రెండు చెంచాల చొప్పున, ఉప్పు- తగినంత, పెరుగు- రెండు కప్పులు, నూనె- తగినంత, కొత్తిమీర, పుదీనా- కప్పు చొప్పున, కుంకుమపువ్వుపాలు- కొన్ని.

తయారీ:  చికెన్‌ ముక్కలను శుభ్రంగా కడిగి ఉప్పు వేసి రెండు గంటలపాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత నీళ్లను పారబోసి ముక్కలను గిన్నెలో వేసుకోవాలి. ఇందులో ఉప్పూ, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి చికెన్‌ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. ఇందులోనే నిలువుగా కోసిన పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కాస్తంత నూనె వేసి మరోసారి కలియబెట్టాలి. దీన్ని గిన్నెలో సమానంగా పరిచి పెరుగు పోయాలి. దీంట్లో  మసాలా దినుసులు (బిర్యానీ ఆకు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, జాపత్రి) వేసి గంటపాటు నానబెట్టాలి.

వేరొక గిన్నెలో బియ్యాన్ని ఇరవై నిమిషాలు నానబెట్టాలి. స్టవ్‌ వెలిగించి గిన్నె పెట్టి నీళ్లు పోసి (కప్పు బియ్యానికి నాలుగు కప్పుల చొప్పున), ఉప్పు వేసి మరిగించాలి. ఇందులో షాజీరా వేసి, కాస్తంత నూనె పోయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం వేసి ఓసారి కలపాలి. మూడొంతులు ఉడికిన తర్వాత మంటను చిన్నగా చేసి చిల్లుల గరిటెతో అన్నాన్ని తీస్తూ చికెన్‌ మిశ్రమంలో పొరలా వేసుకోవాలి. దీనిపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు, నిమ్మరసం వేసుకోవాలి. దీంట్లో గులాబీ నీళ్లు పోసుకోవాలి. వీటిపై మరోసారి అన్నాన్ని పొరలా వేసుకోవాలి. చివరగా పుదీనా, ఉల్లిపాయ తరుగు, కుంకుమపువ్వు పాలు, నెయ్యి వేసుకోవాలి. మూత పెట్టి అంచులను గోధుమపిండితో పూర్తిగా మూసి, ఏదైనా బరువును పెట్టాలి. మొదట పది నిమిషాలు మంట పెద్దగా, ఆ తర్వాత మరో పదినిమిషాలు మధ్యస్థంగా, చివరికి చిన్నగా పెట్టుకోవాలి. అంతే ఘుమఘుమలాడే చికెన్‌ దమ్‌ బిర్యానీ రెడీ.


ఫిష్‌తో..

కావాల్సినవి: చేప ముక్కలు- ఏడెనిమిది, బాస్మతి బియ్యం- అర కిలో, టొమాటో ప్యూరీ- చిన్న కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచాన్నర, వేయించిన ఉల్లిపాయ ముక్కలు- కప్పు, కరివేపాకు- రెండు రెమ్మలు, పెరుగు- రెండు చెంచాలు, కారం- పెద్ద చెంచా, పసుపు- పావు చెంచా, గరంమసాలా- చెంచా, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర- కొద్దిగా, పచ్చిమిర్చి- అయిదారు, నూనె- నాలుగైదు చెంచాలు, మసాలా దినుసులు- కొన్ని, నిమ్మరసం- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత.

తయారీ: చేప ముక్కలను శుభ్రం చేసి నిమ్మరసం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి మరిగించాలి. ఈ నీళ్లలో లవంగాలు, ఇలాచీలు, షాజీరా, దాల్చిన చెక్క, ఉప్పు వేయాలి. ఇందులోనే కడిగిపెట్టుకున్న బియ్యాన్నీ వేసి ముప్పావు వంతు వరకు ఉడికించాలి.

మరో పాన్‌లో టొమాటో పేస్ట్‌, అల్లంవెల్లుల్లి ముద్ద, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర; పచ్చిమిర్చి ముక్కలు, నూనె, నిమ్మరసం వేసి కలపాలి. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి చిన్నమంటపై పది నిమిషాలు ఉడికించాలి. కూర నుంచి నూనె బయటకు వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత చేప ముక్కలను వేసి కొన్ని నీళ్లు పోసి అయిదు నిమిషాలు ఉడికించాలి. దీనిపై ముప్పావు వంతు ఉడికించిన అన్నం, నెయ్యి వేసుకోవాలి. మూత పెట్టి పావుగంటపాటు చిన్నమంటపై ఉడికించుకోవాలి. అంతే ఫిష్‌ బిర్యానీ రెడీ.


ప్రాన్స్‌తో..

కావాల్సినవి: బాస్మతి బియ్యం- కప్పున్నర, రొయ్యలు- రెండు కప్పులు, నక్షత్ర పువ్వు- ఒకటి, లవంగాలు- మూడు, మిరియాలు- నాలుగైదు, బిర్యానీ ఆకులు- రెండు, ఉప్పు- తగినంత, నిమ్మరసం- రెండు చెంచాలు, పచ్చి కొబ్బరితురుము- నాలుగైదు చెంచాలు, పచ్చిమిర్చి- మూడు, పుదీనా తురుము- రెండు పెద్ద చెంచాలు, అల్లంముక్కలు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగైదు చొప్పున, కొత్తిమీర-కొద్దిగా, నెయ్యి- అరకప్పు, ఉల్లిపాయలు- మూడు (సన్నగా), కుంకుమపువ్వు పాలు- రెండు చెంచాలు. అల్లం ముక్కలు- కొన్ని.

తయారీ: పొయ్యి మీద గిన్నె పెట్టి, నీళ్లు పోసి అవి వేడయ్యాక అందులో బాస్మతి బియ్యం, నక్షత్రపువ్వు, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకులు, ఉప్పు వేసి ఉడికించాలి. 

మరొక గిన్నెలో రొయ్యలు, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. బ్లెండర్‌లో పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి కాసిన్ని నీళ్లు పోసి మెత్తగా బ్లెండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో రొయ్యలు, వేయించిన ఉల్లిపాయ ముక్కలను వేసి కలపాలి.

ముప్పావు వంతు ఉడికిన అన్నాన్ని నీళ్లు పారబోసి చిల్లుల గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్‌లో నెయ్యి వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. వీటిపై ఉడికించిన అన్నాన్ని పొరలా వేయాలి. దీనిపై రొయ్యల మిశ్రమాన్ని లేయర్‌లా వేసుకోవాలి. వీటిపై మళ్లీ అన్నం, వేయించిన ఉల్లిపాయలు, సన్నగా చీల్చిన అల్లం ముక్కలు, గరంమసాలా వేసుకోవాలి. దీనిపై రొయ్యల మిశ్రమాన్ని వేయాలి. చివరగా మిగిలిన అన్నాన్ని వేసి.. దీనిపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు, గరంమసాలా, అల్లం ముక్కలు, కాస్తంత నెయ్యి, కుంకుమపువ్వు పాలు, పుదీనా వేసి మూత పెట్టేయాలి. దీన్ని ఇరవై నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత పొయ్యి కట్టేసి మరో ఇరవై నిమిషాలు గిన్నెను అలాగే ఉంచాలి. అందులోని ఆవిరికి రొయ్యలు పూర్తిగా ఉడికిపోతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని