నైవేద్యమిదే బతుకమ్మ

ఎంగిలి పూల బతుకమ్మ... అటుకుల బతుకమ్మ.. ముద్దపప్పు బతుకమ్మ.. ఒక్కో రోజు ఒక్కో పేరుతో.. తీరొక్క ప్రసాదంతో కొలిచిన అమ్మవారికి... తొమ్మిదో రోజున సత్తుపిండి మొదలు...

Updated : 10 Oct 2021 05:06 IST

ఎంగిలి పూల బతుకమ్మ... అటుకుల బతుకమ్మ.. ముద్దపప్పు బతుకమ్మ.. ఒక్కో రోజు ఒక్కో పేరుతో.. తీరొక్క ప్రసాదంతో కొలిచిన అమ్మవారికి... తొమ్మిదో రోజున సత్తుపిండి మొదలు... పెరుగన్నం, పులిహోర, మలీద ముద్దలు, కొబ్బరన్నం, నువ్వులన్నం నైవేద్యంగా సమర్పిద్దామా!


మలీద లడ్డూ...

కావాల్సినవి: గోధుమ పిండి- కప్పు, నూనె- మూడు చెంచాలు,   ఉప్పు- తగినంత, సోంపు పొడి, యాలకుల పొడి- పావు చెంచా చొప్పున, నెయ్యి- పావు కప్పు, గసగసాలు- అర చెంచా, ఎండుకొబ్బరి తురుము, బెల్లం- అర కప్పు చొప్పున.

తయారీ: పిండిని మరీ గట్టిగా లేదా మెత్తగా కాకుండా కాస్తంత నూనె, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలిపి పావుగంట పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఉండలు చేసి, కాస్త మందంగా చపాతీలు చేసుకోవాలి. వీటిని పెనం మీద వేసి రెండు వైపులా నెయ్యితో చక్కగా కాల్చాలి. ఈ చపాతీలను ముక్కలు చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. దీంట్లో బెల్లం, ఎండు కొబ్బరి తురుము; సోంపు పొడి, యాలకుల పొడి వేసి, కాస్తంత నెయ్యి జత చేసి బాగా కలిపి లడ్డూల్లా చేసుకోవాలి. గసగసాలను బయటి నుంచి లడ్డూలపై చల్లుకుంటే సరి. తియ్యటి మలీద లడ్డూలు రెడీ.

మలీద ముద్దలు.. వీటి నుంచి ఇనుము లభిస్తుంది. కెలొరీలు తక్కువగా ఉండే ప్రసాదం. ప్రొటీన్లు, పీచు కూడా వీటి నుంచి అందుతాయి.


బియ్యం సత్తుపిండి..

కావాల్సినవి: బియ్యం- కప్పు, చక్కెర- అర కప్పు, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు,  యాలకులు- నాలుగు.

తయారీ: పొయ్యి వెలిగించి కడాయి పెట్టాలి. ఇందులో బియ్యం వేసి దోరగా, లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించి, చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. మిక్సీజార్‌లో చక్కెర, యాలకులు వేసి పొడి చేసి పక్కన పెట్టాలి. అందులోనే వేయించిన బియ్యం వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్‌ పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక బియ్యప్పిండి వేసి రెండు మూడు నిమిషాలు  వేయించాలి. చల్లారిన బియ్యప్పిండిలో చక్కెర వేసి మిశ్రమాన్ని చక్కగా కలపాలి. అంతే రుచికరమైన, పోషకభరితమైన బియ్యం సత్తుపిండి రెడీ. దీన్ని ప్రసాదంగా సమర్పించాలి.

సత్తు పిండి... దీన్ని మొక్కజొన్న, పెసర్లతోనూ చేస్తారు. ప్రత్యేకమైన సువాసనలతో తేలికగా జీర్ణమయ్యే ప్రసాదం. తక్కువ కెలొరీలుండే పదార్థం. చిన్నపిల్లలకూ చక్కగా జీర్ణమవుతుంది.


చింతపండు పులిహోర...

కావాల్సినవి: బియ్యం- అర కిలో, చింతపండు- 100 గ్రా., మెంతులు- అర చెంచా, ఉప్పు, నూనె- తగినంత, అల్లం ముక్కలు, పసుపు- అర చెంచా చొప్పున, పచ్చిశనగ పప్పు, మినపప్పు- చెంచా చొప్పున, ఆవాలు- అర చెంచా, పల్లీలు- గుప్పెడు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి- నాలుగేసి చొప్పున, కరివేపాకు- రెండు, మూడు రెమ్మలు.

తయారీ: అన్నం వండి సిద్ధంగా పెట్టుకోవాలి. చింతపండులో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టి గుజ్జును తీయాలి. మెంతులు, ఆవాలను వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో నూనె పోసి పోపు పదార్థాలన్నీ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి చింతపండు గుజ్జు పోసి చిన్న మంటపై ఉడికించాలి. ఇందులోనే ఉప్పు, పసుపు కలపాలి. గుజ్జు చిక్కగా అయ్యాక ఆవాలు, మెంతి పొడి వేసి కలపాలి. ఇందులో పోపు మిశ్రమాన్ని కలిపేయాలి.  దీన్ని అన్నంలో వేసి కలిపి కాసేపు పక్కన పెట్టాలి. పులిహోర మెత్తగా మారకూడదంటే... పెద్ద చెంచా నువ్వుల నూనెను కలపాలి. అంతే పుల్లపుల్లని కమ్మని చింతపండు పులిహోర సిద్ధమైనట్లే.

పులిహోర.. నిదానంగా జీర్ణమయ్యే పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో వేసే ఇంగువ, మిరియాలు, పసుపు, చింతపండు, ఆవాలతో రకరకాల లవణాలు, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి.


కొబ్బరన్నం...

కావాల్సినవి:  అన్నం- రెండు కప్పులు, పచ్చికొబ్బరి తురుము - కప్పు, నెయ్యి, శనగపప్పు, మినప్పప్పు - రెండు చెంచాల చొప్పున, జీడిపప్పు - గుప్పెడు, కరివేపాకు - రెండు రెమ్మలు, జీలకర్ర, ఆవాలు - అర చెంచా చొప్పున, ఎండుమిరపకాయలు- రెండు, పచ్చిమిరపకాయలు - నాలుగైదు,  ఉప్పు- తగినంత, కొత్తిమీర తురుము- కొద్దిగా.

తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. ఇందులోనే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేయాలి. ఆ తర్వాత జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కొద్దిసేపు చిన్నమంటపై వేయించాలి. ఉప్పు కలిపిన ఈ పోపు మిశ్రమాన్ని తయారుచేసి పక్కన పెట్టుకోవాలి. అన్నాన్ని చల్లార్చుకోవాలి. ఈ అన్నంలో పోపు వేసి బాగా కలపాలి. దీంట్లోనే కొబ్బరి తురుమును చేర్చాలి. చివరగా కొత్తిమీర తురుము వేసి చిన్న మంటపై కాసేపు ఉంచాలి. రుచికరమైన ఘుమఘుమలాడే కొబ్బరన్నం సిద్ధమైనట్లే.

కొబ్బరన్నం...  పచ్చికొబ్బరిలో తేలికగా జీర్ణమయ్యే కొవ్వుపదార్థాలుంటాయి.


నువ్వుల అన్నం...

కావాల్సినవి: అన్నం- రెండు కప్పులు, నువ్వులు- పావు కప్పు, కాబూలీ శనగలు- పెద్ద చెంచా, మినప్పప్పు, మిరియాలు - చెంచా చొప్పున, ఎండు మిరపకాయలు- నాలుగు, కొబ్బరి తురుము- రెండు పెద్ద చెంచాలు.
తాలింపు కోసం... ఆవాలు, జీలకర్ర- అర చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు, పచ్చిమిరపకాయలు- రెండు, పల్లీలు- పెద్ద చెంచా, ఇంగువ- చిటికెడు, నూనె- రెండు పెద్ద చెంచాలు, ఉప్పు- అరచెంచా.

తయారీ: కడాయిలో నువ్వులు వేసి చిన్నమంటపై దోరగా వేయించాలి. అదే కడాయిలో ఎండు మిరపకాయలు, మిరియాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి సన్నమంటపై వేయించాలి. దీన్ని  చల్లార్చి, నువ్వులు చేర్చి పొడి చేసి పెట్టుకోవాలి.
పాన్‌లో నూనె వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. పచ్చిమిరపకాయలు, అల్లం తరుగు వేయాలి. దీంట్లో నువ్వుల పొడి మిశ్రమం కలపాలి. దీన్ని మరో నిమిషం వేయించి అన్నంలో వేసి, తగినంత ఉప్పు కలిపి అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలపాలి.  అంతే నువ్వుల అన్నం తయారైపోయింది. 

నువ్వులన్నం.. వీటిలో విటమిన్‌ ఇ, డి, క్యాల్షియం, పీచు, కొన్నిరకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.


పెరుగన్నం...

కావాల్సినవి: బియ్యం- కప్పు, పెరుగు- ఒకటిన్నర కప్పు, పాలు- పావు కప్పు, ఎండుమిర్చి- రెండు, కరివేపాకు రెబ్బలు- రెండు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి- రెండు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఆవాలు- పావు చెంచా, ఇంగువ- చిటికెడు, మినప్పప్పు- చెంచా, దానిమ్మ గింజలు- మూడు పెద్ద చెంచాలు, నూనె- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత.

తయారీ: బియ్యాన్ని శుభ్రంగా కడిగి, రెండున్నర కప్పుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. కుక్కర్‌లో అయితే మూడు కూతలు వచ్చేవరకు ఉడికించాలి. పెరుగన్నం చేసేటప్పుడు అన్నం మెత్తగా ఉండేలా చూసుకోవాలి. అన్నాన్ని గిన్నెలోకి తీసుకుని వేడిగా ఉన్నప్పుడే పాలు పోసి గరిటెతో మెదపాలి. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత పెరుగు, ఉప్పు వేసి కలపాలి. దీనికి కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు చేర్చాలి.

పోపు కోసం... పొయ్యి మీద చిన్న బాండీ పెట్టి నూనె వేయాలి.  అది వేడయ్యాక ఆవాలు వేసి, చిటపటమన్నాక మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి నిమిషం వేయించాలి. ఈ పోపును పెరుగన్నంలో వేసి బాగా కలియబెట్టాలి. చివరగా దానిమ్మ, కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే సరిపోతుంది. అలంకరణకు వేయించిన కాజూ, కిస్‌మిస్‌ కూడా వేయొచ్చు. 

పెరుగన్నం... పొట్టకి శ్రేష్ఠం. జీర్ణకోశం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమయ్యే ప్రీ, ప్రొబయోటిక్‌లుంటాయి. మంచి ప్రొటీన్స్‌, బి-కాంప్లెక్‌లను ఇచ్చే సంపూర్ణ ఆహారం.



 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని