అల్పాహార విందు చిన్నారులకు పసందు!

బడి నుంచి వచ్చిన పిల్లలకు చేతిలో ఏదైనా తాయిలం పెట్టాల్సిందే. మరి అది రుచిగా ఉండటంతోపాటు పోషకాలూ ఉండేలా చూసుకోవాలి. కూరగాయ ముక్కలతో నిండిన వెజ్‌ లాలీపప్స్‌.. నోరూరించే ఆలూ చనా చాట్‌, చిటికెలో తయారయ్యే క్రీమ్‌ చీజ్‌ శాండ్‌విచ్‌, చిన్నారులు ఎక్కువగా మెచ్చే బనానా పాన్‌ కేక్‌...

Updated : 14 Nov 2021 06:12 IST

బడి నుంచి వచ్చిన పిల్లలకు చేతిలో ఏదైనా తాయిలం పెట్టాల్సిందే. మరి అది రుచిగా ఉండటంతోపాటు పోషకాలూ ఉండేలా చూసుకోవాలి. కూరగాయ ముక్కలతో నిండిన వెజ్‌ లాలీపప్స్‌.. నోరూరించే ఆలూ చనా చాట్‌, చిటికెలో తయారయ్యే క్రీమ్‌ చీజ్‌ శాండ్‌విచ్‌, చిన్నారులు ఎక్కువగా మెచ్చే బనానా పాన్‌ కేక్‌... ఇలా రకరకాల పోషకాల స్నాక్స్‌తో చిన్నారుల బొజ్జ నింపేయండి మరి.


మేథీ పూరీ

కావాల్సినవి: మెంతి ఆకులు, గోధుమ పిండి- కప్పు చొప్పున; నూనె- డీప్‌ ఫ్రైకి సరిపడా, పసుపు- చిటికెడు; కారం, వెల్లుల్లి తురుము, పెరుగు- రెండు పెద్ద చెంచాల చొప్పున; ఉప్పు- తగినంత, పచ్చిమిర్చి- నాలుగు (సన్నగా తరగాలి), అల్లం తురుము- పెద్ద చెంచా, నెయ్యి- తగినంత, కసూరీ మేథీ- కొద్దిగా, ధనియాల పొడి- చెంచా, గరంమసాలా- పెద్ద చెంచా.

తయారీ:  గిన్నెలో గోధుమ పిండి, మెంతి ఆకులు... ఇలా అన్ని పదార్థాలను ఒకదాని తర్వాత మరొకటి వేసుకుంటూ చివరగా పెరుగు వేసి చపాతీ పిండిలా కలపాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కూడా కలపొచ్చు. ఈ పిండిని అయిదు నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత పూరీల్లా చేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోయాలి. అది కాగుతున్నప్పుడు తయారుచేసి పెట్టుకున్న పూరీలను వేసి రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అంతే నోరూరించే మేథీ పూరీ తినడానికి రెడీ.


వెజ్‌ లాలీ పప్స్‌

కావాల్సినవి: ఉడికించిన బంగాళాదుంపలు- మూడు, క్యారెట్‌- ఒకటి, క్యాప్సికమ్‌- సగం ముక్క, పచ్చిమిర్చి- రెండు, ఉల్లిపాయ ముక్కలు- రెండు చెంచాలు, పనీర్‌ తురుము- 50 గ్రా., కారం- చెంచా, కొత్తిమీర తురుము- చెంచా, బ్రెడ్‌ పొడి- రెండు పెద్ద చెంచాలు, మిరియాల పొడి- అర చెంచా, ఉప్పు- తగినంత, కార్న్‌ఫ్లోర్‌, మైదా- పెద్ద చెంచా చొప్పున; నూనె- తగినంత, అల్లం, వెల్లుల్లి, క్యాప్సికమ్‌ తురుము- చెంచా చొప్పున; రెడ్‌ చిల్లీ సాస్‌, సోయా సాస్‌- పెద్ద చెంచా చొప్పున; టొమాటో కెచప్‌- మూడు పెద్ద చెంచాలు, వైట్‌ వెనిగర్‌- చెంచా.

తయారీ:  ఉడికించిన ఆలుగడ్డలను పెద్ద గిన్నెలో వేసి మెత్తగా మెదపాలి. ఇందులోనే సన్నగా తరిగిన క్యారెట్‌, క్యాప్సికమ్‌, ఉల్లిపాయ ముక్కలు; పచ్చిమిర్చి, పనీర్‌ తురుము, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. దీనికి బ్రెడ్‌ పొడిని కూడా జత చేయాలి. ఇప్పుడీ ముద్దను గుడ్డు లేదా గుండ్రంగా... మీకు నచ్చిన ఆకారంలో చేసుకుని పుల్లకు గుచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి.

మరో గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌, మైదా, చిటికెడు ఉప్పు, కాస్తంత మిరియాల పొడి వేసి, తగినన్ని నీళ్లు పోసి కాస్త చిక్కగా బజ్జీ పిండిలా కలపాలి. ఇందులో లాలీపప్‌ను ముంచాలి. ఆ తర్వాత బ్రెడ్‌ పొడిలో దొర్లించాలి. ఇలా అన్ని లాలీపప్స్‌నూ చేసి పెట్టుకోవాలి.  పొయ్యి మీద పాన్‌ పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఇందులోనే కొన్ని ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి మరికాసేపు వేయించాలి. ఆ తర్వాత వరుసగా చిల్లీ సాస్‌, సోయా సాస్‌, టొమాటో కెచప్‌, వెనిగర్‌ వేసి బాగా కలపాలి. పెద్ద చెంచా కార్న్‌ఫ్లోర్‌ ద్రవాన్ని ఇందులో పోయాలి. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత మిరియాల పొడి వేసి పక్కన పెట్టేయాలి. పొయ్యి మీద మరో కడాయి పెట్టి నూనె పోయాలి. కాగిన నూనెలో లాలీపప్స్‌ వేసి మధ్యస్థ మంటపై బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

వీటిని సాస్‌తో కలిపి తింటే సరి.


క్రీమ్‌ చీజ్‌ శాండ్‌విచ్‌..

కావాల్సినవి: బ్రెడ్‌ స్లైస్‌లు- నాలుగు, చీజ్‌ క్రీమ్‌- రెండు పెద్ద చెంచాలు, కీరా, క్యారెట్‌, కొత్తిమీర తురుము- పెద్ద చెంచా చొప్పున, పచ్చిమిర్చి తురుము- పావు చెంచా (ఆప్షనల్‌), అల్లం తురుము, మిరియాల పొడి- పావు చెంచా చొప్పున,  ఉప్పు- తగినంత, బటర్‌- రెండు పెద్ద చెంచాలు.

తయారీ: టిష్యూపేపర్‌పై కీరా తురుము వేసి, దానిపైన మరో టిష్యూతో కాస్త బలంగా అద్దాలి. ఇలా చేస్తే కీరాలోని నీటిని టిష్యూ పీల్చుకుంటుంది. గిన్నెలో చీజ్‌, క్యారెట్‌, కీరా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి తురుము; మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. బ్రెడ్‌ స్లైస్‌ను తీసుకుని దానిపై చీజ్‌ మిశ్రమాన్ని మొత్తం సమానంగా పరవాలి. ఈ స్లైస్‌పై మరో బ్రెడ్‌ ముక్కను పెట్టాలి. ఇలా అన్నింటినీ తయారుచేసుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి బటర్‌ వేసుకోవాలి. ఇది వేడయ్యాక స్లైస్‌ వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. టొమాటో సాస్‌తో తింటే చాలా బాగుంటాయి.  


మసాలా పాపడ్‌ చాట్‌

కావాల్సినవి: పాపడ్స్‌- కొన్ని, నూనె- వేయించడానికి సరిపడా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు- అర కప్పు చొప్పున; ఉప్పు- తగినంత, కారం- చెంచా, కొత్తిమీర తురుము- కొద్దిగా.

తయారీ: కాగే నూనెలో పెద్ద మసాలా పాపడాలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడొక ప్లేట్‌ తీసుకుని దాంట్లో పాపడ్‌ పెట్టి దానిపైన ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము వేయాలి. తగినంత ఉప్పు, కారం కూడా వేసుకుంటే క్షణాల్లో టేస్టీ టేస్టీ, క్రిస్పీ మసాలా పాపడ్‌ చాట్‌ రెడీ. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.


బనానా పాన్‌ కేక్‌

కావాల్సినవి: అరటి పళ్లు- రెండు; మైదా, పాలు- కప్పు చొప్పున; యాలకుల పొడి- అర చెంచా; చక్కెర, నెయ్యి- రెండు పెద్ద చెంచాల చొప్పున; వంటసోడా- చిటికెడు, ఉప్పు- తగినంత.

తయారీ: అరటిపళ్ల ముక్కలను గిన్నెలో వేసి మెత్తగా మెదిపి గుజ్జుగా చేసుకోవాలి. ఇందులో కాచి చల్లార్చిన పాలను పోసి చక్కెరను జత చేయాలి. దీంట్లోనే ఉప్పు, వంటసోడా, యాలకుల పొడి వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. దీనికి మైదాను చేర్చి ఉండలు లేకుండా కలిపి చిక్కటి దోసె పిండిలా చేసి పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలి. పొయ్యి మీద పెనం పెట్టి అది వేడయ్యాక తయారుచేసి పెట్టుకున్న అరటి పండు, మైదా పిండి మిశ్రమాన్ని దోసెలా వేసుకోవాలి. దీన్ని రెండు వైపులా నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. అంతే రుచికరమైన బనానా పాన్‌ కేక్‌ రెడీ.


ఆలూ చనా చాట్‌

కావాల్సినవి: ఉడికించిన బంగాళాదుంపలు- రెండు, ఉడికించిన కాబూలీ సెనగలు- కప్పు, తరిగిన ఉల్లిపాయ, టొమాటో- ఒక్కోటి చొప్పున; తరిగిన పచ్చిమిర్చి- రెండు, కొత్తిమీర తురుము- కొద్దిగా, జీలకర్ర పొడి, చాట్‌ మసాలా, నిమ్మరసం- చెంచా చొప్పున, సన్న కారప్పూస- కొద్దిగా, ఉప్పు- తగినంత, కారం- చెంచా.

తయారీ:  సెనగలను ఏడెనిమిది గంటలు నానబెట్టాలి. తర్వాత ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆలూను కూడా ఉడికించి, పొట్టు తీసి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద గిన్నెలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, సెనగలు, జీలకర్ర పొడి, చాట్‌ మసాలా, కారం, ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీరను వేసి బాగా కలిపి కాసేపు పక్కన పెట్టాలి. అప్పుడే అన్ని పదార్థాలు ఒకదాని కొకటి కలిసిపోయి ఫ్లేవర్స్‌ అన్నీ పడతాయి. ఇందులో పచ్చిమిర్చి తురుము, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా సన్నకారప్పూస వేసుకుంటే రుచికరమైన చాట్‌ సిద్ధం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు