సూప్‌... సూపరే!

వణికిస్తోన్న చల్లని గాలులు... వీటికి తోడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... వాతావరణం చల్లగా మారిన వేళ.. వేడివేడిగా ఏదైనా తాగితే బాగుంటుంది కదా... చిన్నా, పెద్దా అందరూ నచ్చే చిక్కనైన,  చక్కనైన సూప్‌లు జుర్రితే ఎలా ఉంటుంది? రుచి, కమ్మదనం, ఒంటికి వెచ్చదనంతోపాటు రోగనిరోధకతనూ అందించే నాన్‌వెజ్‌ సూప్‌లను ట్రై చేద్దామా!

Published : 21 Nov 2021 00:41 IST

వణికిస్తోన్న చల్లని గాలులు... వీటికి తోడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... వాతావరణం చల్లగా మారిన వేళ.. వేడివేడిగా ఏదైనా తాగితే బాగుంటుంది కదా... చిన్నా, పెద్దా అందరూ నచ్చే చిక్కనైన,  చక్కనైన సూప్‌లు జుర్రితే ఎలా ఉంటుంది? రుచి, కమ్మదనం, ఒంటికి వెచ్చదనంతోపాటు రోగనిరోధకతనూ అందించే నాన్‌వెజ్‌ సూప్‌లను ట్రై చేద్దామా!


రొయ్యలతో...

కావాల్సినవి: రొయ్యలు- పన్నెండు; నూనె- రెండు పెద్ద చెంచాలు, వెల్లుల్లి తరుగు- రెండు చెంచాలు, అల్లం తరుగు- చెంచా, ఉల్లికాడలు- మూడు, బటన్‌ మష్రూమ్స్‌- ఐదు (ముక్కలుగా కోసుకోవాలి), రెడ్‌ క్యాప్సికమ్‌- ఒకటి (సన్నగా నిలువుగా), థాయ్‌ రెడ్‌ కర్రీ పేస్ట్‌- పెద్ద చెంచా, ఫిష్‌ సాస్‌- చెంచా, సోయాసాస్‌- రెండు చెంచాలు, కొబ్బరిపాలు- కప్పు, ఫిష్‌ స్టాక్‌- రెండు కప్పులు,  మిరియాల పొడి- పావు చెంచా.

తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి నూనె వేసి వేడయ్యాక వెల్లుల్లి, అల్లం తరుగు వేసుకోవాలి. ఇందులోనే గుండ్రంగా కోసిన ఉల్లికాడలు వేసి కాసేపు వేయించాలి. కాస్త వేగిన తర్వాత పుట్టగొడుగు ముక్కలు, రెడ్‌ క్యాప్సికమ్‌ ముక్కలు వేసి కలపాలి. థాయ్‌ రెడ్‌ కర్రీ పేస్ట్‌ వేసి, కొన్ని నీళ్లు పోసి రెండు నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఫిష్‌సాస్‌, సోయా సాస్‌ వేసి కాసేపు కలియబెట్టాలి. దీంట్లో కొబ్బరి పాలు, ఫిష్‌ స్టాక్‌ పోసి మరిగించాలి. ఇందులో రొయ్యల్ని వేసి నాలుగైదు నిమిషాలు ఉడికించాలి. చివరగా మిరియాల పొడి జత చేయాలి. అంతే రుచికరమైన థాయ్‌ స్టైల్‌ రొయ్యల సూప్‌ రెడీ.


ఫిష్‌తో...

కావాల్సినవి: చేప ముక్కలు- ఐదారు, టొమాటో, ఉల్లిపాయ- ఒకటి చొప్పున (ముక్కలుగా కోసుకోవాలి), పచ్చిమిర్చి- నాలుగు (నిలువుగా చీల్చాలి), చిల్లీ ఫ్లేక్స్‌- చెంచా, నూనె, ఉప్పు- తగినంత, కొబ్బరిపాలు- కప్పు, కొత్తిమీర- కొద్దిగా.

తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వాటిని మెత్తగా వేయించుకోవాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోయాలి. అవి కాస్త మరిగాక కొబ్బరి పాలు జత చేయాలి. ఇందులోనే చేప ముక్కలు వేసి బాగా ఉడికించాలి. ఈ మిశ్రమంలో చివరగా చిల్లీఫ్లేక్స్‌ వేసి సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే వేడి వేడి రుచికరమైన చేపల సూప్‌ రెడీ.           


పుట్టగొడుగులతో...

కావాల్సినవి: పుట్టగొడుగులు- అరకిలో, అన్‌సాల్టెడ్‌ బటర్‌- 50 గ్రా., వెల్లుల్లి రెబ్బలు- అయిదు, ఉల్లిపాయలు- రెండు (సన్నగా తరగాలి), ఉప్పు, నూనె- తగినంత, మిరియాల పొడి- పావు చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా.

తయారీ: పొయ్యిపై పాన్‌ పెట్టి బటర్‌ వేసుకోవాలి. ఇది కరిగిన తర్వాత వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇందులోనే మష్రూమ్స్‌ వేసి ఓ మూడు నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు ఉప్పు, మిరియాల పొడిని జత చేయాలి. పుట్టగొడుగులు ఉడికిన తర్వాత అర లీటరు నీళ్లు పోయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని చల్లార్చి మిక్సీ పట్టి కడాయిలో వేసుకోవాలి. మరీ చిక్కగా ఉందనుకుంటే కొన్ని నీళ్లు కలపొచ్చు. దీన్ని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అంతే క్రీమీ మష్రూమ్‌ సూప్‌ రెడీ. గిన్నెలోకి తీసుకుని మష్రూమ్‌ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుంటే సరి.


చికెన్‌తో...

కావాల్సినవి: బోన్‌లెస్‌ చికెన్‌, ఎముకలు- కప్పు చొప్పున, నూనె- రెండు చెంచాలు, బిర్యానీ ఆకులు- రెండు, క్యారెట్‌, ఉల్లిపాయ- ఒక్కోటి చొప్పున (పెద్ద ముక్కలుగా), బటర్‌- పావుకప్పు, వెల్లుల్లి తరుగు- చెంచా, మైదా, ఫ్రెష్‌ క్రీమ్‌- రెండు పెద్ద చెంచాల చొప్పున, మిరియాల పొడి- పావు చెంచా, రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్‌- కొద్దిగా, మిక్స్‌డ్‌ డ్రై హెర్బ్స్‌- చిటికెడు, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు- కొద్దిగా.

తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి నూనె వేసి వేడయ్యాక బిర్యానీ ఆకులు, క్యారెట్‌, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. చికెన్‌ ఎముకలు, ఉప్పు వేసి కాసేపు వేయించాలి. ఇవి వేగాక కాసిన్ని నీళ్లు పోసి మరిగించాలి. మరో పొయ్యి మీద పాన్‌ పెట్టి బటర్‌ వేసి కరిగాక వెల్లుల్లి తరుగు, మైదాపిండి వేసి ఫ్రై చేసుకోవాలి. అది వేగాక చికెన్‌ ముక్కలు వేసి మూతపెట్టి కాసేపు ఉడికించాలి. ఇందులో చికెన్‌ స్టాక్‌ను వడపోసి సూప్‌ చిక్కగా అయ్యేవరకు ఉడకబెట్టాలి. ముక్కలు ఉడికిన తర్వాత క్యారెట్‌ ముక్కలు, ఫ్రెష్‌క్రీమ్‌ కలపాలి. ఆ తర్వాత మిరియాల పొడి, రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్‌, మిక్స్‌డ్‌ డ్రై హార్బ్స్‌, కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేసుకోవాలి.           


గుడ్డుతో...

కావాల్సినవి: గుడ్లు- నాలుగు, చికెన్‌ స్టాక్‌- రెండు కప్పులు, అల్లం తరుగు- చెంచా, ఉల్లిపాయ ముక్కలు- పావు కప్పు, స్ప్రింగ్‌ ఆనియన్స్‌, సోయా సాస్‌- రెండు చెంచాలు, మిరియాల పొడి- కాస్తంత, కొత్తిమీర- కొద్దిగా.

చికెన్‌ స్టాక్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు: చికెన్‌- పావుకిలో, వెల్లుల్లి రెబ్బలు- అయిదు, క్యారెట్‌- రెండు, ఉల్లిపాయ- ఒకటి, కొత్తిమీర కాడలు- నాలుగైదు, కల్లుప్పు- తగినంత, మిరియాలు- చెంచా.

స్టాక్‌ తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి చికెన్‌ ముక్కలు వేసి వేయించాలి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, క్యారెట్‌, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కాడలు, కల్లుప్పు, మిరియాలు వేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత లీటరున్నర నీళ్లు పోసి చిన్న మంటపై దాదాపు గంట మరిగించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడబోసి చికెన్‌ స్టాక్‌ను తీసుకోవాలి.

సూప్‌  తయారీ: పొయ్యిపై పాన్‌ పెట్టి చికెన్‌స్టాక్‌ పోయాలి. దీంట్లో అల్లం తరుగు, ఉల్లికాడలు, సోయాసాస్‌ వేసి మరిగించాలి. మరో గిన్నెలో గుడ్లను వేసి చక్కగా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న స్టాక్‌లో పోస్తూ చక్కగా కలపాలి. బాగా మరిగాక ఉల్లికాడలు వేసి స్టవ్‌ కట్టేయాలి. గిన్నెలోకి తీసుకుని మిరియాల పొడి చల్లి, కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే వేడి వేడి ఎగ్‌ సూప్‌ సిద్ధమైనట్లే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు