కొత్త ఏడాదికి ప్రేమతో...

పుట్టిన రోజు, పెళ్లి రోజు.... సందర్భమేదైనా కేకు ఉండాల్సిందే. మరి ప్రపంచమంతా ఆనందంగా నిర్వహించుకునే కొత్త ఏడాది వేడుకల్లో కేకు కావాలి కదా. మార్కెట్‌లో దొరికేవి కాకుండా వంటింట్లోని రాగులు, కొర్రలు, ఇతర పదార్థాలతో తియ్యనైన కేకులను మీ ప్రేమనంతా రంగరించి తయారు చేసేయండి. కుటుంబ సభ్యులతోపాటు ఆప్తుల నోరు తీపి చేసేయండి.....

Updated : 26 Dec 2021 03:39 IST

పుట్టిన రోజు, పెళ్లి రోజు.... సందర్భమేదైనా కేకు ఉండాల్సిందే. మరి ప్రపంచమంతా ఆనందంగా నిర్వహించుకునే కొత్త ఏడాది వేడుకల్లో కేకు కావాలి కదా. మార్కెట్‌లో దొరికేవి కాకుండా వంటింట్లోని రాగులు, కొర్రలు, ఇతర పదార్థాలతో తియ్యనైన కేకులను మీ ప్రేమనంతా రంగరించి తయారు చేసేయండి. కుటుంబ సభ్యులతోపాటు ఆప్తుల నోరు తీపి చేసేయండి.


ఎగ్‌లెస్‌ రాగి చాక్లెట్‌ కేక్‌

కావాల్సినవి: రాగిపిండి, గోధుమపిండి- ముప్పావుకప్పు చొప్పున, కోకో పొడి- పావు కప్పు, చక్కెర- అర కప్పు, బేకింగ్‌ పౌడర్‌- చెంచాన్నర, బేకింగ్‌ సోడా- అర చెంచా, పాలు- కప్పున్నర,  వెనిల్లా ఎసెన్స్‌- పావు చెంచా, కరిగించిన వెన్న- అరకప్పు, ఉప్పు- చిటికెడు, డార్క్‌చాక్లెట్‌- 150 గ్రా., ఫ్రెష్‌ క్రీమ్‌- 250 ఎం.ఎల్‌., రాళ్లుప్పు- కొద్దిగా, బాదం పలుకులు- కొన్ని.

తయారీ: రాగి, గోధుమ పిండి, కోకో పొడి, చక్కెర, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు... వీటన్నింటినీ ఓ పెద్ద గిన్నెలో ఒకదాని తర్వాత మరొకటి వేసి కలపాలి. ఇందులో పాలు, వెనిల్లా ఎసెన్స్‌, కరిగించిన వెన్న వేసి విస్క్‌తో బాగా కలియబెట్టాలి. పాత్రకు అన్నివైపులా వెన్న రాసి, చెంచా చొప్పున పిండి, కోకో పౌడర్‌ వేసి పాత్ర అంతటా అతుక్కునేలా చూడాలి. ఇప్పుడు కేక్‌ బ్యాటర్‌ను ఈ పాత్రలో సమంగా పరవాలి. కుక్కర్‌ అడుగు భాగంలో రాళ్ల ఉప్పును మందంగా పోయాలి. దీనిమీద కేక్‌ పాత్రను పెట్టి, కుక్కర్‌ మూతను బిగించి మీడియం ఫ్లేమ్‌ మీద దాదాపు నలభై నిమిషాలు కుక్‌ చేయాలి. ఆ తర్వాత మూత తెరిచి కేకును చల్లారనివ్వాలి. పొయ్యి మీద మరో పాత్ర పెట్టి చాక్లెట్‌ ముక్కలు వేసి, ఫ్రెష్‌ క్రీమ్‌ పోసి చిన్న మంటపై నెమ్మదిగా కలుపుతుండాలి. పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్‌ ఆపేయాలి.

చల్లారిన కేకు పైన ఉబ్బుగా ఉన్న భాగాన్ని కట్‌ చేయాలి. కేకుపై చ్లాకెట్‌ ద్రవాన్ని పోసి, బాదం పలుకులు, చాక్లెట్‌ తరుగుతో గార్నిష్‌ చేసుకుంటే టేస్టీ రాగి చాక్లెట్‌ కేక్‌ రెడీ.


ప్రూట్‌..

కావాల్సినవి: బటర్‌, చక్కెర పొడి- 100 గ్రా., గుడ్లు- రెండు, వెనిల్లా ఎసెన్స్‌- పావు చెంచా, బాదం తరుగు- చెంచా, బేకింగ్‌ సోడా- పావు చెంచా, టూటీఫ్రూటీ (ఎరుపు, ఆకుపచ్చ), కిస్‌మిస్‌- పెద్ద చెంచా చొప్పున, జీడిపప్పు- అయిదారు.

తయారీ: పెద్ద గిన్నెలో వెన్న, చక్కెరపొడి, గుడ్లు, వెనిల్లా ఎసెన్స్‌ వేసి బాగా కలియబెట్టాలి. మరో బౌల్‌లో మైదా, వంటసోడా, బాదం తరుగు, టూటీఫ్రూటీ, కిస్‌మిస్‌, జీడిపప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని వెన్న, చక్కెర మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అవెన్‌ను ప్రీహీట్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బౌల్‌లో వేసి అవెన్‌లో 20-25 నిమిషాలు 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద బేక్‌ చేసుకోవాలి. అంతే యమ్మీ యమ్మీ ఫ్రూట్‌ కేక్‌ రెడీ.


ఇలాచీతో..

కావాల్సినవి: మైదా, చక్కెర పొడి, బటర్‌- 175 గ్రా., కర్బూజ గింజలు- చెంచా, వెనిల్లా ఎసెన్స్‌- పావు చెంచా,  కిస్‌మిస్‌- చెంచా, ఇలాచీ పొడి- పది గ్రాములు, గుడ్లు- 3.

తయారీ:  శుభ్రమైన వంటగట్టుపై చక్కెర, వెన్న, వెనిల్లా ఎసెన్స్‌ వేసి చపాతీ పిండిలా కలపాలి. ఈ లోపు వెడల్పాటి గిన్నెలో అడుగున ఇసుక పోసి పొయ్యి మీద పెట్టి చిన్న మంటపై వేడి చేయాలి.
చక్కెర, వెన్న మిశ్రమంలో గుడ్లను వేసి మరోసారి బాగా కలపాలి. ఇందులో మైదా, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. కిస్‌మిస్‌, డ్రైఫ్రూట్స్‌ కావాలంటే వేసుకోవచ్చు.  కేక్‌ బేకింగ్‌ ట్రే తీసుకోవాలి. అందులో అడుగున బటర్‌ పేపర్‌ వేసి బ్యాటర్‌ను సమంగా చేయాలి. పైన కర్బూజ గింజలతో గార్నిష్‌ చేసుకోవాలి. ఈ పాత్రను పొయ్యి మీద ఉన్న ఇసుక గిన్నెలో పెట్టి మూతపెట్టి 30 - 40 నిమిషాలు చిన్న మంటపై కుక్‌ చేయాలి.\


ఇండియన్‌ స్పైస్‌ కేక్‌.

కావాల్సినవి: మరిగించిన చిక్కటి పాలు- అర లీటరు, చక్కెర, మైదా- రెండు కప్పుల చొప్పున, కరిగించిన నెయ్యి- అర కప్పు, రవ్వ- కప్పు, బేకింగ్‌ పౌడర్‌- మూడు చెంచాలు, బేకింగ్‌ సోడా- ఒకటిన్నర చెంచా, సోంపు- రెండు చెంచాలు, ఇలాచీ పొడి- చెంచా, దాల్చినచెక్క పొడి- అర చెంచా, బాదం తరుగు- కొద్దిగా.

తయారీ: గిన్నెలో వేడి పాలు పోసి చక్కెర వేసి కరిగించాలి. ఇందులో కరిగించిన నెయ్యి/వెన్న కలిపి చల్లార్చాలి. మరో గిన్నెలో మైదా, రవ్వ, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, సోంపూ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలియబెట్టాలి. గిన్నె అడుగున బటర్‌ పేపర్‌ వేసి అంచుల చుట్టూ బటర్‌ రాయాలి. ఇప్పుడు దీంట్లో కేక్‌ బ్యాటర్‌ పోసి పైన బాదం పలుకులతో గార్నిష్‌ చేసుకోవాలి. అవెన్‌ను 160 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద పదిహేను నిమిషాలు ప్రీహీట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత కేక్‌ పాత్రను అవెన్‌లో పెట్టి అదే ఉష్ణోగ్రత వద్ద గంట బేక్‌ చేయాలి. ఆ తర్వాత బయటకు తీసి గది ఉష్ణోగ్రత వద్ద చల్లారనివ్వాలి. అంతే రుచికరమైన స్పైస్‌ కేక్‌ సిద్ధం.


పైనాపిల్‌ అప్స్‌ డౌన్‌

కావాల్సినవి: వెన్న, పంచదార పొడి- కప్పు చొప్పున, మైదా- అర కప్పు, పైనాపిల్‌ ముక్కలు- నాలుగైదు, గుడ్లు- రెండు, వెనిల్లా ఎసెన్స్‌- పావుచెంచా, చెర్రీలు- అయిదారు, బేకింగ్‌పౌడర్‌- అర చెంచా, నెయ్యి- కొద్దిగా.

తయారీ: గిన్నెలో వెన్న, పంచదార పొడి, వెనిల్లా ఎసెన్స్‌ వేసి బాగా కలపాలి. ఇందులో గుడ్లను వేసుకోవాలి. మైదా, బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలపాలి. బేకింగ్‌ ట్రేకు నెయ్యి రాసి బ్యాటర్‌ వేసుకోవాలి. బ్రౌన్‌ షుగర్‌ వేసి, అక్కడక్కడా పైనాపిల్‌ ముక్కలు, వాటిపై చెర్రీస్‌ పెట్టాలి. దీనిపై కేక్‌ బ్యాటర్‌ పోయాలి. ఈ మిశ్రమాన్ని అవెన్‌లో 145 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద అరగంట బేక్‌ చేసుకోవాలి. ఆ తర్వాత అవెన్‌ నుంచి తీసి చల్లారిన తర్వాత ప్లేట్‌లో తీసుకుంటే సరి.


కొర్రలతో...

కావాల్సినవి: కొర్రలు- కప్పు, చక్కెరపొడి/బెల్లంపొడి- అర కప్పు, పెరుగు, నూనె- పావుకప్పు చొప్పున, వెనిల్లా ఎసెన్స్‌, బేకింగ్‌ పౌడర్‌- పావుచెంచా చొప్పున, బేకింగ్‌ సోడా- అర చెంచా, కార్న్‌ఫ్లోర్‌- రెండు పెద్ద చెంచాలు,  పాలు- కాసిన్ని,  మైదా, బటర్‌- పెద్ద చెంచా చొప్పున, చాకో చిప్స్‌- కొన్ని, ఉప్పు- చిటికెడు.

తయారీ: గిన్నెలో పెరుగు, చక్కెరపొడి నూనె వేసి విస్క్‌తో బాగా కలపాలి. ఈ మిశ్రమానికి వెనిల్లా ఎసెన్స్‌ వేసి మరోసారి కలపాలి. కొర్రల పిండి, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, చిటికెడు ఉప్పు, కార్న్‌ఫ్లోర్‌లను పిండి జల్లెడలో వేసి జల్లించి ఆ పిండిని పెరుగు గిన్నెలో వేసి బాగా కలియబెట్టాలి. ఈలోగా అవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు 10 నిమిషాలు ప్రీహీట్‌ చేసుకోవాలి. పిండిలో కాసిన్ని పాలు పోసి మరోసారి బాగా కలియబెట్టాలి.

కేక్‌ రిలీజింగ్‌ పేస్ట్‌ కోసం.. మైదా, బటర్‌, నూనెలను బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌ చేసే పాత్రకు చక్కగా రాయాలి. ఆ తర్వాత కేక్‌ బ్యాటర్‌ను వేసి చాకో చిప్స్‌ చల్లి అవెన్‌లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు దాదాపు అరగంట బేక్‌ చేయాలి. అంతే కొర్రల కేక్‌ రెడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని