పోషకాహారానికి ఓట్స్‌ వేద్దాం!

ఓట్స్‌.. చక్కటి పోషకాహారం. అలా అని రోజూ పాలలో వేసుకుని చప్పగా తినలేమంటారా... వీటికి ఇతర పదార్థాలను జోడించి రకరకాలుగా వండుకోవచ్చు.  రుచికి రుచీ... బరువూ నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యం కూడా.

Updated : 02 Jan 2022 02:18 IST

ఓట్స్‌.. చక్కటి పోషకాహారం. అలా అని రోజూ పాలలో వేసుకుని చప్పగా తినలేమంటారా... వీటికి ఇతర పదార్థాలను జోడించి రకరకాలుగా వండుకోవచ్చు.  రుచికి రుచీ... బరువూ నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యం కూడా.


కిచిడీ...

కావాల్సినవి:  ఓట్స్‌- ముప్పావు కప్పు, పెసరపప్పు- కప్పు, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, దాల్చిన చెక్క- పెద్ద ముక్క, జీలకర్ర- పెద్ద చెంచా, ఉల్లిపాయ- ఒకటి (ముక్కలుగా కోయాలి), అల్లం తరుగు- చెంచా, పచ్చిమిర్చి- నాలుగు (చిన్నగా తరగాలి), క్యారెట్‌- ఒకటి (తరగాలి), తరిగిన బీన్స్‌- అర కప్పు, నీళ్లు- నాలుగున్నర కప్పులు, ఉప్పు- తగినంత, కారం- చెంచా, బఠానీలు- అర కప్పు, ఇంగువ- చిటికెడు, కొత్తిమీర- కొద్దిగా.
తయారీ: పెసరపప్పును శుభ్రంగా కడిగి పావుగంట నానబెట్టాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో దాల్చిన చెక్క, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారి కాస్త మెత్తబడే వరకు వేయించాలి. పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు వేసుకోవాలి. వీటిని కాసేపు వేయించి, క్యారెట్‌, బీన్స్‌ ముక్కలు; పచ్చిబఠానీలు వేయాలి. ఇంగువనూ జత చేయాలి. అయిదారు నిమిషాలు వేయించిన తర్వాత పసుపు, కారం వేసి మంటను కాస్త తగ్గించి కలుపుతూ ఉంటే మాడిపోవు. ఈ మిశ్రమంలో నానబెట్టిన పెసరపప్పు, ఓట్స్‌ను కలపాలి. తగినన్ని నీళ్లు పోసి మధ్యస్థ మంటపై మూడొంతులు ఉడికించాలి. చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసి, మూత పెట్టి మరికాసేపు ఉడికించాలి. అంతే రుచికరమైన కిచిడీ తయారైపోతుంది.


మంచూరియా...

కావాల్సినవి: ఓట్స్‌- 150 గ్రా., ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరగాలి), అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు- చెంచా చొప్పున, క్యారెట్‌ తురుము- రెండు చెంచాలు, సన్నగా తరిగిన క్యాబేజీ- పావు కప్పు, మిరియాల పొడి- పావు చెంచా, ఉప్పు- తగినంత, టొమాటో, సోయాసాస్‌- పెద్ద చెంచా చొప్పున, చిల్లీ సాస్‌- రెండు పెద్ద చెంచాలు, టొమాటో కెచప్‌- మూడు పెద్ద చెంచాలు.

తయారీ: ఓట్స్‌తో మొదలుపెట్టి ఉప్పు వరకు అన్ని పదార్థాలను ఒకదాని తర్వాత మరొకటి వేసి, చివరగా నీళ్లు పోసి బాగా కలిపి అయిదు నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత వీటిని లడ్డూల్లా చేసుకుని మరికాసేపు అలాగే పెట్టాలి. ఆ తర్వాత కాగే నూనెలో వేసి వేయించాలి. వీటి కోసం ప్రత్యేకంగా సాస్‌ తయారుచేసుకోవాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టి నూనె వేసి వెల్లుల్లి తరుగు, పెద్దగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. దీనికి టొమాటో, సోయాసాస్‌, చిల్లీ సాస్‌, టొమాటో కెచప్‌లను వేసి మరోసారి బాగా కలపాలి. కొన్ని నీళ్లు పోసి కాస్త ఉడికించాలి. ఇందులో ఓట్స్‌ మంచూరియా బాల్స్‌ వేసి ఈ మిశ్రమం ఉండలకు పట్టేలా కలపాలి. చివరగా ఉల్లికాడలు వేసి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి.


చిల్లా...

కావాల్సినవి: ఓట్స్‌- కప్పు, పుల్లటి మజ్జిగ- కప్పున్నర, కొత్తిమీర- కొద్దిగా, నూనె- రెండు చెంచాలు, రాళ్లుప్పు- సరిపడా, అల్లం ముద్ద- చెంచా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం- అర చెంచా చొప్పున, పచ్చిమిర్చి- ఒకటి (సన్నగా తరగాలి), చాట్‌ మసాలా- చెంచా, మిరియాల పొడి- పావు చెంచా.
తయారీ: ఓట్స్‌ను పెనంలో వేసి వేయించి చల్లార్చి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో మజ్జిగ, అల్లం ముద్ద, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి, కారం, సరిపడా ఉప్పు వేసి మరోసారి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెద్ద గిన్నెలోకి మార్చాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టుకోవాలి. కాస్త నూనె రాసి ఓట్స్‌ మిశ్రమాన్ని దోసెలా వేసి మూత పెట్టాలి. మంటను మధ్యస్థంగా ఉంచి రెండు వైపులా నూనె వేసి చక్కగా కాల్చుకోవాలి.


అరటిపండుతో...

కావాల్సినవి: ఓట్స్‌- కప్పు, అరటి పండు- ఒకటి (ముక్కలుగా కోసుకోవాలి), ఎండుఫలాలు- గుప్పెడు, కాచి చల్లార్చిన పాలు- కప్పు, ఖర్జూరాలు- మూడు (చిన్న ముక్కలుగా చేయాలి) కార్న్‌ఫ్లేక్స్‌- కొన్ని.
తయారీ: మరిగే నీళ్లలో ఓట్స్‌ వేసి కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత వీటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో పాలు కలపాలి. తేనెను జత చేయాలి. ఆపై అరటి పండు ముక్కలు, కార్న్‌ఫ్లేక్స్‌, ఎండుఫలాలు, ఖర్జూర ముక్కలను కూడా వేసుకోవాలి. అంతే రుచికరమైన, ఆరోగ్యాన్ని ఇచ్చే ఓట్స్‌, బనానా అల్పాహారం సిద్ధం.


ఆమ్లెట్‌...

కావాల్సినవి:  వేయించిన ఓట్స్‌- మూడు చెంచాలు, పాలు- పావు కప్పు, గుడ్లు- నాలుగు, తరిగిన ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, క్యారెట్‌ తురుము- రెండు చెంచాల చొప్పున, తరిగిన పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌- చెంచా చొప్పున, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- పావు చెంచా, నూనె- సరిపడా.
తయారీ: గిన్నెలో ఓట్స్‌ వేసి పాలు పోసి పది నిమిషాలు నానబెట్టాలి. మరో గిన్నెలో గుడ్లను పగలగొట్టాలి. ఇందులో మిరియాల పొడి, ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌, టొమాటో ముక్కలు; క్యారెట్‌, కొత్తిమీర తురుము; నానబెట్టిన ఓట్స్‌ను పాలతో సహా వేసేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా గిలక్కొట్టాలి. పాన్‌ పెట్టి నూనె వేసి గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసుకుని మూత పెట్టి ఏడెనిమిది నిమిషాలు చిన్నమంటపై ఉడికించాలి. ఆ తర్వాత మూత తీసి ఆమ్లెట్‌ను తిరగేసి రెండో వైపు రెండు నిమిషాలు ఉడికిస్తే సరి. ఎంతో రుచికరమైన ఓట్స్‌ ఆమ్లెట్‌ సిద్ధమైనట్లే.


మసాలాతో..  

కావాల్సినవి: రోల్డ్‌ ఓట్స్‌- రెండు కప్పులు, పసుపు- పావు చెంచా, జీలకర్ర, కారం- చెంచా చొప్పున, పచ్చిమిర్చి- రెండు (సన్నగా తరగాలి), ఉల్లిపాయ, టొమాటో- ఒక్కోటి చొప్పున (సన్నగా తరగాలి), నూనె, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు- కొద్దిగా.
తయారీ: పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. ఇవి రంగు మారిన తర్వాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి లేత బంగారు రంగులోకి వచ్చే వరకు చిన్న మంటపై కాసేపు వేయించాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, మరికాస్త ఉప్పు వేసి మూత పెట్టి చిన్న మంటపై రెండు, మూడు నిమిషాలు ఉడికించాలి. మూత తీసి కారం, పసుపు వేసి మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు ఓట్స్‌, వేసి ఇంకోసారి కలిపి నాలుగు కప్పుల నీళ్లు పోసి అయిదు నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి కలపాలి. అంతే కమ్మ కమ్మని మసాలా ఓట్స్‌ తినడానికి సిద్ధం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని