పనస పూలతో...పండగ చేద్దాం!

తీపిని పంచే నువ్వుల పట్టీ... నోరూరించే పనస పూలు.. చూస్తూనే గుటుక్కుమనిపించే గోరుమిటీలు... కారంకారంగా కారాకాజాలు... అందరూ నచ్చే రుచుల కదంబం... ఈ సంక్రాంతికి తీపి, కారాలతో పసందుగా పండగ చేసుకోండి మరి.

Updated : 09 Jan 2022 06:31 IST

తీపిని పంచే నువ్వుల పట్టీ... నోరూరించే పనస పూలు.. చూస్తూనే గుటుక్కుమనిపించే గోరుమిటీలు... కారంకారంగా కారాకాజాలు... అందరూ నచ్చే రుచుల కదంబం... ఈ సంక్రాంతికి తీపి, కారాలతో పసందుగా పండగ చేసుకోండి మరి.


గోరుమిటీలు...

కావాల్సినవి: మైదా- కప్పు, ఉప్మా రవ్వ- పావు కప్పు, ఉప్పు- చిటికెడు, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, పంచదార- కప్పు, ఇలాచీ- అర చెంచా, నూనె- సరిపడా.
తయారీ: గిన్నెలో మైదా, ఉప్పు, రవ్వ, కరిగించిన నెయ్యి వేసి ఉండలు లేకుండా కలపాలి. దీంట్లో కొన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. ఈ పిండి ముద్దను బొటనవేలి గోరుతో నొక్కుతూ చిన్న చిన్నగా చేసుకోవాలి. ఆ తర్వాత నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. 

 బాండీలో చక్కెర, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి తీగపాకం వచ్చేవరకు కలుపుతూ ఉండాలి. ఈ పాకంలో వేయించిన గోరుమిటీలను వేసి కాసేపు నానబెట్టాలి.


కారా కాజాలు

కావాల్సినవి: మైదా- కప్పు, కారం- చెంచా, ఉప్పు- తగినంత, ఆమ్‌చూర్‌ పొడి- అర చెంచా, కసూరీమేథీ- కొద్దిగా, నూనె- వేయించడానికి సరిపడా.
తయారీ: పెద్ద గిన్నెలో మైదా, ఉప్పు, కారం, కసూరీమేథీ, ఆమ్‌చూర్‌ పొడి వేసి, కొద్దిగా నూనె, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టాలి. పొయ్యి వెలిగించి కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. పిండిని పూరీల్లా ఒత్తుకుని నచ్చిన ఆకారంలో కోసి కాగే నూనెలో వేసి రెండు వైపులా వేయించుకోవాలి. అంతే రుచికరమైన కారా కాజాలు తినడానికి సిద్ధం.


పనస పూలు

కావాల్సినవి: మైదా, గోధుమపిండి- కప్పు చొప్పున, ఉప్పు- తగినంత, వంటసోడా- చిటికెడు, వెన్న- పెద్దచెంచా, నూనె- సరిపడా. పాకం తయారీకి... చక్కెర- కప్పు, నీళ్లు- అర కప్పు.
తయారీ: గిన్నెలో మైదా, గోధుమ పిండి, వంటసోడా, ఉప్పు, వెన్న వేసి ఉండలు లేకుండా కలపాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి ముద్దను చిన్న పూరీ ముద్దల్లా చేసుకోవాలి. వీటిని చిన్నగా గుడ్డు ఆకారంలో తాల్చుకోవాలి. ఈ పూరీపై చాకుతో నిలువుగా గీతల్లా కోయాలి. అయితే చివర్లు పూర్తిగా తెగకుండా జాగ్రత్త పడాలి. ఇలా కోసిన తర్వాత స్ప్రింగ్‌లా చుట్టి రెండు చివర్లు మూసేయాలి. ఇలా అన్నింటిని తయారుచేసుకుని కాగే నూనెలో వేసి మంటను మధ్యస్థంగా పెట్టి రెండు వైపులా మంచి రంగు వచ్చేవరకు వేయించాలి.
మరో పొయ్యి మీద పెనం పెట్టి చక్కెర, దానికి సగం పరిమాణంలో నీళ్లు పోసి మొత్తం కరిగించి తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి. దీంట్లో వేయించి పెట్టుకున్న పనస తొనలను వేసి కాసేపు నానబెడితే తియ్యతియ్యని పనస పూలు తినడానికి రెడీ.


బెల్లం వెన్న పొంగనాలు..

కావాల్సినవి: దోశ పిండి, కొబ్బరి, బెల్లం, క్యారెట్‌ తురుము- కప్పు చొప్పున,  నెయ్యి- నాలుగు చెంచాలు, వెన్న- కప్పు, కాజు, బాదం, పిస్తా ముక్కలు- పావు కప్పు.
తయారీ: పెద్ద గిన్నెలో దోశ పిండి, కొబ్బరి, క్యారెట్‌ తురుము, వెన్న, ఎండు ఫలాల ముక్కలు వేసి బాగా కలపాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి బెల్లం వేసి, తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం తయారు చేసుకోవాలి. ఈ పాకాన్ని దోశ పిండిలో పోసి చక్కగా కలపాలి. పొంగనాల పెనంలో కాస్తంత నెయ్యి రాసి ఈ పిండిని పొంగనాల్లా వేసుకోవాలి. కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన తియ్యతియ్యని బెల్లం వెన్న పొంగనాలు రెడీ.


కదంబం...

కావాల్సినవి: బియ్యం, ఉడికించిన కందిపప్పు- పెద్ద కప్పు చొప్పున, చింతపండు రసం- కప్పు, అన్ని రకాల కూరగాయలు- కప్పు చొప్పున, పసుపు, ఆవాలు- పావు చెంచా, ఉప్పు- సరిపడా, నెయ్యి, పల్లీలు- పావు కప్పు చొప్పున, ఎండుకొబ్బరి- పెద్ద ముక్క, ఎండు మిరపకాయలు- ఏడెనిమిది, ధనియాలు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, జీలకర్ర- చెంచా, మెంతులు- అర చెంచా చొప్పున, ఇంగువ- కొద్దిగా, కరివేపాకు రెబ్బలు- రెండు, జీడిపప్పు- అయిదారు.
తయారీ: పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేయాలి. ఆ తర్వాత క్యారెట్‌, బంగాళాదుంప, చిక్కుడు, బెండకాయ, చిలగడ దుంప, బీన్స్‌, పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్‌, వంకాయ, ముల్లంగి, టొమాటో, బూడిద గుమ్మడి ముక్కలు వేయాలి. కొన్ని పల్లీలూ వేసి ఉడికించాలి. మరో పొయ్యి మీద పెనం పెట్టి ఎండుకొబ్బరి, ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. మరోసారి పెనంలో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. కూరగాయలు ఉడికిన తర్వాత దాంట్లో బియ్యాన్ని వేసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత కందిపప్పు, చింతపండు రసం, మసాలా పొడి కలిపి మరో రెండు నిమిషాలు మగ్గించాలి.
మరోసారి పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నెయ్యి వేసి ఆవాలు, జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపును అన్నంలో వేసి రెండు నిమిషాలు మగ్గించాలి. చివరగా, నెయ్యి, కొత్తిమీరతో అలంకరించాలి. అంతే ఘుమఘుమలాడే కదంబం సిద్ధమైనట్లే.


నువ్వుల చిక్కీ..

కావాల్సినవి: నువ్వులు- కప్పు, బెల్లం- ముప్పావు కప్పు, చక్కెర, చక్కెర పొడి, ఎండు కొబ్బరి తురుము- పావు కప్పు చొప్పున, ఇలాచీ పొడి, శొంఠి పొడి- పావు చెంచా చొప్పున.
తయారీ: నువ్వులను రెండు గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత  నీళ్లు ఒంపేసి కడాయిలో వేసి చిన్న మంటపై దోరగా తడి పూర్తిగా పోయి పొడి పొడిగా అయ్యేవరకు చాలా సేపు వేయించాలి. వీటిని వేరొక మూతలోకి తీసుకుని చల్లార్చాలి. నువ్వులు వేయించిన పాత్రలోనే బెల్లం, చక్కెర వేసి కొన్ని నీళ్లు పోసి ముదురు పాకం తయారుచేసుకోవాలి. ఇందులో శొంఠి, ఇలాచీ పొడులు, ఎండు కొబ్బరి తురుము వేసి ఓసారి కలిపిన తర్వాత పొయ్యి కట్టేయాలి. ఇందులో వేయించిన నువ్వులను వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చదునైన చెక్కపై చక్కెర పొడి చల్లి, దానిపై తయారుచేసి పెట్టుకున్న బెల్లం, నువ్వుల మిశ్రమం వేసి చపాతీ కర్రతో చదునుగా చేసుకోవాలి. దీనిపై కొంచెం కొబ్బరి తురుము వేసి కాస్త వేడిగా ఉన్నప్పుడే నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కోసుకోవాలి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని