చపాతీ... పుల్కాలకుసైదోడు!

బరువు తగ్గాలనో... ఉన్నదాన్ని నియంత్రించుకుంటూ ఆరోగ్యంగా ఉండాలనో... అలవాటో... ఏదైతేనేం ఈ మధ్య చాలామంది రాత్రిపూట అన్నానికి బదులుగా చపాతీ, పుల్కాలు తింటున్నారు. వీటిలోకి చిక్కగా, కాస్త కారంకారంగా, రుచిగా కూరలుంటే ఎంచక్కా తినేయొచ్చు.  సెనగలతో చేసిన మసాలా కూర.. మెంతి, పాలకూర, పన్నీర్‌తో చిక్కటి గ్రేవీ.. క్యాప్సికం మసాలా.. నోరూరించే ఆలూ మటర్‌.. పుట్టగొడుగుల కర్రీ... వావ్‌... చదువుతుంటేనే నోరూరుతోంది కదూ... మరెందుకాలస్యం? మీరూ ప్రయత్నించండి మరి.

Published : 23 Jan 2022 01:00 IST

బరువు తగ్గాలనో... ఉన్నదాన్ని నియంత్రించుకుంటూ ఆరోగ్యంగా ఉండాలనో... అలవాటో... ఏదైతేనేం ఈ మధ్య చాలామంది రాత్రిపూట అన్నానికి బదులుగా చపాతీ, పుల్కాలు తింటున్నారు. వీటిలోకి చిక్కగా, కాస్త కారంకారంగా, రుచిగా కూరలుంటే ఎంచక్కా తినేయొచ్చు.  సెనగలతో చేసిన మసాలా కూర.. మెంతి, పాలకూర, పన్నీర్‌తో చిక్కటి గ్రేవీ.. క్యాప్సికం మసాలా.. నోరూరించే ఆలూ మటర్‌.. పుట్టగొడుగుల కర్రీ... వావ్‌... చదువుతుంటేనే నోరూరుతోంది కదూ... మరెందుకాలస్యం? మీరూ ప్రయత్నించండి మరి.


పుట్టగొడుగుల మసాలా కూర...

కావాల్సినవి: పుట్టగొడుగులు- 400 గ్రా., నూనె- తగినంత, దాల్చిన చెక్క- ఒకటి, లవంగాలు, ఇలాచీ- నాలుగైదు, షాజీరా, సోంపూ- అర చెంచా చొప్పున, సన్నగా తరిగిన ఉల్లిపాయలు- మూడు(పెద్దవి), నిలువుగా కోసిన పచ్చిమిరపకాయలు- రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద- రెండు చెంచాలు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు- మూడు(పెద్దవి), ఉప్పు- తగినంత, పసుపు- పావు చెంచా, కారం- రెండు చెంచాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి- చెంచా చొప్పున, గరంమసాలా- అర చెంచా, కొత్తిమీర తరుగు - కొద్దిగా.

తయారీ: పుట్టగొడుగులను శుభ్రపరిచి సన్నగా తరిగి పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక గరంమసాలా దినుసులన్నీ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కాసేపు వేగనివ్వాలి. ఆపై టొమాటో ముక్కలనూ జత చేయాలి. ఈ ముక్కలు కాస్త ఉడికి కూర దగ్గర పడిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పుట్టగొడుగు ముక్కలను వేసి మరోసారి కలియబెట్టాలి. దీన్ని దాదాపు పది నిమిషాలు మంటను మధ్యస్థంగా పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత పావు కప్పు నీళ్లు పోసి ముక్కలు పూర్తిగా మగ్గేలా చూడాలి. ఇప్పుడు గరంమసాలా జత చేయాలి. కొత్తిమీర తరుగుతో అలంకరిస్తే ఘుమఘుమలాడే పుట్టగొడుగుల మసాలా కూర సిద్ధం.


క్యాప్సికమ్‌ మసాలా...

కావాల్సినవి: మసాలా కోసం...  పల్లీలు, కొత్తిమీర తరుగు- రెండు పెద్ద చెంచాల చొప్పున, నువ్వులు- చెంచా, నూనె- రెండు చెంచాలు, ధనియాలు- చెంచా, జీలకర్ర- అర చెంచా, మెంతులు- పావు చెంచా, ఎండుమిర్చీ- ఆరు, కొబ్బరిపొడి- పావు కప్పు.
కూర కోసం... నూనె- రెండు పెద్ద చెంచాలు, ఉల్లిపాయ- ఒకటి(సన్నగా తరగాలి), అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, క్యాప్సికమ్‌- ఒకటి (పెద్ద ముక్కలుగా), టొమాటో- ఒకటి (ముక్కలుగా), పెద్ద ఉల్లిపాయ ముక్కలు- కొన్ని, పసుపు- పావు చెంచా, ఉప్పు- చెంచా, చింతపండు గుజ్జు- అర కప్పు, కరివేపాకు- రెండు రెమ్మలు.

తయారీ: పొయ్యి మీద పెనం పెట్టి పల్లీలు, నువ్వులనూ వేసి చక్కటి వాసన వచ్చే వరకు చిన్న మంటపై వేయించాలి. ఆ తర్వాత పల్లీల పొట్టు తీసి చల్లార్చి పెట్టుకోవాలి. అదే పెనంపై కాస్త నూనె వేసి ధనియాలు, జీలకర్ర, మెంతులను రంగు మారే వరకు వేయించుకోవాలి. ఈ మిశ్రమానికి కరివేపాకు, ఎండుమిర్చీ, ఎండు కొబ్బరి ముక్కలను జత చేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఈ దినుసులన్నీ చల్లార్చి పొడి చేసుకోవాలి. నీళ్లు కలపొద్దు. పొయ్యి మీద పెద్ద కడాయి పెట్టి నూనె పోసి అది వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలపాలి.  క్యాప్సికమ్‌, పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలను జత చేయాలి. పసుపు, ఉప్పు కూడా చేర్చాలి. తయారుచేసి పెట్టుకున్న మసాలాను వేసి నిమిషంపాటు బాగా కలపాలి. దీంట్లోనే చింతపండు గుజ్జు వేసి బాగా కలియబెట్టాలి. కావాల్సినన్ని నీళ్లు పోసి మూతపెట్టి పది నిమిషాలు చిన్న మంటపై ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసుకుంటే సరి.


ఆలూ మటర్‌...

కావాల్సినవి: బఠాణీలు- కప్పు, ఆలుగడ్డలు, టొమాటోలు, వెల్లుల్లి రెబ్బలు- ఆరేడు చొప్పున, అల్లం ముక్క- పెద్దది, పచ్చిమిర్చి- మూడు నాలుగు, నెయ్యి- నాలుగు పెద్ద చెంచాలు, జీలకర్ర- చెంచా, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, కారం, ధనియాల పొడి, సెనగ పిండి- పెద్ద చెంచా చొప్పున, ఆమ్‌చూర్‌- చెంచా, ఉప్పు- తగినంత, వేడినీళ్లు- లీటరు, ఇంగువ- చెంచా.

తయారీ: ఆలూ, టొమాటోలను పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. టొమాటో ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, పచ్చిమిర్చిని ఓ చిన్న మిక్సీజార్‌లోకి వేసి ప్యూరీలా చేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించాలి. ఇందులో తయారుచేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఏడెనిమిది నిమిషాలు లేదా కూర నుంచి నూనె వేరయ్యే వరకు ఉడికించాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఆమ్‌చూర్‌, సెనగపిండి వేసి బాగా కలపాలి. దీంట్లో అర లీటరు వేడి నీళ్లు పోయాలి. కూర చిక్కగా అయ్యాక ఉడికించి పెట్టుకున్న బఠాణీలు, ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలి. వీటికి కూరంతా బాగా పట్టేలా కలిపి మరో అర లీటరు నీళ్లు పోసి తగినంత ఉప్పు చేర్చాలి. ఈ మిశ్రమంపై మూత పెట్టి పది నిమిషాలు మధ్యస్థ మంటపై ఉడికించాలి. ఆలూ, బఠాణీ ఉడికిన తర్వాత గరంమసాలా, కొత్తిమీర వేయాలి. మరో పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి చెంచా ఇంగువ జోడించాలి. దీన్ని కూరలో కలపాలి.


సెనగల మసాలా కూర

కావాల్సినవి: ఉడికించిన కాబూలీ సెనగలు- కప్పు, ఉడికించిన కూరగాయల ముక్కలు- రెండు కప్పులు,  ఉల్లిపాయలు- రెండు (ముక్కలుగా), నిలువుగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు- అయిదారు, నూనె- మూడు పెద్ద చెంచాలు, అల్లంవెల్లుల్లి ముద్ద- పెద్ద చెంచా, ఉప్పు, కారం- తగినంత, పసుపు- పావు చెంచా, ధనియాల పొడి, గరంమసాలా- చెంచా చొప్పున, టొమాటో గుజ్జు- కప్పు.

తయారీ: పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించి మెత్తగా చేసుకున్న టొమాటో గుజ్జును వేయాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న కాబూలీ సెనగలు, కూరగాయ ముక్కలు వేసి బాగా కలపాలి. కొన్ని నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి. చివరగా గరంమసాలా వేసి, కొత్తిమీరతో అలంకరిస్తే సరి.


మేథీ పాలక్‌ పనీర్‌...

కావాల్సినవి: పాలకూర, మెంతికూర- కట్ట చొప్పున, పనీర్‌- 350 గ్రా., నూనె- పెద్ద చెంచా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి- కొన్ని, జీలకర్ర- చెంచా, ఉల్లిపాయలు- రెండు (ముక్కలుగా), పచ్చిమిర్చి- రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, శొంఠి పొడి, సోంపు పొడి- చెంచా చొప్పున, కారం- రెండు చెంచాలు, గరంమసాలా- అర చెంచా, ఉప్పు- తగినంత.

తయారీ: మెంతి, పాలకూరలను శుభ్రం చేసి తగినన్ని నీళ్లు పోసి అయిదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత నీటిని పారబోసి ఆకులను చల్లార్చి పేస్ట్‌లా చేసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి పనీర్‌ ముక్కలను వేయించి  పక్కన పెట్టుకోవాలి. మరోసారి బాండీ పెట్టి చెంచా నూనె వేసుకోవాలి. ఇందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి చక్కటి రంగు వచ్చే వరకు వేయించాలి. దీంట్లో అల్లంవెల్లుల్లి ముద్ద వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, శొంఠిపొడి, ఉప్పు, అన్నీ వేసి బాగా కలపాలి. తయారుచేసి పెట్టుకున్న పాలకూర, మెంతాకుల ప్యూరీని కలపాలి. కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. మూతపెట్టి పది నిమిషాలు చిన్నమంటపై ఉడికించాలి. ఇప్పుడు గరం మసాలా, సోంపు పొడివేయాలి. చివరగా పనీర్‌ ముక్కలను జత చేసి బాగా కలియబెట్టాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని