Published : 20 Feb 2022 00:09 IST

తొక్కేయకండి!

బోలెడు టాలెంట్‌ ఉంది!

‘పీలర్‌తో చకచకా తొక్క తీసేసి చెత్తబుట్టలో వేసేయకండి. మాలోనూ ఎంతో టాలెంట్‌ ఉంది’ అంటున్నాయి కూరగాయలు, పండ్ల తొక్కలు.  అవును నిజమే మనం పారేసే తొక్కల్లో విటమిన్లు, మినరళ్లు ఉంటాయి. వీటితో  టీ, సాస్‌, చిప్స్‌, చట్నీ... మరెన్నో రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు.

బీరకాయ పొట్టు చట్నీ...

కావాల్సినవి: బీరకాయ పొట్టు- పెద్ద కప్పు, నువ్వులు, చింతపండు గుజ్జు, నూనె- రెండు చెంచాల చొప్పున, పచ్చిమిరపకాయలు- నాలుగైదు, వెల్లుల్లి రెబ్బలు- ఏడెనిమిది, తాలింపు దినుసులు- అర చెంచా, ఎండుమిర్చి- రెండు, ఉప్పు- సరిపడా.

తయారీ: పొయ్యి మీద బాండీ పెట్టి నువ్వులను చిన్న మంటపై వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో నూనె వేసి వేడయ్యాక శుభ్రం చేసిన బీరకాయ పొట్టును వేసి రెండు, మూడు నిమిషాలు వేయించాలి. మొదట నువ్వులను పొడి చేసుకోవాలి. ఆపై చల్లారిన బీరకాయ పొట్టు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు జత చేసి మెత్తగా చేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి తాలింపు గింజలు, ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. ఈ పోపును చట్నీలో కలిపితే సరి. అంతే కారంకారంగా, రుచికరమైన బీరకాయ పొట్టు చట్నీ సిద్ధం. దీన్ని దోశలు, చపాతీలతోపాటు అన్నంలో కూడా కలిపి తినొచ్చు.

* సొరకాయ, క్యారెట్‌, కీరా తొక్కలతో కూడా ఇలా చేసుకోవచ్చు.


ఆరెంజ్‌ పీల్‌ టీ...

కావాల్సినవి... కమలాపండు తొక్కలు- రెండు, నీళ్లు- కప్పున్నర, దాల్చిన చెక్క- చిన్న ముక్క, లవంగాలు- మూడు, ఆకుపచ్చ ఇలాచీలు- రెండు, బెల్లం- చెంచా.

తయారీ: గిన్నెలో నీళ్లు పోసి మంటను మధ్యస్థంగా పెట్టి వేడి చేయాలి. దీంట్లో బెల్లం తప్ప కమలాపండు తొక్కలతోపాటు ఇతర దినుసులన్నీ వేయాలి. రెండు మూడు నిమిషాలు బాగా మరిగించాలి. పొయ్యి కట్టేసి టీని కప్పులోకి వడగట్టుకోవాలి. ఇందులో బెల్లం కలిపితే వేడి వేడి ఆరెంజ్‌ పీల్‌ టీ రెడీ. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధకత పెరుగుతుంది. * తయారీ వేరేవిధంగా ఉన్నా యాపిల్‌ తొక్కలతోనూ టీ చేసుకోవచ్చు.


లాభాలు...

కొన్ని కూరగాయలు, పండ్ల తొక్కల్లో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి.

ఇన్ని పోషక విలువలున్న ఈ తొక్కలను వృథాగా పారేయకుండా వాటితో సూపులు, రైతా, పచ్చళ్లు, కూరలు, టీలు తయారుచేసుకోవచ్చు. ఈ తొక్కలను శుభ్రం చేసి ఫ్రిజ్‌లో భద్రపరిచి అవసరమైనప్పుడు వాడుకోచ్చు.

* క్యారెట్‌ పొట్టు, ఆలూ తొక్క, కొత్తిమీర, తోటకూర కాడలను బ్రోత్‌, స్టాక్‌లలో ఉపయోగించొచ్చు.

* యాపిల్‌, పొటాటో తొక్కతో చిప్స్‌ చేసుకోవచ్చు.

* యాపిల్‌ తొక్కతో జామ్‌లు, క్యాండీలు, టీలు, చిప్స్‌, తయారుచేయొచ్చు.


సొరకాయ పొట్టు వేపుడు...

కావాల్సినవి: సొరకాయ పొట్టు- కప్పు, ఉల్లిపాయలు- రెండు (చిన్న ముక్కలుగా), పచ్చిమిరపకాయల తరుగు- రెండు పెద్ద చెంచాలు, ఉప్పు- తగినంత, కరివేపాకు రెబ్బలు- రెండు, జీలకర్ర, ఆవాలు- అర చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, పసుపు- చిటికెడు, వేయించిన పల్లీలు- పావు కప్పు, నూనె- రెండు పెద్ద చెంచాలు.

తయారీ: పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టాలి. నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి, వేగాక పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఇవి లేత గోధుమ రంగులోకి మారిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు సొరకాయ పొట్టు, పసుపు, కరివేపాకును వేసి వేయించాలి. ఈ కూరను కలుపుతూనే ఉండాలి. పొట్టు మొత్తం పూర్తిగా వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. చివరగా ఉప్పు వేసి రుచి చూడాలి.

* బీరకాయ పొట్టుతో కూడా ఇలా చేసుకోవచ్చు.


క్యారెట్‌ పీల్‌ సాస్‌...

కావాల్సినవి: క్యారెట్‌ తొక్కలు- రెండు కప్పులు, వేయించిన వాల్‌నట్స్‌, చీజ్‌- పావు కప్పు చొప్పున, వెల్లుల్లి రెబ్బలు- రెండు, ఉప్పు, మిరియాల పొడి- చిటికెడు చొప్పున, ఆలివ్‌ నూనె- పావుకప్పు.

తయారీ: పైన చెప్పిన పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి కాస్త బరకగా బ్లెండ్‌ చేసుకోవాలి. ఆలివ్‌నూనె పోసి మరోసారి బ్లెండ్‌ చేసి మెత్తగా చేసుకోవాలి. ఈ సాస్‌ను శాండ్‌విచ్‌లపై రాసుకోవచ్చు. పాస్తా తయారీలోను వాడుకోవచ్చు.


వాటర్‌మెలన్‌ రిండ్‌ దోశ...

కావాల్సినవి: పుచ్చకాయ తొక్కల తరుగు- అర కప్పు, బియ్యప్పిండి, రవ్వ- పావు కప్పు చొప్పున, శనగపిండి- చెంచా, నీళ్లు- అర కప్పు, ఉప్పు, నూనె- తగినంత.

తయారీ: నూనె తప్ప పై పదార్థాలన్నింటినీ మిక్సీజార్‌లో వేసి మెత్తగా అయ్యేలా చేయాలి. కావాలనుకుంటే మరిన్ని నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడిది దోశ పిండిలా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని ఓ ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి. పొయ్యి మీద పెనం పెట్టి వేడయ్యాక నూనె రాసి ఈ పిండితో దోశలను వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. కొబ్బరి చట్నీతో తింటే బాగుంటాయి.


యాపిల్‌ పీల్‌ చిప్స్‌...

కావాల్సినవి: యాపిల్‌ తొక్కలు- కప్పు, చక్కెర- మూడు చెంచాలు, దాల్చిన చెక్క పొడి- చెంచా.

తయారీ: బేకింగ్‌ ట్రేలో పర్చ్‌మెంట్‌ కాగితం వేసి దానిపై యాపిల్‌ తొక్కలను పరవాలి. దీనిపై చక్కెర, దాల్చిన చెక్క పొడి మిశ్రమం వేసి తొక్కలన్నింటికీ బాగా పట్టేలా కలపాలి. అవెన్‌ను 150 డిగ్రీల సెల్సియస్‌లో ప్రీహీట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత తొక్కలను ట్రే మొత్తం పరిచి అవెన్‌లో అదే ఉష్ణోగ్రత వద్ద అరగంట బేక్‌ చేయాలి. అంతే యమ్మీ యమ్మీ యాపిల్‌ పీల్‌ చిప్స్‌ రెడీ.

* క్యారెట్‌, చిలగడ దుంప, ఆలూ, కమలాపండు తొక్కలతోనూ చిప్స్‌ చేసుకోవచ్చు... అయితే తయారీ విధానం దీంతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది.


కీరా తొక్కల రైతా...

కావాల్సినవి: పెరుగు- పెద్ద కప్పు, కీరా తొక్కలు- అయిదారు, కొత్తిమీర తరుగు- రెండు పెద్ద చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు- రెండు, పచ్చిమిర్చి- నాలుగు, ఉప్పు- తగినంత.

తయారీ: చిన్న మిక్సీ జార్‌లో కీరా తొక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, రెండు చెంచాల పెరుగు, చిటికెడు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం పెరుగులో వేసి ఉప్పు, కొత్తిమీర జత చేసి బాగా కలపాలి. టేస్టీ కీరా తొక్కల రైతా రెడీ.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని