పాల లడ్డూ.. వహ్వా

నోట్లో వేసుకోగానే కరిగిపోయే మోతీచూర్‌ లడ్డూ...చిక్కని పాలు, తియ్యని చక్కెర మిళితమైన మలై లడ్డూ...పోషకాలు దండిగా ఉండే రాగి, వాల్‌నట్‌ లడ్డూ...శనగపిండి, నెయ్యి కలిపి నోరూరించే బేసన్‌ లడ్డూ...బలాన్నీ, తక్షణ శక్తినిచ్చే  నువ్వుల లడ్డూ...ప్రయత్నించండి.

Updated : 06 Mar 2022 06:18 IST

నోట్లో వేసుకోగానే కరిగిపోయే మోతీచూర్‌ లడ్డూ...

చిక్కని పాలు, తియ్యని చక్కెర మిళితమైన మలై లడ్డూ...

పోషకాలు దండిగా ఉండే రాగి, వాల్‌నట్‌ లడ్డూ...

శనగపిండి, నెయ్యి కలిపి నోరూరించే బేసన్‌ లడ్డూ...

బలాన్నీ, తక్షణ శక్తినిచ్చే  నువ్వుల లడ్డూ... ప్రయత్నించండి.

రాగి, వాల్‌నట్‌తో..

కావాల్సినవి: వాల్‌నట్స్‌, బెల్లం తరుగు- ముప్పావు కప్పు చొప్పున; నెయ్యి- పెద్ద చెంచా, రాగి పిండి- ఒకటిన్నర కప్పులు, ఇలాచీ పొడి- అర చెంచా.

తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక చిన్నమంటపై రాగి పిండి వేసి వేయించాలి. మరో పొయ్యి మీద ఇంకొక పాన్‌ పెట్టి కొన్ని నీళ్లు పోసి, బెల్లం వేసి బాగా కలపాలి. లేత పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు వాల్‌నట్్సను వేరొక పాన్‌లో వేసి కాసేపు వేయించి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పెద్ద గిన్నెలో వాల్‌నట్స్‌ ముక్కలు, రాగిపిండి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తయారుచేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని పోసి బాగా కలపాలి. కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఈ పిండిని చేతిలోకి తీసుకుని లడ్డూల్లా చుట్టాలి.


మోతీచూర్‌ లడ్డూ..

కావాల్సినవి: శనగపిండి, చక్కెర- రెండు కప్పుల చొప్పున, ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌- పావు చెంచా, ఇలాచీ పొడి- చెంచా, నెయ్యి- పెద్ద చెంచా, బాదం, కాజు తరుగు- చెంచా చొప్పున, నూనె- సరిపడా, ఉప్పు- చిటికెడు.

తయారీ: గిన్నెలో శనగపిండి, ఉప్పు,ఫుడ్‌ కలర్‌ వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో పంచదార వేసి, నీళ్లు పోసి  చిన్న మంటపై తీగపాకం వచ్చేలా కలుపుతూ ఉండాలి. మరో పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. ఇప్పుడు చిల్లుల గరిటెలో పిండి పోసి నూనెలో బూందీలా వేస్తూ మంటను మధ్యస్థంగా పెట్టి   చక్కగా వేయించాలి. ఇలా తయారుచేసి పెట్టుకున్న బూందీ మిశ్రమాన్ని వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఇలాచీ పొడి, సన్నగా తరిగిన కాజు, బాదం పలుకులను వేసుకోవాలి. నెయ్యినీ జత చేయాలి. ఇప్పుడు వేడి వేడి పంచదార పాకాన్ని పోసి వేడి తగ్గకముందే చక్కగా కలిపి చేతులతో లడ్డూల్లా చేసుకోవాలి. అంతే తియ్యటి నోరూరించే మోతీచూర్‌ లడ్డూలు సిద్ధం.


మలై..

కావాల్సినవి: చిక్కటి పాలు- లీటరున్నర, నిమ్మరసం- మూడు పెద్ద చెంచాలు, చక్కెర- పావు కప్పు, యాలకుల పొడి- పావు చెంచా, నెయ్యి- తగినంత.

తయారీ: గిన్నెలో లీటరు పాలు పోసి చిన్న మంటపై వేడి చేయాలి. పొంగు వచ్చిన తర్వాత నిమ్మరసం వేయాలి. దీంతో పాలు విరిగిపోతాయి. వీటిని వడకట్టాలి. అదే సమయంలో ఓసారి చల్లటి నీళ్లను పెరుగు లాంటి మిశ్రమంపై పోయాలి. ఇలా చేస్తే పులుపుదనం ఏమైనా ఉంటే పోతుంది. ఈ మిశ్రమాన్ని నీళ్లంతా పోయేలా చేసి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్‌లో అర లీటరు పాలు పోసి వేడి చేయాలి. ఈ పాలను గరిటెతో తిప్పుతూ సగమయ్యే వరకు మరిగించాలి. కాసేపటికి పాలన్నీ చిక్కటి క్రీమ్‌లా మారతాయి. ఇందులో చక్కెర వేసి బాగా కలపాలి. యాలకుల పొడిని జత చేయాలి. ఇందాక పక్కన పెట్టుకున్న విరిగిన పాల మిశ్రమాన్ని వేసి నీరంతా పోయేలా బాగా కలపాలి. ఆ తర్వాత చల్లార్చాలి. ఇప్పుడు దీన్ని  చపాతీ పిండిలా కలపాలి. అర చేతులకు కాస్తంత నెయ్యి రాసుకుని చిన్నగా లడ్డూల్లా చేసుకోవాలి. బాదం, కాజు, కుంకుమ పూలరేకలతో అలంకరిస్తే సరి. తియ్యని మలై లడ్డూ తినడానికి సిద్ధమా..


బేసన్‌..


కావాల్సినవి: శనగపిండి- రెండు కప్పులు, నెయ్యి- అర కప్పు, చక్కెర- కప్పు, ఇలాచీ- నాలుగు, పుచ్చకాయ విత్తనాలు,  కాజు తరుగు- రెండు పెద్ద చెంచాల చొప్పున.

తయారీ: పొయ్యి మీద పెద్ద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక శనగపిండి వేసి చిన్న మంటపై మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. పిండికి నెయ్యి బాగా పట్టేసి చిన్న చిన్న రేణువుల్లా మారే వరకు కలుపుతూనే ఉండాలి. కావాలంటే మరో పెద్ద చెంచా నెయ్యి వేసుకోవచ్చు. దాదాపు పావుగంట, ఇరవై నిమిషాల తర్వాత పిండి నుంచి నెయ్యి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు పిండిని పెద్ద గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఖాళీ కడాయిలో పుచ్చకాయ విత్తనాలు, కాజు తరుగు వేసి చిన్న మంటపై అవి కరకరలాడే వరకు వేయించుకోవాలి. వీటిని శనగపిండిలో వేసుకోవాలి. మిక్సీలో చక్కెర, యాలకులు వేసి పొడి చేసుకోవాలి. శనగపిండి పూర్తిగా చల్లారకుండా కాస్త వేడిగా ఉన్నప్పుడే చక్కెర పొడి కలపాలి. మిశ్రమం మరీ వేడిగా ఉంటే చక్కర పొడి కలపొద్దు. ఇలా చేస్తే అది కరిగిపోయి మిశ్రమంతా మరీ పలుచగా మారిపోతుంది. ఇప్పుడు పిండిని తీసుకుని చిన్న  సైజులో లడ్డూల్లా చుట్టుకోవాలి. వీటిని గాలిచొరబడని డబ్బాలో వేసి పెడితే రెండు వారాలు తాజాగా ఉంటాయి.


కొబ్బరితో..

(కండెన్స్‌డ్‌ పాలతో)

కావాల్సినవి: కొబ్బరి తురుము- పావు కిలో, కండెన్స్‌డ్‌ మిల్క్‌- ముప్పావు కప్పు, నెయ్యి- పెద్ద చెంచా, ఇలాచీ పొడి- అర చెంచా, కాజు- గుప్పెడు.

తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి కాస్తంత నెయ్యి వేయాలి. దీంట్లో కాజు వేసి వేయించాలి. ఇవి లేత బంగారు రంగులోకి వచ్చాక తాజా కొబ్బరి తురుము వేసి చిన్న మంటపై రెండు, మూడు నిమిషాలు వేయించాలి. దీంట్లో కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి కలపాలి. (కండెన్స్‌డ్‌ మిల్క్‌ అందుబాటులో లేకపోతే పాలు, పంచదార రెండింటినీ కలిపి వాడుకోవచ్చు. ఈ వంటకం పూర్తి అయ్యే వరకు మంట చిన్నగానే ఉండాలి. పాలు కలిపాక కాసేపు వేయించి, యాలకుల పొడి వేసి మరికాసేపు కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి చేతులకు నెయ్యి రాసుకుని లడ్డూలను తయారు చేసుకోవాలి. ఈ కమ్మని కొబ్బరి లడ్డూను రుచి చూసేయండి మరి.
 


డ్రై ఫ్రూట్స్‌, నువ్వులతో..

కావాల్సినవి: నువ్వులు- రెండు కప్పులు, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, యాలకుల పొడి- అర చెంచా, బెల్లం పొడి- కప్పు, జీడిపప్పు పొడి- అర కప్పు, బాదం తురుము- పావు కప్పు.  

తయారీ: పాన్‌లో నువ్వులు వేసి చిన్న మంటపై వేయించాలి. లేదంటే మాడిపోతాయి. చక్కగా వేగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మళ్లీ పొయ్యి మీద అదే పాన్‌ పెట్టి నెయ్యి వేసి బాదం ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ పాన్‌లోనే బెల్లం, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి తీగపాకం వచ్చేలా చేసుకోవాలి. దీంట్లో వేయించి పెట్టుకున్న నువ్వులు, బాదం ముక్కలు, జీడిపప్పు పొడి వేసి బాగా కలపాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత అర చేతికి కాస్త నెయ్యి రాసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఈ రుచికరమైన డ్రైఫ్రూట్స్‌ నువ్వుల లడ్డూను ఓ పట్టు పట్టేదామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని