టిక్కా... కుదిరిందా!

ఆదివారం.. ఇంట్లో అందరూ ఉండే టైమ్‌లో.. సాయంకాలం చిన్నారుల చిట్టి బొజ్జ నింపడానికి.. రకరకాల స్నాక్స్‌ అందివ్వొచ్చు. మురుకులు, చెగోడీలు, అప్పాలు.. ఎప్పుడూ ఇవేనా అనే చిచ్చర పిడుగులకు టేస్టీ టేస్టీ.. వెరైటీ టిక్కాలను చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. ..

Updated : 17 Apr 2022 05:56 IST

ఆదివారం.. ఇంట్లో అందరూ ఉండే టైమ్‌లో.. సాయంకాలం చిన్నారుల చిట్టి బొజ్జ నింపడానికి.. రకరకాల స్నాక్స్‌ అందివ్వొచ్చు. మురుకులు, చెగోడీలు, అప్పాలు.. ఎప్పుడూ ఇవేనా అనే చిచ్చర పిడుగులకు టేస్టీ టేస్టీ.. వెరైటీ టిక్కాలను చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. 

పనీర్‌తో..

కావాల్సినవి: పనీర్‌- 200 గ్రా., పెరుగు- 400 గ్రా., పసుపు- అర చెంచా, కారం- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద, జీలకర్ర పొడి, ధనియాల పొడి- చెంచాన్నర చొప్పున, గరంమసాలా, చాట్‌ మసాలా- చెంచా చొప్పున; నిమ్మకాయ- ఒకటి (రసం తీసి పెట్టుకోవాలి), కసూరీ మేథీ- చెంచా, శనగపిండి- రెండు చెంచాలు (ఇష్టమైతే), కార్న్‌ఫ్లోర్‌- చెంచా, క్యాప్సికమ్‌ (పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో)- కొన్ని ముక్కలు (పెద్దగా), ఉల్లిపాయ- ఒకటి (పెద్ద ముక్కలుగా), నూనె- తగినంత. 

తయారీ: పెద్ద గిన్నెలో పెరుగు, కారం, పసుపు, మిరియాల పొడి తగినంత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా, చాట్‌ మసాలా, అల్లంవెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, కసూరీ మేథీ వేసి కలపాలి. ఆ తర్వాత పదార్థాలు కలిసిపోయేలా బాగా గిలక్కొట్టాలి. దాంతో చిక్కటి క్రీమ్‌లా తయారవుతుంది. కావాలనుకుంటే శనగ పిండి కలపొచ్చు. కార్న్‌ఫ్లోర్‌నూ జత చేయాలి. 

బెల్‌పెప్పర్‌లను విత్తనాలను తీసేసి పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలను కూడా. పెద్ద పాత్రలో కూరగాయ ముక్కలతోపాటు పన్నీర్‌ ముక్కలనూ జత చేయాలి. వీటిపై మారినేట్‌ చేసిన ద్రవం పోసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ మూడు గంటలు నాననివ్వాలి. ఆ తర్వాత పనీర్‌, క్యాప్సికమ్స్‌, ఉల్లిపాయ ముక్కలను స్టిక్‌కు గుచ్చాలి. పొయ్యి మీద గ్రిల్‌ పాన్‌ పెట్టి నూనె రాసి పనీర్‌ గుచ్చిన పుల్లలను పెట్టాలి. రెండు నిమిషాలు మూత పెడితే చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు మరో వైపు తిప్పాలి. అవసరమైతే కాస్త నూనె రాయొచ్చు. అన్ని వైపులా చక్కగా కాలే వరకు తిప్పుతూ ఉండాలి. గ్రిల్‌ పాన్‌ లేనివారు సాధారణ పాన్‌ పై కూడా చేసుకోవచ్చు. చివరగా చక్కగా వేగిన పనీర్‌ టిక్కాలను ఆమ్‌చూర్‌ చల్లి తింటే చాలా బాగుంటాయి. 


గోబీతో..

కావాల్సినవి: కాలీఫ్లవర్‌ ముక్కలు- 20, ఉప్పు- తగినంత, వేడినీళ్లు- మూడు కప్పులు. 

మారినేషన్‌ కోసం.. పెరుగు- అర కప్పు, కారం, కసూరీ మేథీ- చెంచా చొప్పున, పసుపు- పావు చెంచా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా- అర చెంచా చొప్పున; ఉప్పు- తగినంత, నిమ్మరసం, వేయించిన శనగపిండి- రెండు చెంచాల చొప్పున, నూనె- తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా.

తయారీ: పెద్ద గిన్నెలో కాలీఫ్లవర్‌ ముక్కలు, ఉప్పు, వేడినీళ్లు పోసి కలిపి అయిదు నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత నీళ్లని పారబోసి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో పెరుగు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా, కసూరీ మేథీ, ఉప్పు, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి ముద్ద, శనగపిండి... ఇలా అన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కాలీఫ్లవర్‌ ముక్కలు, కాస్తంత నూనెను చేర్చి బాగా కలియబెట్టాలి. ఈ పూర్తి మిశ్రమాన్ని అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి రెండు చెంచాల నూనె వేసుకోవాలి. అది కాగిన తర్వాత మారినేట్‌ చేసిన గోబీ మిశ్రమాన్ని పాన్‌లో సమంగా పరిచి మంటను మధ్యస్థంగా పెట్టి ముక్కలు పూర్తిగా ముదురు గోధుమ రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు వీటిని పొడవైన పుల్లలకు గుచ్చాలి. మరో పొయ్యి మీద గ్రిల్‌ పాన్‌ పెట్టి ఈ పుల్లలను దానిమీద పెట్టి కాస్తంత నూనె రాస్తూ అన్ని వైపులా వేగేలా చక్కగా వేయించాలి. 


మష్రూమ్‌తో..

కావాల్సినవి: పుట్టగొడుగులు- పది, ఉల్లిపాయ- సగం (పెద్ద ముక్కలుగా), ఆకుపచ్చ, ఎరుపు క్యాప్సికమ్‌- పావు ముక్క (పెద్ద ముక్కలుగా) చొప్పున, గడ్డపెరుగు- అర కప్పు, శనగపిండి- రెండు చెంచాలు, పసుపు, జీలకర్ర పొడి, వాము- పావు చెంచా చొప్పున; కారం- చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, గరంమసాలా, కసూరీ మేథీ- అర చెంచా చొప్పున; నిమ్మరసం- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, నూనె- అయిదు చెంచాలు, చాట్‌ మసాలా- చిటికెడు.

తయారీ: పుట్టగొడుగులు, కూరగాయ ముక్కలు, రోస్టింగ్‌ కోసం నూనె, చాట్‌ మసాలా తప్పించి మిగతా పదార్థాలన్నింటినీ పెద్ద పాత్రలో వేసి బాగా కలపాలి. చిక్కటి మిశ్రమం వచ్చేవరకు కలుపుతూ ఉండాలి. దీంట్లో పుట్టగొడుగులు, ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టాలి. మారినేషన్‌ పూర్తయిన తర్వాత పుట్టగొడుగులు, క్యాప్సికమ్‌, ఉల్లిపాయ ముక్కలను పుల్లలకు గుచ్చాలి. పొయ్యి మీద పాన్‌/గ్రిల్‌ పాన్‌ పెట్టి నూనె వేసి వీటిని వేయించాలి. టిక్కాపై నూనె వేస్తూ .అన్ని వైపులా దొర్లించాలి. మంటను మధ్యస్థంగా పెట్టి అన్నివైపులా బాగా కాలేలా చూడాలి. అయితే మాడకుండా జాగ్రత్త పడాలి. చివరగా చాట్‌ మసాలా చల్లితే మష్రూమ్‌ టిక్కా తినడానికి రెడీ. 


చికెన్‌ చీజ్‌తో..

కావాల్సినవి: చికెన్‌ బ్రెస్ట్‌- రెండు, మొజరెల్లా చీజ్‌- కప్పు, చీజ్‌ స్లైస్‌లు- రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము- రెండు చెంచాల చొప్పున; నూనె- తగినంత, నిమ్మరసం- పావు కప్పు, జాజికాయ పొడి- పావు చెంచా, జీలకర్ర- అర చెంచా, జాపత్రి- ఒకటి, యాలకులు- నాలుగు, శనగపిండి, పెరుగు- పావు కప్పు చొప్పున; సన్నగా కోసిన ఉల్లిపాయ- ఒకటి, ఉప్పు- సరిపడా, గరంమసాలా- పావు చెంచా, నల్లుప్పు- చిటికెడు. 

తయారీ: పలుచటి, వెడల్పాటి పెద్ద చికెన్‌ ముక్కలను కత్తి మొనదేలిన భాగం వైపు నుంచి కాకుండా మరోవైపు నుంచి మెల్లిగా బీట్‌ చేయాలి. ఈ ముక్కలను ప్లేట్‌లోకి తీసుకోవాలి. వీటికి రెండు వైపులా నిమ్మరసం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, నూనె వేసి రాసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టి అది వేడయ్యాక జాజికాయ, జీలకర్ర, జాపత్రి, యాలకులు వేసి వేయించి రోట్లో వేసి కాస్త ఉప్పు కలిపి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్లేట్‌లోకి తీసుకుని అందులో శనగపిండి, సన్నగా కోసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, కాస్తంత ఉప్పు, నల్లుప్పు, గరంమసాలా వేసి కలపాలి. కొద్దిగా నూనె పోసి మరోసారి బాగా కలపాలి. మారినేట్‌ చేసి పెట్టుకున్న చికెన్‌ ముక్కలకు ఈ మసాలా మిశ్రమాన్ని పట్టించి నాలుగు గంటలు మరోసారి మారినేట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ చికెన్‌ ముక్క మధ్యలో చీజ్‌ స్లైస్‌ పెట్టి గుండ్రంగా చుట్టి ప్లేట్‌లోకి తీసుకుని పైనుంచి మొజరెల్లా చీజ్‌ని తురిమి వేసుకోవాలి. దీన్ని బేకింగ్‌ ట్రేలో పెట్టి 180 డిగ్రీల్లో దాదాపు అరగంట బేక్‌ చేసుకోవాలి. (అవెన్‌ను ప్రీహీట్‌ చేసుకోవాలి). అంతే రుచికరమైన చికెన్‌ చీజ్‌ టిక్కా రెడీ. అవెన్‌ లేనివారు మందపాటి పాన్‌ను తీసుకుని నీళ్లు పోసి దాని మీద ప్లేట్‌లో చికెన్‌ ముక్కలు పెట్టి మూత బిగించి వేయించుకోవాలి. ఇలా చేస్తే అరగంట తర్వాత టేస్టీ చికెన్‌ టిక్కా రెడీ. 


ఫిష్‌తో..

కావాల్సినవి: పెద్ద సైజు చేప ముక్కలు- పావుకిలో, అల్లంవెల్లుల్లి రసం, కారం- చెంచా చొప్పున; ఉప్పు- తగినంత, నిమ్మరసం- రెండు చెంచాలు, అల్లంవెల్లుల్లి ముద్ద- అర చెంచా, వాము, పసుపు, మిరియాల పొడి- పావు చెంచా చొప్పున, శనగపిండి, పుదీనా తురుము- పెద్ద చెంచా చొప్పున, గడ్డ పెరుగు- రెండు పెద్ద చెంచాలు, పచ్చిమిర్చి- ఒకటి (విత్తనాలు తీసి సన్నగా తరగాలి), ఉల్లిపాయ- సగం ముక్క, ఎరుపు, ఆకుపచ్చ క్యాప్సికమ్‌లు- రెండు (పావు ముక్కల చొప్పున), ఆవ నూనె- మూడు చెంచాలు, కొత్తిమీర తురుము- కొద్దిగా.

ఫిష్‌ మసాలా కోసం.. ఆమ్‌చూర్‌- పెద్ద చెంచా, కారం- పావు చెంచా, ఇంగువ- చిటికెడు, వేయించిన జీలకర్ర పొడి, కసూరీ మేథీ- పావు చెంచా చొప్పున; మిరియాల పొడి- అర చెంచా, యాలకుల పొడి- రెండు చిటికెలు, 

తయారీ: గిన్నెలో చేప ముక్కలు, అల్లంవెల్లుల్లి రసం, తగినంత ఉప్పు, కాస్తంత నిమ్మరసం వేసి కలిపి పదిహేను నిమిషాలు నాననివ్వాలి. మరో గిన్నెలో ఆవ నూనె, ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, వాము, కారం, శనగపిండి వేసి కలపాలి. పెరుగును జత చేసి బాగా గిలక్కొట్టాలి. దీంట్లో పచ్చిమిర్చి, పుదీనా తురుము వేసుకోవాలి. చేప ముక్కలను వేసి మిశ్రమం ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. 

మరో గిన్నెలో పెద్దగా కోసిన ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, ఆవ నూనె వేసి బాగా కలపాలి. సన్నని ఇనుప చువ్వకు క్యాప్సికమ్‌, చేప ముక్క, ఉల్లిపాయ... ఇలా ఒకదాని తర్వాత మరొకటి గుచ్చాలి. పొయ్యి వెలిగించి గ్రిల్‌ పాన్‌ పెట్టి రెండు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. ఈ సమయంలో చేప మసాలా తయారు చేసుకోవాలి. ఆమ్‌చూర్‌, కారం, ఇంగువ, వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, యాలకుల పొడి, కొద్దిగా కసూరీ మేథీ వేసి బాగా కలపాలి. నూనె వేడయ్యాక తయారుచేసి పెట్టుకున్న చేప టిక్కాలను అన్ని వైపులా బాగా ఉడికేలా వేయించాలి. ఇలా తయారైన టిక్కాలను ప్లేట్‌లోకి తీసుకుని కాల్చిన బొగ్గుపై కాస్తంత నెయ్యి వేసి మూత పెట్టేయాలి. పొగంతా టిక్కాలకు పట్టుకుని భిన్నమైన రుచి వస్తుంది. వీటిని ప్లేట్‌లోకి తీసుకుని మసాలా పొడిలో దొర్లించిన ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుంటే చాలు. దీన్ని గ్రీన్‌ చట్నీతో తింటే చాలా బాగుంటుంది.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని