చుక్కనూనె లేకుండా చక్కని వంట!

ఆకాశాన్నంటిన నూనె ధరల్ని చూశాక... గృహిణులంతా నూనె లేని వంటకాలపై ఓ కన్నేస్తున్నారు. మీరూ ఆ జాబితాలో ఉన్నారా? అయితే కెలొరీలు తగ్గించి, పోషకాలని పెంచే ఈ వంటకాలని ఓసారి చదివేయండి..  

Updated : 15 May 2022 03:24 IST

ఆకాశాన్నంటిన నూనె ధరల్ని చూశాక... గృహిణులంతా నూనె లేని వంటకాలపై ఓ కన్నేస్తున్నారు. మీరూ ఆ జాబితాలో ఉన్నారా? అయితే కెలొరీలు తగ్గించి, పోషకాలని పెంచే ఈ వంటకాలని ఓసారి చదివేయండి..  

మూంగ్‌దాల్‌కి చాట్‌ 

కావాల్సినవి: పెసరపప్పు- అరకప్పు, క్యారట్‌ తురుము - అరకప్పు, దానిమ్మగింజలు- అరకప్పు, సన్నగా తరిగిన పచ్చిమామిడి ముక్కలు- పావుకప్పు, పుదీనా తురుము- రెండు చెంచాలు, కొత్తిమీర తురుము- రెండు చెంచాలు, సన్నగా తురిమిన పచ్చిమిర్చి- రెండు చెంచాలు, చాట్‌మసాలా- చెంచా, నిమ్మరసం- నాలుగు చెంచాలు

తయారీ: ముందుగా పెసరపప్పుని శుభ్రం చేసుకుని అరగంటపాటు నానబెట్టి ఉంచుకోవాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో కొద్దిగా ఉప్పు వేసి పెసరపప్పుని పొడిపొడిగా ఉండేలా ఉడికించుకోవాలి. తర్వాత పప్పుని వడకట్టుకుని దాంట్లో పైన చెప్పినవన్నీ కలుపుకొని చివరిగా నిమ్మరసం పిండుకుంటే మూంగ్‌దాల్‌ చాట్‌ సిద్ధం. 


వెజ్‌ మోమో 

కావాల్సినవి: గోధుమపిండి- అరకప్పు, సన్నగా తరిగిన క్యాబేజీ తురుము- పావుకప్పు, మొలకెత్తిన పెసలు- పావుకప్పు, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి పలుకులు- చెంచా, తరిగిన పచ్చిమిర్చి- అరచెంచా, పంచదార- చిటికెడు, ఉప్పు- తగినంత 

తయారీ: గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాత్రలో తక్కినవి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ స్టఫ్‌లోని పదార్థాలు ఎంత సన్నగా తరిగి పెట్టుకుంటే అంత మంచిది. త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని వాటిని చపాతీల్లా ఒత్తుకోవాలి. వీటిల్లో సిద్ధం చేసి పెట్టుకున్న కాయగూరల స్టఫ్‌ని ఉంచి ఒక్కోదాన్ని ఒక చిన్న మూటలా చుట్టుకోవాలి. లేదంటే మనం కజ్జికాయలు చేసే పద్ధతి తెలిసుంటే అలా చేసుకోవాలి. వీటిని ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరి మీద ఉడికించుకోవాలి. వీటిని ధనియాల చట్నీతోకానీ, అల్లం పచ్చడితో కానీ తింటే భలే రుచిగా ఉంటాయి. 


 పోషకాల పనియారం..

కావాల్సినవి: ఇడ్లీపిండి- మూడు కప్పులు, ఉల్లిపాయ ముక్కలు-అర కప్పు, కొబ్బరి తురుము- అరకప్పు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు- పావుకప్పు, ఉప్పు- తగినంత, పచ్చిమిర్చి- నాలుగు, బీన్స్‌ ముక్కలు- పావుకప్పు, కొత్తిమీర తురుము- చెంచాన్నర, కరివేపాకు- ఒక రెబ్బ

తయారీ: ఇడ్లీపిండిలో కాయగూర ముక్కలన్నింటిని వేసి బాగా కలుపుకోవాలి. మార్కెట్లో నాన్‌స్టిక్‌ పనియారం పాత్రలు దొరుకుతాయి. వీటిలో వేస్తే నూనెతో పని ఉండదు. అలాకాకుండా ఐరన్‌ పాత్ర ఉంటే దానిలో బ్రష్‌తో కొద్దిగా నూనె రాసుకోవచ్చు. రాయకపోయినా కూడా ఇవి బాగానే వస్తాయి. ఈ గుంటల్లో పిండిని మూడోవంతు వరకూ నింపుకొని పొయ్యిమీద ఉంచాలి. కాసేపటికి పనియారం గుంటల్లో వేసిన పిండి పైకి ఉబ్బుతుంది. టూత్‌పిక్‌తో గుచ్చి చూస్తే ఉడికిందీ లేనిదీ తెలుస్తుంది. వీటిని టమాటా పచ్చడితో తింటే రుచిగా ఉంటాయి. మంచి పోషకాహారం కూడా. 


దహీ చికెన్‌ 

కావాల్సినవి: చికెన్‌- అరకేజీ, గరంమసాలా- మూడుచెంచాలు, కారం- మూడు చెంచాలు, పచ్చిమిర్చి పేస్ట్‌- చెంచా, పెరుగు- మూడు కప్పులు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌- రెండు చెంచాలు, ఉప్పు- రుచికి తగినంత, ధనియాలపొడి- చెంచా, కసూరిమేథి- చెంచా, తరిగిన బీన్స్‌- పావుకప్పు, పసుపు కొద్దిగా.

తయారీ: పెరుగుని బాగా గిలక్కొట్టి పెట్టుకోవాలి. చికెన్‌ని బాగా శుభ్రం చేసుకుని... అందులో పెరుగు, రెండు చెంచాల గరంమసాలా, తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కసూరీమేథీ, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మారినేట్‌ చేసిన చికెన్‌ని గంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఒక రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టి ఉంచినా మంచిదే. తర్వాత ఈ మిశ్రమాన్ని సన్న సెగ మీద పెట్టి మాంసం ఉడికించేంతవరకూ ఉంచుకోవాలి. అప్పుడు చెంచా గరంమసాలా, బీన్స్‌ వేసి ఉడికించాలి. వేడిగా సర్వ్‌ చేసుకొంటే బాగుంటుంది.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని