చినుకుల్లో... హాయ్‌ హాయ్‌!

చిటపట చినుకులు పలకరిస్తుంటే... పంటికి పనిచెప్పాలని ఎవరికి మాత్రం ఉండదు? వేడివేడిగానే కాదు కాస్త వెరైటీగానూ ఉండే ఈ వంటకాలని ప్రయత్నించండి. ఇంటిల్లపాదీ ప్రశంసలు అందుకోండి..

Updated : 19 Jun 2022 06:40 IST

చిటపట చినుకులు పలకరిస్తుంటే... పంటికి పనిచెప్పాలని ఎవరికి మాత్రం ఉండదు? వేడివేడిగానే కాదు కాస్త వెరైటీగానూ ఉండే ఈ వంటకాలని ప్రయత్నించండి. ఇంటిల్లపాదీ ప్రశంసలు అందుకోండి..


పొటాటో బైట్స్‌

కావాల్సినవి: ఉడికించిన బంగాళాదుంపలు- నాలుగు, నూనె- తగినంత, ఉప్పు- తగినంత, సన్నగా తరిగిన వెల్లుల్లి పలుకులు- చెంచా, మొక్కజొన్న పిండి- రెండు చెంచాలు, చిల్లీఫ్లేక్స్‌- చెంచా, సన్నగా తరిగిన కొత్తిమీర- చెంచా

తయారీ: ఉడికించిన దుంపలని మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. ఇందులో మొక్కజొన్న పిండి, చిల్లీఫ్లేక్స్‌, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి పలుకులు వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. పిల్లలు ఇష్టంగా తింటారు.


కార్న్‌భేల్‌

కావాల్సినవి: ఉడికించిన మొక్కజొన్న గింజలు- రెండు కప్పులు, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, టొమాటో ముక్కలు- పావుకప్పు, దానిమ్మ గింజలు- పావుకప్పు, గ్రీన్‌చట్నీ- రెండు చెంచాలు, స్వీట్‌చట్నీ- పావుకప్పు, చాట్‌మసాలా- చెంచా, నిమ్మరసం- ఒకటిన్నర చెంచా, కారం- చెంచా, పచ్చిమామిడికాయ ముక్కలు- రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు- పావుకప్పు, చేత్తో చిదిమి పెట్టుకున్న అప్పడాలు- నాలుగు, సన్నకారప్పూస- పావుకప్పు

తయారీ: ముందుగా గ్రీన్‌చట్నీని తయారు చేసుకుందాం. దీనికోసం కప్పుచొప్పున పుదీనా, కొత్తిమీర తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, చెంచా పచ్చిమిర్చి, చెంచా అల్లం తురుము, తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుంటే గ్రీన్‌చట్నీ సిద్ధం. పుదీనా కొద్దిగా ఎక్కువ తీసుకుంటే రుచి బాగుంటుంది. స్వీట్‌ చట్నీ కోసం... ఒక వంతు కర్జూరాలకి, రెండు వంతుల బెల్లం, రెండు చెంచాల చింతపండు గుజ్జు, అరచెంచా కారం, కొద్దిగా జీలకర్ర తీసుకుని అన్నింటినీ కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. చివరిగా కారం కలుపుకొంటే స్వీట్‌ చట్నీ సిద్ధం. ఈ రెండూ సిద్ధమయ్యాక ఒక పాత్రలో కార్న్‌భేల్‌ కోసం పైన చెప్పినవన్నీ కలుపుకొని చివరగా కారప్పూస వేసి వడ్డిస్తే కార్న్‌భేల్‌ సిద్ధం.


టొమాటో స్లైస్‌ చాట్‌

కావాల్సినవి: టొమాటోలు- రెండు, సన్నగా తురుమిన క్యారెట్‌- రెండు చెంచాలు, ఉల్లిపాయముక్కలు- పావుకప్పు, కొత్తిమీర తురుము- రెండు చెంచాలు, మరమరాలు- కప్పు, సన్నకారప్పూస(సేవ్‌)- నాలుగు చెంచాలు, కారం- చెంచా, ఉప్పు- తగినంత, స్వీట్‌ చట్నీ- చెంచాన్నర, గ్రీన్‌చట్నీ- అరచెంచా

తయారీ: టొమాటోలని సన్నని స్లైసులుగా చేసి పెట్టుకోవాలి. వీటిపై కొద్దిగా ఉప్పు చల్లిపెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలో క్యారెట్‌ తురుము, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, కారం కలిపిన తర్వాత అందులో సేవ్‌, మరమరాలు కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చెంచాతో ఒక్కో టొమాటో స్లైసుపైనా కొద్ది, కొద్దిగా పెట్టి... వాటిపై స్వీట్‌చట్నీ, గ్రీన్‌చట్నీ కొద్దిగా వడ్డిస్తే టొమాటో స్లైస్‌ చాట్‌ సిద్ధం.


చుర్‌మురీ

కావాల్సినవి: మరమరాలు- మూడు కప్పులు, ఉల్లిపాయముక్కలు- రెండు చెంచాలు, టొమాటో ముక్కలు- రెండు చెంచాలు, పచ్చిమిర్చి ముక్కలు- చెంచా, కారం- పావుచెంచా, సన్నగా తరిగిన కొత్తిమీర- చెంచా, నిమ్మరసం- చెంచా, వేయించిన పల్లీలు- రెండు చెంచాలు, నూనె- చెంచా, చుర్‌మురీ మసాలా- చెంచా

తయారీ: మరమరాలు మెత్తగా ఉంటే... ఒక సారి వేయించి తీసుకుని చల్లార్చుకోవాలి. ముందుగా చుర్‌మురీ మసాలా, ఉల్లిపాయముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరమరాల్లో వేసి నూనె, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర, పల్లీలు వేసుకుంటే చుర్‌మురీ సిద్ధం.


పనీర్‌ పకోడి

కావాల్సినవి: ముక్కలుగా తరిగిన పనీర్‌- 200గ్రా, కారం- పావుచెంచా, చాట్‌మసాలా- అరచెంచా, గరంమసాలా- అరచెంచా, నూనె- వేయించడానికి తగినంత, సెనగపిండి- అరకప్పు, వరిపిండి- రెండు చెంచాలు, కారం- పావుచెంచా, ఉప్పు- తగినంత, వాము- పావుచెంచా, పచ్చిమిర్చి, అల్లంపేస్ట్‌- పావుచెంచా

తయారీ: కావాల్సిన సైజుల్లో పనీర్‌ముక్కలని కోసి పెట్టుకుని వీటిల్లో కారం, చాట్‌మసాలా, గరంమసాలా వేసుకుని కలుపుకోవాలి. మరొక పాత్రలో సెనగపిండి, బియ్యప్పిండి, కారం, వాము, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్‌, తగినన్ని నీళ్లు వేసి మరీ జారుగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని కడాయిలో పకోడీలు వేయించుకోవడానికి తగినంత నూనె పోసుకుని అందులో ఒక్కో పనీర్‌ ముక్కనీ సెనగపిండిలో ముంచి నూనెలో వేయాలి. బాగా వేగాక... పకోడీలపై చాట్‌మసాలా చల్లుకుంటే బాగుంటాయి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని