మంచి భోజనంలాంటి...స్మూథీలు!

కొందరు ఆకుకూరలంటేనే... ఆమడ దూరం ఉంటారు.. మరికొందరు పళ్లని తినాలని ఉన్నా బద్ధకిస్తారు.. ఇలాంటి వారికి స్మూథీలు చక్కని ప్రత్యామ్నాయం. పాలు, పెరుగు, పండ్లు, డ్రైనట్స్‌తో చేసే స్మూథీలు ఒక మంచి భోజనంతో సమానమైన పోషకాలనిస్తాయ్‌! 

Updated : 26 Jun 2022 10:33 IST

కొందరు ఆకుకూరలంటేనే... ఆమడ దూరం ఉంటారు.. మరికొందరు పళ్లని తినాలని ఉన్నా బద్ధకిస్తారు.. ఇలాంటి వారికి స్మూథీలు చక్కని ప్రత్యామ్నాయం. పాలు, పెరుగు, పండ్లు, డ్రైనట్స్‌తో చేసే స్మూథీలు ఒక మంచి భోజనంతో సమానమైన పోషకాలనిస్తాయ్‌! 


దానిమ్మతో..

కావాల్సినవి: దానిమ్మగింజలు- కప్పు, పైనాపిల్‌ ముక్కలు- అరకప్పు, అరటిపండు- ఒకటి, తాజా యోగర్ట్‌ (పెరుగు)- ముప్పావు కప్పు, తేనె- చెంచా

తయారీ: బ్లెండర్‌లో ముందుగా దానిమ్మ గింజలు వేసుకుని బాగా బ్లెండ్‌ చేసిన తర్వాత అప్పుడు మిగిలినవి కూడా వేసుకుంటే స్మూథీ చక్కగా వస్తుంది. చల్లగా కావాలనుకొనే వారు అరటిపండు, పెరుగుని ఫ్రీజర్‌లో ఉంచి తీసుకోవాలి. ఇలా చేస్తే స్మూథీ కూడా చిక్కగా, పొంగినట్టుగా వస్తుంది. 


పైనాపిల్‌తో...

కావాల్సినవి: చెక్కుతీసి చిన్న ముక్కలుగా చేసిన పైనాపిల్‌- 200గ్రా, పుదీనా ఆకులు- రెండు చెంచాలు, పాలకూర- రెండు గుప్పిళ్లు, ఓట్స్‌- మూడు చెంచాలు, జీడిపప్పులు- పది, అవిసె గింజలు- రెండు చెంచాలు, నిమ్మరసం- రుచికి తగినంత 

తయారీ: వీటన్నింటినీ బ్లెండర్‌లో వేసి మెత్తని స్మూథీగా చేసుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కలిపి తాగడానికి వీలుగా చేసుకోవచ్చు. మీకు చల్లగా తాగడం ఇష్టమైతే పైన చెప్పిన వాటిని అన్నింటిని ఒక జిప్‌లాక్‌ బ్యాగులో వేసుకుని అన్నింటినీ ఫ్రిజ్‌లోకానీ డీప్‌ఫ్రిజ్‌లో కానీ కాసేపు ఉంచి తీస్తే చిక్కని, చల్లని స్మూథీ సిద్ధమవుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ స్మూథీని ఉదయం పూట తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు.


రెయినీడే స్మూథీ 

కావాల్సినవి: మామిడిపండు- ఒకటి, అరటిపండు ఒకటి, తాజా పెరుగు-కప్పు, కమలారసం- కప్పు

తయారీ: అన్నింటిని కలిపి బ్లెండ్‌ చేసుకుంటే వర్షాకాలంలో వ్యాధినిరోధకశక్తిని పెంచే స్మూథీ రెడీ!


అరటిపండుతో..

కావాల్సినవి: అరటిపండ్లు- రెండు, తేనె- పావుకప్పు, పులుపెక్కని తాజా పెరుగు- కప్పున్నర, వెనిల్లా ఎక్‌స్ట్రాక్ట్‌- అరచెంచా (తప్పనిసరి కాదు)

తయారీ: చల్లగా కావాలనుకుంటే.. కాసిని ఐస్‌ముక్కలు, పైన చెప్పిన అన్నింటినీ వేసుకుని బ్లెండ్‌ చేసుకోవాలి. లేదంటే అరటిపండ్లని ప్రీజర్‌లో ఉంచి తీసుకున్నా... స్మూథీ చిక్కగా ఉంటుంది. రుచిగానూ ఉంటుంది.


స్ట్రాబెర్రీ స్మూథీ

కావాల్సినవి: స్ట్రాబెర్రీలు- ఎనిమిది, తాజా పెరుగు- కప్పు, పాలు- అరకప్పు, పీనట్‌బటర్‌- పావుకప్పు, తేనె- చెంచా

తయారీ: అన్నింటినీ కలిపి బ్లెండ్‌ చేస్తే రుచికరమైన స్ట్రాబెర్రీ స్మూథీ సిద్ధం. విటమిన్‌ సితో పాటు యాంటీఆక్సిడెంట్లు, పీచుని పుష్కలంగా అందిస్తుంది. బరువు తక్కువగా ఉన్నవారు ప్రయత్నిస్తే మంచిది.


లాభాలివి

పండ్లు, కాయగూరల్లో ఉండే పోషకాలని స్మూథీల రూపంలో తేలిగ్గా తీసుకుంటాం. శరీరానికి కావాల్సిన పీచు అంది జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.

* భోజనానికి మించి... కొవ్వులు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు ఏకకాలంలో అందించే సంపూర్ణ పోషకాహారం.

*  ఉదయం లేదా సాయంత్రం తీసుకుంటే కడుపు నిండిన భావన కలిగి... అనవసరమైన చిరుతిళ్లపైకి మనసు మళ్లకుండా ఉంటుంది.

*  ఇవి డీహైడ్రేషన్‌ సమస్య రాకుండా శరీరంలో కావాల్సినంత నీటినిల్వలు ఉంచుతాయి. 


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని