సీతాఫలహారం

పోషకాలకు నిలయం.. రుచులకు ఆలయం.. సీతాఫలం. ఒక్కో కన్నూ తీసుకుని... ఒక్కో గింజా చప్పరిస్తూ ఉంటే... ఆహా అదిరిపోయే రుచి. ఈ రుచికి పాలు, కోవా, పిస్తా తోడయితే..?ఈ సీజన్‌లో పలకరించే సీతాఫలాలతో...

Updated : 29 Dec 2018 11:04 IST

పోషకాలకు నిలయం.. రుచులకు ఆలయం.. సీతాఫలం. ఒక్కో కన్నూ తీసుకుని... ఒక్కో గింజా చప్పరిస్తూ ఉంటే... ఆహా అదిరిపోయే రుచి. ఈ రుచికి పాలు, కోవా, పిస్తా తోడయితే..?ఈ సీజన్‌లో పలకరించే సీతాఫలాలతో వివిధ రుచులు వండివారుద్దాం..

సీతాఫలహారం

చిట్కా: సీతాఫలం గుజ్జుతో ఫిర్నీ, కేకులు, హల్వా వంటివి కూడా చేసుకోవచ్చు. కానీ గింజలు వేరుచేయడం గుజ్జు తీయడమే కష్టం అంటారా? ఓ చిన్న చిట్కా పాటిస్తే అది కూడా తేలికే. సీతాఫలాన్ని మధ్యలోకి విడదీసిన తర్వాత చెంచాతో గుజ్జును గింజలతో సహా తీసి పెట్టుకోవాలి. దాన్నో స్టీల్‌ జల్లెడలో వేసి చెంచాతో మెదిపితే గింజలు వేరవుతాయి. లేదంటే గుజ్జులో కాసిని పాలుకలిపి మిక్సీలో వేసి రెండేరెండు సెకన్లు తిప్పితే గింజలు, గుజ్జు తేలిగ్గా వేరవుతాయి.

* దీనిలోని విటమిన్లు జుట్టు కుదుళ్లని బలంగా ఉంచి శిరోజాలు ఆరోగ్యంగా ఎదగడానికి, చుండ్రుని దూరంగా ఉంచడానికీ, వెంట్రుకలు త్వరగా నెరిసిపోకుండా ఉండటానికి సహకరిస్తాయి. 
* గర్భస్థ శిశువు జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. పాల ఉత్పత్తులు పడని గర్భిణులు సీతాఫలాన్ని తీసుకోవచ్చు.

కలాకండ్‌..

సీతాఫలహారం

కావాల్సినవి: పాలు- రెండు లీటర్లు, నిమ్మరసం- రెండు చెంచాలు, పంచదార- నాలుగు చెంచాలు, యాలకులపొడి- అరచెంచా, సీతాఫలం గుజ్జు- రెండు చెంచాలు, నెయ్యి- అరకప్పు, పిస్తాపప్పు- రెండు చెంచాలు, బాదంపప్పులు- ఆరు(సన్నగా తురమాలి)

తయారీ: పాలని రెండు పాత్రల్లోకి సగంసగం తీసుకోవాలి. ఒక పాత్రలో పాలకి నిమ్మరసం కలిపి విరిగేట్టు చేయాలి. మరో పాత్రలో పాలని సగం అయ్యేంత వరకూ మరిగించుకోవాలి. విరిగిన పాలను ఒక వస్త్రంలో వడకట్టి నీళ్లు పోయేటట్టుగా పిండేయాలి. ఈ పనీర్‌ని మరొక్కసారి మంచినీళ్లు పోసి పిండితే నిమ్మరసం తాలూకు పులుపు పోతుంది. ఆ పనీర్‌ని మరో పాత్రలో మరుగుతున్న పాలల్లో వేయాలి. ఈ మిశ్రమంలో పంచదార వేసి బాగా కలిసిన తర్వాత అందులో సీతాఫలం గుజ్జు, యాలకుల పొడి వేసి దగ్గరగా వచ్చిన తర్వాత చివరిగా నెయ్యి వేసి దింపుకోవాలి. ఒక పాత్రకు అడుగున నెయ్యిరాసి అందులో ఈ మిశ్రమం వేసి పైన పిస్తాపప్పులతో అలంకరించుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయిన తర్వాత చాకుతో ముక్కలుగా కోసి వడ్డించుకోవాలి.

బాసుంది

సీతాఫలహారం

కావాల్సినవి: సీతాఫలాలు- నాలుగు(గుజ్జు తీసి పెట్టుకోవాలి), పాలు- లీటరున్నర, మిల్క్‌మెయిడ్‌- అరకప్పు, యాలకులపొడి- పావుచెంచా, సన్నగా తరిగిన బాదం పలుకులు- రెండు చెంచాలు

తయారీ: అడుగు మందంగా ఉన్న పాత్రలో పాలను వేసి దగ్గరగా వచ్చేంతవరకూ మరిగించుకోవాలి. ఇందులో మిల్క్‌మెయిడ్‌, యాలకులపొడి వేసి మరిగించుకోవాలి. దీనిలో సీతాఫలం గుజ్జు వేసి రెండునిమిషాలు ఆగి బాదం పలుకులు వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లబడిన తర్వాత వడ్డించుకోవడమే.

కుల్ఫీ

సీతాఫలహారం

కావాల్సినవి: హోల్‌మిల్క్‌- పావులీటరు, లైట్‌క్రీం- పావులీటరు, సీతాఫలాలు-మూడు(గుజ్జుతీసి పెట్టుకోవాలి), మిల్క్‌మెయిడ్‌- 100ఎం.ఎల్‌, నల్లనువ్వులు- చెంచా లేదంటే నానబెట్టి తరిగిన బాదం, జీడిపప్పు పలుకులు- చెంచాన్నర

తయారీ: ఒక పాత్రలో పాలు, లైట్‌క్రీం వేసి మరిగించుకుని సగానికిసగం అయ్యేట్టుగా మరిగించుకోవాలి. పాలు బాగా దగ్గరకు వచ్చిన తర్వాత దీనికి మిల్క్‌మెయిడ్‌ కూడా కలిపి రెండు నిమిషాలు ఉంచి మిశ్రమాన్ని పొయ్యిమీద నుంచి దింపుకోవాలి. చల్లారిన తర్వాత దీనిలో సీతాఫలం గుజ్జు, నానబెట్టి సన్నగా తరిగిన బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు, పిస్తాపలుకులు వేసుకోవచ్చు. లేదంటే వేయించిన నల్లనువ్వులు కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా కలిపి కుల్ఫీ మూసల్లో వేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. పిల్లలు ఇష్టంగా తింటారు.

మస్తానీ

సీతాఫలహారం

కావాల్సినవి: గుజ్జు- కప్పు, హోల్‌మిల్క్‌పాలు చల్లనివి- లీటరు, పంచదార పొడి- అరకప్పు, వెనిల్లా ఐస్‌క్రీం- అరకప్పు

తయారీ: పాలు, పంచదార కలిపి బాగా నురగ వచ్చేంతవరకూ గిలక్కొట్టాలి. దీనికి సీతాఫలం గుజ్జు, వెనిల్లా ఐస్‌క్రీం కూడా కలిపి గరిటెతోకానీ, బ్లెండర్‌లో వేసికానీ మళ్లీ గిలక్కొట్టాలి. దీనిపై కొద్దిగా సీతాఫలం గుజ్జు వేసి వడ్డిస్తే ఆ రుచి బ్రహ్మాండంగా ఉంటుంది.

సీతాఫలహారం

గింజలు తీసుకుని తినడమే కష్టం... ఇక వంటకాలా.. అని సందేహ పడేవారికి ఆన్‌లైన్‌లో రెడీమేడ్‌గా గుజ్జు, పొడి దొరుకుతున్నాయి. క్షణాల్లో నచ్చిన రుచులని చేసుకుని ఆస్వాదించుకోవచ్చు.

జెల్లీ

సీతాఫలహారం

కావాల్సినవి: సీతాఫలాలు- మూడు, పంచదార- నాలుగుచెంచాలు, జెలాటిన్‌- మూడుచెంచాలు, నిమ్మఉప్పు- అరచెంచా

తయారీ: ముందుగా పావులీటర్‌ నీళ్లని ఒక పాత్రలో మరిగించుకోవాలి. అందులో సీతాఫలం గుజ్జు గింజలతోపాటు వేసి రెండు నిమిషాలు మరిగిన తర్వాత పంచదార, జెలాటిన్‌ కూడా వేసి మరగనివ్వాలి. చివరిగా నిమ్మఉప్పు వేసి వడకట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెల్లో పోసుకుని చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచితే పిల్లలకిష్టమైన జెల్లీలు రెడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని