కలిపి కొడితే...రసకందాయమ్‌!

కాంబినేషన్‌ బాగుంటే అద్దిరిపోతుంది. ఈ సూత్రం జీవితానికి, సినిమాలకు, ఫ్యాషన్‌కు మాత్రమే కాదు.. పాక శాస్త్రానికీ అన్వయం అవుతుంది. మెంతికూర-టమాట-ఆలుగడ్డ, గంగవాయిల్‌కూర-మామిడికాయ.. ఇలా రెండు, మూడు కాయగూరలు జతకలిస్తే.. లొట్ట లేసుకుంటూ తినాల్సిందే! ఇదే ఫార్ములాని పండ్లరసాలకు వర్తింపజేసి..

Published : 21 Apr 2019 00:16 IST

కాంబినేషన్‌ బాగుంటే అద్దిరిపోతుంది. ఈ సూత్రం జీవితానికి, సినిమాలకు, ఫ్యాషన్‌కు మాత్రమే కాదు.. పాక శాస్త్రానికీ అన్వయం అవుతుంది. మెంతికూర-టమాట-ఆలుగడ్డ, గంగవాయిల్‌కూర-మామిడికాయ.. ఇలా రెండు, మూడు కాయగూరలు జతకలిస్తే.. లొట్ట లేసుకుంటూ తినాల్సిందే! ఇదే ఫార్ములాని పండ్లరసాలకు వర్తింపజేసి.. మాక్‌టెయిల్స్‌గా మార్చుకుని కొత్త కిక్కును ఆస్వాదించేద్దాం. ఫ్రూట్‌జ్యూస్‌లను తెగ తిప్పేసి.. ఒకదాంట్లో ఒకటి ఒంపేస్తే.. అదే మాక్‌టెయిల్‌. కాసింత శ్రమకే నీరసం ఆవహించే వేసవిలో శరీరానికి సత్వర ఉపశమనం అందించే మిశ్రమ రసాలివి. కలిపి కొట్టేయండి మరి!


కీరదోసతో...

కావాల్సినవి: సోడా- పావుకప్పు, చెక్కుతీసి సన్నగా చక్రాల్లా తరిగిన కీరదోస ముక్కలు- నాలుగు(మాక్‌టెయిల్‌ షేకర్‌లో వేసి ఈ కీరదోసముక్కలని నలగ్గొట్టాలి.) నిమ్మరసం- రెండు పెద్దచెంచాలు, పంచదార పాకం- రెండు పెద్దచెంచాలు, చెక్కుతో సహా తరిగిన దోసకాయ చక్రాలు- ఆరు, చితక్కొట్టిన ఐస్‌- నాలుగు చెంచాలు
తయారీ: సోడాతో సహా పైన చెప్పిన అన్నింటినీ మాక్‌టెయిల్‌ షేకర్‌లో వేసి బాగా షేక్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి ఐస్‌పొడి, కీరదోసముక్కలను వేసుకుంటే కీరా గిమ్లెట్‌ రెడీ.


వేసవి అంటే జ్యూస్‌లు, మజ్జిగలేనా అని నిరాశపడే వారికి మాక్‌టెయిల్స్‌ చక్కని కిక్‌ ఇస్తాయి. వీటిని చేసుకోవడానికి సోడా, నిమ్మరసం ప్రధాన వస్తువులు. వీటికితోడు... కాస్త  పులుపు, కాస్త తీపితోపాటు, పుదీనావంటి హెర్బల్స్‌ రుచి కూడా కలిస్తే మాక్‌టెయిల్స్‌లోని మజాని పూర్తిగా అనుభవించవచ్చు.


అనాసతో...

కావాల్సినవి: స్ట్రాబెర్రీ జ్యూస్‌- రెండు పెద్దచెంచాలు, నిమ్మరసం- పెద్దచెంచా ఒకటి, పైనాపిల్‌ జ్యూస్‌- అరకప్పు, సోడా- తగినంత
తయారీ: మాక్‌టెయిల్‌ షేకర్‌ లేదా టిన్‌లో నిమ్మరసం, పైనాపిల్‌రసం వేసి బాగా కలుపుకోవాలి. పొడవాటి గ్లాసులో మొదట ఈ నిమ్మరసం, పైనాపిల్‌ రసం వేసి ఆపై ఐస్‌క్యూబ్స్‌ వేసి సోడాని తగినంత వేసుకోవాలి. చివరి లేయర్‌గా స్టాబెర్రీజ్యూస్‌ వేసుకుంటే పైనాపిల్‌ కాబ్లర్‌ రెడీ.


ఆన్‌లైన్‌లో సులభంగా వాడుకునే స్టెయిన్‌లెస్‌స్టీల్‌ మాక్‌టెయిల్‌ షేకర్లతోపాటు నయారకం షేకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. జ్యూస్‌లని కచ్చితంగా కొలుచుకోవడానికి వీలుగా గ్లాసులు, ఐస్‌ని కలుపుకోవడానికి, వాడుకోవడానికి ఉపయోగపడే టాంగ్స్‌ వంటివన్నీ ఈ కిట్‌లో ఉంటాయి.


అనాస, అల్లంతో...

కావాల్సినవి: నిమ్మరసం- రెండు పెద్దచెంచాలు, పైనాపిల్‌ జ్యూస్‌(చిక్కనిది)- పెద్దచెంచా, అల్లంరసం- ఒక చెంచా, సన్నగా తరిగిన నిమ్మచెక్క- ఒకటి, క్రిస్టలైజ్డ్‌ జింజర్‌- మూడు (పంచదారపాకంలో ఊరబెట్టి ఎండబెట్టిన అల్లం ముక్కలు)
తయారీ: మాక్‌టెయిల్‌ మేకర్‌లో నిమ్మరసం, పైనాపిల్‌, అల్లం రసాలను వేసి, ఐస్‌ జతచేసి బాగా షేక్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని సన్నగా పొడవుగా ఉండే గాజు గ్లాసులో వేసి ఐస్‌ముక్కలతో గ్లాసుని నింపాలి. చివరిగా అల్లంచిప్స్‌, నిమ్మచెక్క వేస్తే పైనాపిల్‌, జింజర్‌ మాక్‌టెయిల్‌ సిద్ధం.
* పండిన పైనాపిల్‌తో చేసిన రసం అయితే రుచి, పరిమళం బాగుంటాయి.



మాక్‌టెయిల్స్‌ తయారీలో సింపుల్‌ సిరప్‌ని ఎక్కువగా వాడుతుంటారు.  దీన్ని ముందే చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక కప్పు పంచదారకి, ఒక కప్పు నీళ్లు పాన్‌లో వేసి మరిగించి పాకం తీసుకుంటే అదే సింపుల్‌ సిరప్‌.


దోసకాయతో....


కావాల్సినవి: పండిన క్యాంటలూప్‌(దోసకాయ)- ఒకటి, తాజా ఆరెంజ్‌జ్యూస్‌- అరకప్పు, నిమ్మరసం- పావుకప్పు, పుదీనా తరుగు- పావుకప్పు, ఐస్‌- రెండు కప్పులు, పుదీనా ఆకులు- అలంకరణ కోసం కొన్ని
తయారీ: గింజలు, చెక్కుతీసేసి దోసకాయ ముక్కలని డీప్‌ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచాలి. మాక్‌టెయిల్‌ చేసుకోవడానికి ముందు దోసకాయముక్కలు తీసుకోవాలి. బ్లెండర్‌లో దోసకాయముక్కలు, ఆరెంజ్‌జ్యూస్‌, నిమ్మకాయరసం, పుదీనా, ఐస్‌ముక్కలు వేసి మిక్సీపట్టాలి. గ్లాసుల్లో వేసుకున్న తర్వాత నిమ్మచెక్కలు, పుదీనాఆకులతో అలంకరించుకోవాలి.


కొబ్బరి, పుదీనాతో..

కావాల్సినవి: కొబ్బరినీళ్లు- నాలుగుకప్పులు, సన్నగా తరిగిన కీరదోసముక్కలు- నాలుగు, నిమ్మరసం- పావుకప్పు, పంచదార- పావుకప్పు, పుదీనాఆకుల తరుగు- పావుకప్పు
తయారీ: కొబ్బరినీళ్లు, కీరదోసముక్కలు, నిమ్మరసం, పంచదార, పుదీనా ఆకుల తరుగు మాక్‌టెయిల్‌ షేకర్‌లో వేసి బాగా గిలక్కొట్టాలి. రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచి అప్పుడు తాగాలి.



మాక్‌టెయిల్స్‌ చేసుకోవడానికి కావాల్సిన బ్లూలగూన్‌, పీచ్‌ సిరప్‌ వంటివి మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిని తెచ్చుకుని సిద్ధంగా ఉంచుకుంటే చకచకా మాక్‌టెయిల్స్‌ చేసుకోవచ్చు. ఆ సమయం కూడా లేదనుకుంటే ఈ మధ్యకాలంలో ప్రీమిక్స్‌లు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. వాటిని తెచ్చుకుని కాసింత ఐస్‌ వేసుకుంటే క్షణాల్లో మాక్‌టెయిల్స్‌ సిద్ధం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని