కబాబ్‌..లాజవాబ్‌!

మానవ నాగరికత అభివృద్ధి ఎలా సాగింది? ఈ ప్రశ్నకు జవాబు... కబాబ్‌! అంతవరకూ పచ్చిమాంసంతో ఆకలిమంట తీర్చుకున్న మనిషి.. మంట కనుగొన్న మరుక్షణం కబాబ్‌కి జైకొట్టాడు. నాటి నుంచి నరుని మేధస్సు పెరిగేకొద్దీ ఈ మాంసాహారం మెరుగవుతూ వచ్చింది. మసాలాలు దట్టించుకుంది..

Updated : 12 May 2019 00:35 IST

మానవ నాగరికత అభివృద్ధి ఎలా సాగింది? ఈ ప్రశ్నకు జవాబు... కబాబ్‌! అంతవరకూ పచ్చిమాంసంతో ఆకలిమంట తీర్చుకున్న మనిషి.. మంట కనుగొన్న మరుక్షణం కబాబ్‌కి జైకొట్టాడు. నాటి నుంచి నరుని మేధస్సు పెరిగేకొద్దీ ఈ మాంసాహారం మెరుగవుతూ వచ్చింది. మసాలాలు దట్టించుకుంది.. రకరకాల రసాల్లో మునిగితేలింది.. విధవిధాలుగా రూపుదిద్దుకుంది.. కాలేకొద్దీ కొత్తరుచులు అద్దుకుంది.. రుచిలో లాజవాబ్‌ అనిపించుకుంది. రంజాన్‌ మాసం సందర్భంగా రోజంతా ఉపవాసం తర్వాత ఇఫ్తార్‌లో కబాబ్స్‌కి చోటిస్తే విందు పసందుగా మారుతుంది.

చికెన్‌ షామీ..

కావాల్సినవి: బోన్‌లెస్‌ చికెన్‌: 900గ్రా, సెనగపప్పు- ఒకటింపావుకప్పు, జీలకర్ర- చెంచా, ఉప్పు- రుచికి తగినంత, ధనియాలు- చెంచా, ఎండు మిరపకాయలు- ఎనిమిది, పసుపు- పావుచెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచాన్నర, ఉల్లిపాయ- ఒకటి, సన్నగా తరిగిన కొత్తిమీర- పావుకప్పు, పుదీనా ఆకులు- గుప్పెడు, పచ్చిమిర్చి- ఎనిమిది, గరంమసాలా- చెంచా, గుడ్లు- రెండు, నూనె- తగినంత 
తయారీ: ముందుగా సెనగపప్పుని రెండు గంటలపాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. కుక్కర్‌ లేదా మందపాటి గిన్నెలో నానబెట్టిన సెనగపప్పు, చికెన్‌ ముక్కలు, ఉప్పు, ధనియాలు, ఎండు మిరపకాయలు, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గరంమసాలా తగినన్ని నీళ్లు వేసి అన్నింటిని కలిపి ఉడికించుకోవాలి. నీరు బాగా దగ్గరకొచ్చి చికెన్‌ మెత్తగా ఉడికిన తర్వాత బాగా కలిపి స్టౌమీద నుంచి దింపుకోవాలి. ఇప్పుడు మిక్సీలో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి హరామిక్చర్‌ తయారుచేసుకోవాలి. చికెన్‌ మిశ్రమం చల్లారిన తర్వాత పప్పుతో సహా మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో గుడ్డుసొన, హరామిక్చర్‌ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వడల్లా ఒత్తుకుని పాలిథిన్‌ కవర్‌పై ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత వాటిని పాన్‌లో కొద్దిగా నూనెవేసి అటూఇటూ కాల్చుకోవాలి. రుచిగా ఉండే షామీకబాబ్స్‌ సిద్ధం. 

హరాబరా..

కావాల్సినవి: బంగాళా దుంపలు- రెండు, సన్నగా తురిమిన పాలకూర- రెండు కప్పులు, పచ్చి బఠాణీలు- కప్పు, సెనగపిండి- మూడు చెంచాలు, గరంమసాలా- చెంచా, ఉప్పు- తగినంత, నిమ్మరసం- చెంచా, చాట్‌ మసాలా- చెంచా, నూనె- తగినంత
తయారీ: ముందుగా బంగాళాదుంపలు, పచ్చిబఠాణీలను కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. పాలకూరను మరుగుతున్న నీళ్లలో వేసి తీసేయాలి. ఆకులని పిండి అదనంగా ఉన్న నీటిని తీసేయాలి. సెనగపిండిని కడాయిలో వేసి దోరగా కమ్మని వాసన వచ్చేంతవరకూ వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపలు, పచ్చిబఠాణీలని మెత్తగా మెదుపుకోవాలి. ఇందులో సెనగపిండి, పాలకూర ఆకులు, గరంమాసాలా, ఉప్పు, నిమ్మరసం, చాట్‌మసాలా వేసి అన్నింటిని బాగా కలిపి కబాబ్స్‌లా తయారుచేసుకోవాలి. పెనంపై తగినంత నూనె వేసుకుని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి.

చేపతో..

కావాల్సినవి: ముళ్లులేని చేప- అరకేజీ, గట్టిపెరుగు- పావుకప్పు, నిమ్మరసం- చెంచా, వెల్లుల్లిపేస్ట్‌- చెంచా, కారం- అరచెంచా, పసుపు- పావుచెంచా, మిరియాలపొడి- పావుచెంచా, ఉప్పు- తగినంత, నూనె- తగినంత 
తయారీ: ఒక గిన్నెలో పెరుగు, నిమ్మరసం, కారం, ఉప్పు, పసుపు, మిరియాలపొడి, వెల్లుల్లిముద్ద, కొద్దిగా నూనె వేసి బాగా కలిపి... చివరిగా చేపముక్కలని వేసి మూతపెట్టి రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. అవెన్‌ని ముందుగా వేడిచేసి పెట్టుకోవాలి. లేదంటే గ్రిల్‌ లేదా బొగ్గులపైన కూడా కాల్చుకోవచ్చు. ఒక ఊచకి చేపముక్కలని గుచ్చి ఐదు నిమిషాలపాటు అవెన్‌లో కానీ బొగ్గులపైన కానీ ఉంచి అన్నివైపులా సమానంగా కాల్చితే చేప కబాబ్‌ సిద్ధం.  ఫిష్‌కబాబ్‌ని గ్రీన్‌చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. 
గ్రీన్‌చట్నీ కోసం: కొత్తిమీర- రెండు కప్పులు, పుదీనా- కప్పు, పుట్నాల పప్పు- గుప్పెడు, జీలకర్ర- చెంచా, పచ్చిమిర్చి- నాలుగు, తరిగిన వెల్లుల్లి - చెంచా, అల్లం- అంగుళంముక్క, నిమ్మరసం- చెంచా, ఉప్పు- తగినంత 
తయారీ: మిక్సీలో పుదీనా, కొత్తిమీర ఆకులని కొద్దిగా నీళ్లు చిలకరించి మెత్తగా రుబ్బుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, పప్పులు, నిమ్మరసం, ఉప్పు కూడా వేసి రుబ్బుకుంటే గ్రీన్‌చట్నీ రెడీ! 

మటన్‌బోటీ..

కావాల్సినవి: మటన్‌- కేజీ(బోన్‌లెస్‌), చిక్కని పెరుగు- కప్పు, ఉప్పు- రుచికి తగినంత, బ్రౌన్‌ ఆనియన్‌ (వేయించిన ఉల్లిపాయలు)- మూడు చెంచాలు(మార్కెట్లో రెడీమేడ్‌గా దొరుకుతాయి), పల్చగా తరిగిన నిమ్మకాయ చెక్కలు- నాలుగు(అలంకరణ కోసం), ధనియాలపొడి- చెంచా, జీలకర్రపొడి- చెంచా, చాట్‌మసాలా- చెంచా, మిరియాలపొడి- చెంచా, కారం- చెంచా, సన్నగా తరిగిన కొత్తిమీర- నాలుగు చెంచాలు, గరంమసాలా పొడి- చెంచా, నూనె- తగినంత 
పేస్ట్‌ కోసం: పచ్చి బొప్పాయి తురుము- పావుకప్పు, సన్నగా తరిగిన వెల్లుల్లి- చెంచా, సన్నగా తరిగిన అల్లం- చెంచా. వీటన్నింటిని కలిపి గ్రైండ్‌ చేసుకుని మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి.
తయారీ: మటన్‌లో చిక్కని పెరుగు, ఉప్పు, బ్రౌన్‌ ఆనియన్‌ పొడి, పచ్చిబొప్పాయి పేస్ట్‌, కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి, చాట్‌మసాలాపొడి, మిరియాలపొడి, నూనె వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మాంసానికి పట్టించుకోవాలి. రాత్రంతా ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. తెల్లారాక ఈ ముక్కలని స్కూయర్స్‌ లేదా ఊచలకి గుచ్చి గ్రిల్‌పైన  దోరగా ఇరవై నిమిషాలపాటు కాల్చుకుంటే.. మటన్‌బోటీ కబాబ్స్‌ రెడీ! 

హలీమ్‌ కబాబ్‌

కావాల్సినవి: దొడ్డు గోధుమరవ్వ- అరకప్పు, మినప్పప్పు- అరకప్పు, పెసరపప్పు- అరకప్పు, మటన్‌- అరకేజీ, వేపుడు బఠానీలు- అరకప్పు, సన్నగా తరిగిన వెల్లుల్లి పలుకులు- రెండు చెంచాలు, సన్నగా తరిగిన అల్లం- రెండు చెంచాలు, నెయ్యి- రెండు చెంచాలు, కుంకుమపువ్వు- చిటికెడు, ధనియాలపొడి- చెంచా, జీలకర్రపొడి- చెంచా, చాట్‌మసాలా- చెంచా, కారం- రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు- చెంచా, పసుపు- పావుచెంచా, పచ్చిమిర్చి- రెండు, ఉప్పు- తగినంత, నూనె- తగినంత 
తయారీ: పెద్దగోధుమరవ్వ, మినప్పప్పు, పెసరపప్పు, బఠాణీలని ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. తెల్లారి ఆ పప్పులని బాగా కడిగి మటన్‌తోపాటు, అల్లం, వెల్లుల్లి పలుకులు, ఉప్పు కూడా వేసి రెండు గంటలపాటు సన్నసెగ మీద మెత్తగా ఉడికించుకోవాలి. దీన్ని పొయ్యిమీద నుంచి దించి చల్లారాక ఎముకలని తీసేయాలి. ఇప్పుడు మందపాటి అడుగున్న పాన్‌లో నెయ్యి వేసి అది కరిగాక అందులో కుంకుమపువ్వు, ధనియాల పొడి, జీలకర్రపొడి, చాట్‌మసాలా, కారం, పసుపు, పచ్చిమిర్చి వేసి ఒక నిమిషంపాటు వేడి చేసుకోవాలి. మసాలా పరిమళం గాల్లోకి వ్యాపించగానే దీనిలో మెత్తని మటన్‌ మిశ్రమం వేసి దగ్గరకు రానివ్వాలి. చల్లారిన తర్వాత చేత్తో కబాబ్స్‌ మాదిరిగా ఒత్తి పెనంలో నూనె వేసి రెండువైపులా ఫ్రై చేసుకుంటే హలీమ్‌ కబాబ్స్‌ సిద్ధం.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని