పెనం కూర..నోరూర!

తవాకా ఘోష్‌.. కీమా చపాతీ..పెనం కూర..పేరు ఏదైనా వంటకం ఒక్కటే. పిలుపు ఎలాంటిదైనా రుచిమాత్రం ఒక్కటే.. రాయలసీమ గుండెగా పేరొందిన కడపవాసుల మనసు దోచుకుంటోందా పదార్థం.. గత 50 ఏళ్లుగా దేవునిగడప బిడ్డల నోరూరిస్తూనే ‘ఆహా’ అనిపిస్తోంది..

Published : 19 May 2019 00:33 IST

పక్కా లోకల్‌

తవాకా ఘోష్‌.. కీమా చపాతీ..పెనం కూర..పేరు ఏదైనా వంటకం ఒక్కటే. పిలుపు ఎలాంటిదైనా రుచిమాత్రం ఒక్కటే.. రాయలసీమ గుండెగా పేరొందిన కడపవాసుల మనసు దోచుకుంటోందా పదార్థం.. గత 50 ఏళ్లుగా దేవునిగడప బిడ్డల నోరూరిస్తూనే ‘ఆహా’ అనిపిస్తోంది.. సాయంత్రం 6 అయిందంటే చాలు.. పెనంకూర కోసం అభిమానులు క్యూ కడుతుంటారు.
పెనం కూర తయారీ విభిన్నంగా ఉంటుంది. నిప్పులపొయ్యిపై సన్నటిమంట మీద పెనం వేడి చేస్తారు. మటన్‌ ముక్కలను సన్నగా తరిగి 22 రకాల మసాలా దినుసులతో చేసిన మిశ్రమాన్ని పట్టిస్తారు. పది కిలోల మాంసానికి కనీసం కిలో మసాలా వినియోగిస్తారన్న మాట. అలా మసాలాలో ఊరిన మాంసాన్ని వేడెక్కిన పెనంపై వేసి వేయిస్తారు. కొద్దిగా నీరు కలపడంతో కుతకుతా ఉడకడం మొదలవుతుంది. 2 నుంచి 3 గంటల పాటు ఆ సన్నని మంటపై ఇలాగే ఉడికిస్తారు. అందులోంచి వచ్చిన మటన్‌ పులుసుని పెనంపైనే వేరుచేసి అప్పటికే సిద్ధం చేసిన చపాతీలను ఆ పులుసులో వేసి నానబెడతారు. కనీసం 20 నిమిషాలు అలాగే ఉంచాక చపాతీలన్నీ మెత్తబడతాయి. ప్రత్యేకమైన రుచిని సంతరించుకుంటాయి. ఆ పులుసులో తడిచిన చపాతీలను, మటన్‌ ముక్కలతో కలిపి వడ్డిస్తారు.

రూ.50కే లభ్యం
కడపలోని రవీంద్రనగర్‌, సంగం థియేటర్‌ పరిసరాల్లో ఈ పెనం కూర తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉంటాయి. కర్నూలు జిల్లాలోనూ ఆళ్లగడ్డ, నంద్యాలలోనూ తయారు చేస్తుంటారు. అయితే కడప రుచి మాత్రం ఎక్కడా దొరకదన్నది పెనం కూర అభిమానులు మురిపెంగా చెప్పే మాట. ఒక్కసారి మటన్‌ పులుసుతో మెత్తబడిన ఆ చపాతీని  కూరతో తింటే చాలు.. ఇక జీవితాంతం ఆ రుచి మరువలేరు..

- గాలి సురేష్‌, ఈనాడు, కడప

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని