ఆలూ ఆవకాయ పాఠక వంట

సమోసాలో సాహో అనిపిస్తుంది. కుర్మాగా భలేగా కుదురుతుంది. వేపుళ్లలో వేల్పుగా గుర్తింపు పొందింది బంగాళదుంప. ఇదే బంగాళదుంపతో ఆవకాయ కూడా

Published : 29 Sep 2019 00:08 IST

సమోసాలో సాహో అనిపిస్తుంది. కుర్మాగా భలేగా కుదురుతుంది. వేపుళ్లలో వేల్పుగా గుర్తింపు పొందింది బంగాళదుంప. ఇదే బంగాళదుంపతో ఆవకాయ కూడా చేసుకోవచ్చు తెలుసా! ఎలా చేసుకోవాలంటే..

కావాల్సినవి: బంగాళదుంపలు- 3, కారం- 4 చెంచాలు, ఆవాలపొడి- చెంచా, మెంతిపొడి- అరచెంచా, నూనె- కప్పు, ఉప్పు- తగినంత, నిమ్మకాయలు- రెండు, పోపుకోసం: ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ.

తయారీ: బంగాళదుంపలను ఒకటిన్నర అంగుళం చొప్పున ముక్కలుగా చేసుకోవాలి. వీటిని మరుగుతున్న నీళ్లలో వేసి రెండు నిమిషాలు ఉంచాలి. ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసుకోవాలి. అది కాగిన తర్వాత బంగాళదుంప ముక్కలను అందులో వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేగనివ్వాలి. ముక్కలను విడిగా పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో అరకప్పు నూనె వేసి అవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువతో పోపు పెట్టుకోవాలి. పోపు చల్లారిన తర్వాత కారంపొడి, ఆవాలపొడి, ఉప్పు, మెంతిపొడి అందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఇందాక నూనెలో వేయించిన బంగాళదుంప ముక్కలను వేసుకొని అవి చెదిరిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. చివరగా నిమ్మకాయల నుంచి తీసిన రసం వేసుకోవాలి. అంతే ఆలూ ఆవకాయ సిద్ధం. పోపులోకి ఇంగువకు బదులుగా అల్లంవెల్లుల్లి ముద్ద అర చెంచా వేసుకోవచ్చు.

- టి.వెంకటలక్ష్మి, హైదరాబాద్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని