Published : 05 Apr 2020 00:57 IST

పసుపు రక్షణ!

శతాబ్దాలుగా భారతీయులు పసుపుని ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. కారణం... పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌ లక్షణాలు వ్యాధులని దూరం చేయడమే!
గోల్డెన్‌ మిల్క్‌
దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు గ్లాసుడు గోల్డెన్‌ మిల్క్‌ తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.  గోల్డెన్‌మిల్క్‌ను ఇలా తయారుచేసుకోవచ్చు. గ్లాసుడు పాలను స్టవ్‌ మీద పెట్టి చెంచాడు పసుపు, చెంచాడు తేనె, కొద్దిగా నెయ్యి, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలిపి తక్కువ మంట మీద కాసేపు మరగనివ్వాలి. వీటిని రాత్రి పడుకోబోయే ముందు తీసుకుంటే తెల్లవారేసరికి తేడా మీకే తెలుస్తుంది.
* పసుపులో విటమిన్లు, మినరల్స్‌, మాంగనీస్‌, ఇనుము, పీచు, విటమిన్‌ బి6, కాపర్‌, పొటాషియం ఉంటాయి. రోజూ పసుపును ఆహారంలోకి చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన దానిలో పది శాతం ఇనుము అందుతుంది. తగిన మోతాదులో ఇనుము లభించడం వల్ల హిమోగ్లోబిన్‌, కొత్త రక్తకణాలు ఉత్పత్తికి అవకాశం కలుగుతుంది. అలసట దరిచేరదు.
* పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. కొన్ని రకాల వ్యాధులకు దీర్ఘకాలంపాటు వాడే ఔషధాలు కాలేయం మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి వాటి నుంచి కాలేయాన్ని పసుపు రక్షిస్తుంది. ఫ్యాటీ లివర్‌ నియంత్రణకు పసుపు ఉపయోగపడుతుంది.
* కర్క్యుమిన్‌ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడే రోగులకు ఔషధాల కంటే పసుపు సమర్థంగా పనిచేసినట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కుంగుబాటు, దిగులుతో బాధపడుతున్న కొంతమందికి కొంతకాలంపాటు పసుపుని ఆహారంలో చేర్చి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
* కర్క్యుమిన్‌ వృద్ధాప్య ఛాయలను వాయిదా వేస్తుంది. వయసు పెరగడం వల్ల వచ్చే వ్యాధుల నుంచి కాపాడుతుంది.
* కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు రక్షణ కల్పిస్తుంది. మతిమరుపు రాకుండా చేస్తుంది.
* ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు పసుపును తీసుకోవడం వల్ల నొప్పులు తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తీ పెరుగుతుంది. దీంట్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మంట, వాపులను నిరోధిస్తాయి. కర్క్యుమిన్‌ రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను తగ్గిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని