వెల్లం నీళ్లు... ఆరోగ్యానికి హామీ!

మండుటెండలో ఇంటికొచ్చిన వాళ్లకు మనమైతే చల్లని నీళ్లు చేతికందిస్తాం. మలయాళీలు మాత్రం వేడిగా ఉండే వెల్లం నీళ్లు ఇస్తారు. ఏ కాలంలో అయినా సరే ఇంటికొచ్చిన వారికి ....

Published : 05 Apr 2020 01:10 IST

పక్కాలోకల్‌!

మండుటెండలో ఇంటికొచ్చిన వాళ్లకు మనమైతే చల్లని నీళ్లు చేతికందిస్తాం. మలయాళీలు మాత్రం వేడిగా ఉండే వెల్లం నీళ్లు ఇస్తారు. ఏ కాలంలో అయినా సరే ఇంటికొచ్చిన వారికి ఈ వేడివేడి వెల్లం నీళ్లు ఇచ్చి స్వాగతం పలకడం అక్కడి సంప్రదాయం. ఇంతకీ ఈ నీళ్లని ఎందుకిస్తారో తెలుసా?
మంచినీళ్లు తాగుతూ ఆరోగ్యంగా ఉండాలన్నా.. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే నీళ్లు తాగాలన్నా.. వీటిని ఒకసారి ప్రయత్నించాల్సిందే. ఇవే.. మలయాళీలు రోజూ తాగే వెల్లం లేదా పథిముగమ్‌ నీళ్లు. పథిముగమ్‌ అనేది ఔషధ గుణాలున్న చెట్టు. ఆ చెట్టు బెరడును ఉపయోగించే ఈ నీటిని తయారుచేస్తారు. పథిముగమ్‌ను ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ వినియోగిస్తారు. ఈ నీటికి యాంటీ మైక్రోబయల్‌ లక్షణాలుంటాయి. వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుందని వారి విశ్వాసం. అలర్జీల నుంచి రక్షించి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. థైరాయిడ్‌, మధుమేహం, చర్మ సంబంధ వ్యాధుల నుంచి కాపాడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లున్నవాళ్లు వీటిని తాగితే మంచిది. కాలాలు మారినప్పుడు వచ్చే ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ నీటిని ఎలా తయారుచేసుకోవాలంటే...

తయారీ: పెద్దపాత్రలో మూడు లీటర్ల నీటిని తీసుకుని నీళ్లు కాస్త వేడెక్కాక నాలుగైదు పథిముగమ్‌ బెరడు ముక్కలను వేసి బాగా మరిగించాలి. అప్పుడు నీళ్లు గులాబీ రంగులోకి మారిపోతాయి. వీటిని గాజుసీసాలో భద్రపరుచుకుని రోజంతా ఉపయోగించుకోవచ్చు. భోజనానికి ముందు గోరువెచ్చటి ఈ నీళ్లను తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మలయాళీలు రోజూ వీటినే తాగుతారు. రెస్టారెంట్లలోనూ వీటినే అందుబాటులో ఉంచుతారు. జలుబు, దగ్గు లాంటి ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా ఉండటానికి ఎదిగే పిల్లలకు రోజూ ఈ నీటిని ఇవ్వవచ్చు. కుటుంబసభ్యులంతా ఈ నీటిని వాడి ఆరోగ్యంతో జీవించవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని