ఇది పోషకాలం గురూ!

ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఆకలి ఎక్కువ వేస్తుందని అంటారు చాలామంది. ప్రస్తుతం చాలామంది పరిస్థితి అలానే ఉంది....

Published : 12 Apr 2020 00:24 IST

ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఆకలి ఎక్కువ వేస్తుందని అంటారు చాలామంది. ప్రస్తుతం చాలామంది పరిస్థితి అలానే ఉంది. ఇలాంటప్పుడు మనం తినే ఆహారం పోషకభరితం అవ్వడంతోపాటు బరువు పెంచకుండా ఉంటే మంచిది కదా. తేలిగ్గా చేసుకోగలిగే, పోషకాలు పుష్కలంగా ఉండే వంటకాలిలి..

ఇన్‌స్టెంట్‌ ఓట్స్‌ ఇడ్లీలు

కావాల్సినవి: ఓట్స్‌- కప్పు, మినప్పప్పు- పావుకప్పు, పెరుగు- 50 గ్రా., అల్లంముద్ద-టీస్పూన్‌, సన్నగా తరిగిన పచ్చిమిర్చి- రెండు, ఉప్పు- తగినంత, నీళ్లు- సరిపడా, నూనె- టేబుల్‌ స్పూన్‌.

తయారీ: మినప్పప్పు, ఓట్స్‌ను మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో పెరుగు, అల్లంముద్ద, పచ్చిమిర్చి, కాస్త ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలపాలి. ప్లేట్లకు నూనె రాసి ఇడ్లీలు వేసుకుని పది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. ఏ చట్నీతో తిన్నా ఇవి రుచిగా ఉంటాయి.

మిక్స్‌డ్‌ దాల్‌ దోసె

కావాల్సినవి: కందిపప్పు, సెనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు- కప్పు, బియ్యప్పిండి- ముప్పావుకప్పు, పచ్చిమిర్చి- రెండు, తురిమిన అల్లం - టీస్పూన్‌, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత, నూనె- సరిపడినంత.

తయారీ: ముందుగా పప్పులన్నింటినీ బాగా కడిగి రెండు నుంచి మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి. తరువాత నీళ్లు వంపేసి అందులో పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఇంగువ వేసి మెత్తగా అయ్యేంతవరకు మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో బియ్యప్పిండి, తగినంత ఉప్పు వేసి కొద్దిగాకొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోసెల పిండిలా కలపాలి. ఇప్పుడు స్టవ్‌ మీద నాన్‌స్టిక్‌ పాన్‌ పెట్టి వేడెక్కాక దోసె వేసుకుని నూనె పోసి రెండు వైపులా కాల్చుకోవాలి. వేడివేడి దోసెల్ని ఇష్టమైన చట్నీతో తినొచ్ఛు చట్నీ లేకపోయినా తినడానికి రుచిగానే ఉంటాయి.

మీల్‌మేకర్‌ ఆలూ

కావాల్సినవి: మీల్‌మేకర్‌ (సోయా)- కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు- అరకప్పు, నూనె- టేబుల్‌ స్పూన్‌, సన్నగా తరిగిన ఉల్లిపాయ- ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద- టీస్పూన్‌, కారం- అర టీస్పూన్‌, పసుపు- అర టీస్పూన్‌, ధనియాల పొడి- టీస్పూన్‌, చిన్నముక్కలుగా తరిగిన టమాటాలు- రెండు, ఉప్పు- సరిపడా, కొత్తిమీర తురుము- కొద్దిగా.

తయారీ: మీల్‌మేకర్‌ను పదిహేను నిమిషాల పాటు వేడినీటిలో నానబెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలపాటు మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత దాంట్లో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పుతోపాటు టమాటా ముక్కలు వేసి కాసేపు ఉడికించాలి. ఇవి ఉడికిన తరువాత నానబెట్టుకున్న మీల్‌మేకర్‌ను నీళ్లు పిండేసి ఈ మిశ్రమంలో వేసి ఉడికించుకోవాలి. ఆ తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల ముక్కలను వేసి మరికాసేపు మగ్గించాలి. చివరగా కూర దించే ముందు తురిమిన కొత్తిమీర వేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని