జిల్‌ జిల్‌ జిగర్తాండ

మదురై అనగానే మీనాక్షి అమ్మోరు గుర్తొస్తుంది. ఆ వెంటనే జల్లికట్టు ఆకట్టుకుంటుంది. తర్వాత మల్లెల పరిమళం మనసును లాగుతుంది. వీటి సరసన మరొకటి ఉంది. అదే జిగర్తాండ!

Updated : 03 May 2020 01:08 IST

పొరుగింటి పుల్లకూర!

మదురై అనగానే మీనాక్షి అమ్మోరు గుర్తొస్తుంది. ఆ వెంటనే జల్లికట్టు ఆకట్టుకుంటుంది. తర్వాత మల్లెల పరిమళం మనసును లాగుతుంది. వీటి సరసన మరొకటి ఉంది. అదే జిగర్తాండ! ఆలయాల నగరి చరిత్రలో భాగమైందీ పానీయం. మదురైలో ఎండలు ముదిరే కొద్దీ దానికి డిమాండు పెరుగుతుంది. జిహ్వకు రుచిని, శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది జిగర్తాండ. బాదం జిగురు, జున్ను, బాసుందీ ఇలా పోషకాల కారకాలన్నీ నన్నారి షర్బత్‌లో మునిగి పసందైన పానీయంగా రూపుదిద్దుకుంటాయి. ఎప్పుడు పుట్టిందని అడిగితే.. రకరకాల కథలు చెబుతారు. 16వ శతాబ్దంలో మొఘలులు మదురై పైకి వచ్చినప్పుడు వారితో జిగర్తాండ వచ్చిందని కొందరు చెబుతారు. 17వ శతాబ్దిలో హైదరాబాదీలు ఇక్కడికొస్తూ దీన్ని తీసుకొచ్చారని కొందరు చెబుతారు. మొఘలుల ప్రాభవం ఉన్న ఉత్తరాదిలో జిగర్తాండ ఊసుండదు. నైజాం ఏరియాలోనూ ఈ పేరు అంతగా తెలియదు. కానీ, మదురై మాత్రం జిగర్తాండకు అడ్డాగా నిలిచిపోయింది. వీధివీధిలో ప్రత్యేక దుకాణాలుంటాయి. ఆ ప్రాంతానికి వచ్చిన వారెవరైనా.. జిగర్తండా రుచి చూశాక గానీ తిరుగు ప్రయాణమవ్వరు. ఇందరి మనసులు దోచిన ఈ పానీయం ఎలా చేసుకోవాలంటే...
కావాల్సినవి: పాలు- పావు లీటరు, నన్నారీ సిరప్‌- నాలుగు టేబుల్‌ స్పూన్లు, ఇడిబుల్‌ గమ్‌- టేబుల్‌స్పూన్‌.
ఐస్‌క్రీమ్‌ కోసం: పాలు- ముప్పావు లీటరు, పంచదార- అరకప్పు, తాజా మీగడ- అరకప్పు, పాలకోవ- రెండు టేబుల్‌స్పూన్లు, వెనీలా ఎసెన్స్‌- అర టీస్పూన్‌.
తయారీ: మందపాటి గిన్నెలో పాలను పోసి సన్నటి మంట పది నిమిషాలపాటు మరిగించాలి. తర్వాత పంచదార వేసి అవి సగం అయ్యేంతవరకు మరిగిస్తే గోధుమ రంగులోకి మారతాయి. వాటిలోంచి కప్పు పాలను ఫ్రిజ్‌లో పెట్టాలి. మిగిలిన పాలను పది నిమిషాలపాటు మరిగించి, చల్లార్చి పాలకోవా కలపాలి. తర్వాత తాజా మీగడ, వెనీలా ఎసెన్స్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాత్రలోకి తీసుకుని నాలుగైదు గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. బాగా గట్టి పడిన తర్వాత బయటకు తీసి మిక్సీ పట్టి మళ్లీ ఎనిమిది గంటలపాటు ఫ్రిజ్‌లో పెడితే అది క్రీమ్‌లా తయారవుతుంది. ఇడిబుల్‌ గమ్‌ను నీళ్లలో వేసి రాత్రంతా నానబెడితే రెట్టింపవుతుంది. అవసరమైతే దీంట్లో కాసిన్ని నీళ్లు పోయాలి. ఇప్పుడు గ్లాసులో రెండు టీస్పూన్ల నన్నారి సిరప్‌ వేసి దానిపైన రెండు టేబుల్‌ స్పూన్ల గమ్‌ను వేయాలి. తర్వాత కొద్దిగా పాలు, ఆ తర్వాత చిక్కటి పాలు పోసి బాగా కలపాలి. ఆపైన ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఐస్‌క్రీమ్‌ వేయాలి. వెంటనే తాగితే చల్లచల్లగా ఎంతో రుచిగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని