ఇంట్లోనే మిక్స్‌డ్‌ వెజ్‌ హలీమ్‌

రంజాన్‌ అనగానే... నోరూరించే షీర్‌కుర్మా, హలీమ్‌లే గుర్తుకొస్తాయి. మామూలు రోజుల్లో అయితే సాయంకాలం అయితే చాలు ఘుమఘుమలాడే వేడివేడి హలీమ్‌ నోరూరించేది.

Published : 10 May 2020 00:36 IST

పండగ ప్రత్యేకం!

రంజాన్‌ అనగానే... నోరూరించే షీర్‌కుర్మా, హలీమ్‌లే గుర్తుకొస్తాయి. మామూలు రోజుల్లో అయితే సాయంకాలం అయితే చాలు ఘుమఘుమలాడే వేడివేడి హలీమ్‌ నోరూరించేది. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. అలాని నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మిక్స్‌డ్‌ వెజ్‌ హలీమ్‌ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందామా...

కావాల్సినవి: గోధుమరవ్వ- కప్పు,  ఓట్స్‌, ఎర్రకందిపప్పు, మినప్పప్పు, సెనగపప్పు, రాజ్‌మా- పావుకప్పు చొప్పున, లవంగాలు- ఆరు, యాలకులు- మూడు, దాల్చినచెక్క- మూడు, ఉప్పు- తగినంత, కారం- తగినంత, పసుపు- చిటికెడు, మిరియాలు- టీస్పూన్‌, జీలకర్ర- అర టీస్పూన్‌, మిరియాలు- టీస్పూన్‌, సోయాగ్రాన్యూల్స్‌- పావుకప్పు, క్యారెట్‌ ముక్కలు- అరకప్పు, తరిగిన బీన్స్‌- అరకప్పు, కాలీఫ్లవర్‌- అరకప్పు, పచ్చిబఠానీలు- అరకప్పు, తరిగిన పచ్చిమిర్చి- నాలుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- టీస్పూన్‌, కొత్తిమీర, పుదీనా తురుము- కొద్దిగా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు- కొన్ని, నూనె- మూడు టేబుల్‌స్పూన్లు, నెయ్యి- రెండు టేబుల్‌స్పూన్లు, వేయించిన జీడిపప్పు- కొద్దిగా, పెరుగు- రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం- టీస్పూన్‌.

తయారీ: గోధుమరవ్వ, ఓట్స్‌, సోయాగ్రాన్యూల్స్‌, మినప్పప్పు, ఎర్రకందిపప్పు, సెనగపప్పు, రాజ్‌మాలను విడివిడిగా నానబెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి మసాలా దినుసులు, మిరియాలు, అల్లంవెల్లుల్లి ముద్ద, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్‌, బీన్స్‌, కాలీఫ్లవర్‌.. కూరగాయ ముక్కలన్నీ వేసి వేయించాలి. తర్వాత నానబెట్టిన గోధుమరవ్వ, ఓట్స్‌, సోయాగ్రాన్యూల్స్‌, మినప్పప్పు, ఎర్రకందిపప్పు, సెనగపప్పు, రాజ్‌మాలను వేయాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి బాగా కలపాలి. దీన్ని కుక్కర్‌లో వేసి సరిపడా నీళ్లు పోసి నాలుగైదు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి వేడిచేసి కొద్దిగా కారం, ఉప్పు, కొత్తిమీర తురుము వేయాలి. దీంట్లో మెత్తగా మిక్సీపట్టిన మిశ్రమాన్ని వేసి నెయ్యి దాంట్లో కలిసేంతవరకు బాగా కలపాలి. ఆ తర్వాత నిమ్మరసం పిండాలి. దీన్ని చిన్నగిన్నెలోకి తీసుకుని వేయించిన జీడిపప్పులు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేడివేడిగా తినాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని