నోరూరించే  కిచిడి..

బియ్యం-రెండు కప్పులు, పెసరపప్పు-కప్పు, టొమాటో ముక్కలు-అరకప్పు, పసుపు-చిటికెడు, క్యారెట్‌ తురుము-అరకప్పు,

Updated : 15 Jun 2021 12:41 IST

చెఫ్‌ ప్రత్యేకం...

కావాల్సినవి: బియ్యం-రెండు కప్పులు, పెసరపప్పు-కప్పు, టొమాటో ముక్కలు-అరకప్పు, పసుపు-చిటికెడు, క్యారెట్‌ తురుము-అరకప్పు, బఠాణీ-అరకప్పు, పచ్చిమిర్చి-ఐదు, జీలకర్ర-చెంచా, గరంమసాలా-అరచెంచా, నూనె-తగినంత, ఉప్పు-రుచికి సరిపడా, కొత్తిమీర-కొద్దిగా.
తయారీ: బియ్యం, పప్పును కడిగి నానబెట్టుకోవాలి. స్టవ్‌ వెలిగించి పాన్‌ పెట్టి నూనె పోయాలి. అది కాగిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి. ఇందులో చిటికెడు పసుపు, బఠాణీ, క్యారెట్‌ తురుము కూడా వేసి మరోసారి బాగా కలపాలి. కాస్త వేగిన తర్వాత నాలుగు గ్లాసుల నీళ్లు పోయాలి. ఇవి మరుగుతున్నప్పుడు ఉప్పు, గరంమసాలా వేయాలి. ఇప్పుడు నానబెట్టిన పప్పు, బియ్యం మిశ్రమాన్ని వేసి ఓసారి కలిపి మూత పెట్టాలి. చిన్నమంట మీద పదిహేను నిమిషాలపాటు ఉడికించాలి. మొత్తం నీళ్లన్నీ ఇగిరిపోయాక స్టవ్‌ ఆఫ్‌ చేసి కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి. వేడి వేడిగా సర్వ్‌ చేసుకుంటే ఘుమఘుమలాడే కిచిడీ రెడీ.
హైదరాబాదీలు ఇష్టపడే వంటకాల్లో కిచిడీని ఒకటిగా చెప్పొచ్చు. అనుకోని వేళ అతిథులు వస్తే దీన్ని చిటికెలో చేసిపెట్టొచ్చు. రుచితోపాటు బోలెడు పోషకాలనీ అందిస్తుందీ వంటకం. కిచిడీలో బియ్యం, పప్పుల నుంచి పిండిపదార్థాలు, మాంసకృత్తులు, పీచు మెండుగా లభిస్తాయి. త్వరగా జీర్ణమవడమే కాకుండా పోషకాలను అందిస్తుంది. రోగనిరోధక శక్తినీ పెంచుతుంది. అందుకే ఒంట్లో బాగోలేనప్పుడు దీన్ని తినమని చెబుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని