చికెన్‌ పచ్చడి రుచి పెరగాలంటే!

చికెన్‌ పచ్చడి రుచిగా చేసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిది చికెన్‌. బోన్‌లెస్‌ చికెన్‌ పచ్చడి చాలా బావుంటుంది. ఎముకలు లేని కోడిమాంసాన్ని ఎంచుకోవాలి.

Published : 11 Jul 2021 01:04 IST

ప్రశ్న- జవాబు

నాకు నాన్‌వెజ్‌ పచ్చళ్లు చాలా ఇష్టం. ముఖ్యంగా చికెన్‌ పచ్చడి. ఇది బాగా కుదిరేందుకు కొన్ని చిట్కాలు చెప్పండి.

- సుజాత, హైదరాబాద్‌

చికెన్‌ పచ్చడి రుచిగా చేసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిది చికెన్‌. బోన్‌లెస్‌ చికెన్‌ పచ్చడి చాలా బావుంటుంది. ఎముకలు లేని కోడిమాంసాన్ని ఎంచుకోవాలి. మొదట ముక్కలు కడిగి టిష్యూ పేపర్‌పై ఉంచి ఆరనివ్వాలి.

సాధ్యమైనంత వరకు అన్ని ముక్కలూ ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి. కొన్ని పెద్దవి, మరికొన్ని చిన్నవి తీసుకుంటే వేయించేటప్పుడు చిన్నముక్కలు మరీ గట్టిగా అవుతాయి లేదా మాడిపోతాయి. దాంతో పచ్చడి రుచి మారిపోతుంది. ముక్కలకు అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. నూనె బాగా కాగిన తరువాత ముక్కలు వేసి వేయించాలి. అలాగే ముక్కలు వేశాక మంటను చిన్నగా పెట్టాలి. ముక్క  బయటి వైపు అంతా క్రిస్పీ అయ్యేవరకు వేయించుకోవాలి లేకపోతే పచ్చడి పాడవుతుంది. చికెన్‌ ముక్కలు ఫ్రై చేసిన నూనెలోనే అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. ఇప్పుడు మసాలా జత చేయాలి. మసాలా దినుసులు వాడాలి కానీ గరంమసాలా పొడి వద్దు. యాలకులు, లవంగాలు, జీలకర్ర, షాజీరా, దాల్చిన చెక్క, ఆవాలు, మెంతులను వేయించుకోవాలి. కావాలనుకుంటే గసగసాలు వేసుకోవచ్చు. పచ్చడి నుంచి నూనె పైకి తేలేటప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. చల్లారిన తర్వాత నిమ్మరసం కలపాలి. కారానికి బదులు ఎండుమిర్చి వాడుకోవచ్చు.

ఎండుమిర్చితోపాటు మిరియాలు కూడా వేసుకుంటే ప్రత్యేకమైన రుచి వస్తుంది. నిమ్మరసం బదులు ఆమ్‌చూర్‌ పొడినీ వాడుకోవచ్చు. చికెన్‌ ఫ్రై చేసే నూనెలో మొదట కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. నిల్వ పచ్చడి కాకుండా తక్కువ మోతాదులో అప్పటికప్పుడే కావాలనుకుంటే నూనెలో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. రిఫైండ్‌ ఆయిల్‌కు బదులు గానుగ నూనె వాడితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని