గరంమసాలా రుచిగా ఎలా చేయాలి?

మా ఇంట్లో వారంలో రెండు మూడుసార్లు మాంసాహారం వండటం తప్పనిసరి. కూర వండిన ప్రతీసారి మార్కెట్‌లో దొరికే గరంమసాలా వేస్తున్నా. ఆ రుచి నాకు అంతగా నచ్చట్లేదు.

Published : 23 Jan 2022 00:50 IST

మా ఇంట్లో వారంలో రెండు మూడుసార్లు మాంసాహారం వండటం తప్పనిసరి. కూర వండిన ప్రతీసారి మార్కెట్‌లో దొరికే గరంమసాలా వేస్తున్నా. ఆ రుచి నాకు అంతగా నచ్చట్లేదు. ఈ మసాలాను ఇంట్లోనే రుచిగా, సువాసనభరితంగా ఎలా తయారు చేసుకోవాలి?

-వై.లత, విజయవాడ

మాంసాహార వంటకాల్లో వేసుకునే గరంమసాలాను ఇంట్లోనే అద్భుతమైన రుచితో తయారు చేసుకోవచ్చు. దీనికోసం... అర కప్పు ధనియాలు, పావు కప్పు జీలకర్ర, రెండు పెద్ద చెంచాల చొప్పున యాలకులు, సోంపూ, లవంగాలు; పెద్ద చెంచాడు నల్ల మిరియాలు, పొడుగాటి దాల్చిన చెక్కలు రెండు, 20 గ్రాముల జాజికాయ, అనాసపువ్వు, మూడు జాపత్రి పోగులు అవసరమవుతాయి.

మసాలా దినుసులన్నింటినీ మొదట ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడిచి శుభ్రం చేసుకోవాలి. పొయ్యి వెలిగించి పెనం పెట్టి యాలకులు, అనాసపువ్వు, జాజికాయ, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసి చిన్న మంటపై కమ్మటి వాసస వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత చల్లార్చుకోవాలి. ఇదే విధంగా ధనియాలు, జీలకర్ర సోంపునూ విడివిడిగా వేయించి చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి భద్రపరుచుకుంటే సరి.

జాగ్రత్తలు..

మసాలా చాలా రుచిగా రావాలంటే అన్ని దినుసులను కొలిచి తీసుకోవడం మంచిది. పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతే పొడి చేసుకోవాలి. దాల్చిన చెక్కలో ప్రత్యేక రకం చాలా సువాసనలతో ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆ రకాన్నే వాడటం మంచిది. పచ్చి యాలకులు అంటే ఆకుపచ్చని ఇలాచీ వాడితే బాగుంటుంది. చాలామంది నల్ల యాలకులనే గరంమసాలా తయారీలో వాడుతుంటారు. ఇవి చాలా ఘాటుగా ఉంటాయి. అంత ఘాటు ఇష్టం లేనివారు వాటిని తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా వేసుకోకుండా వదిలేయొచ్చు. యాలకుల్లో అన్నీ పచ్చివే కాకుండా కొన్ని నల్లవి కూడా కలపొచ్చు. మసాలా దినుసులు వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దమంటపై వేయిస్తే మాడిపోయి రంగు, రుచీ రెండూ మారిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో గరంమసాలాలో అల్లం పొడి కూడా కలుపుతారు. ధనియాలు మరీ ఎక్కువ తీసుకుంటే మసాలా వాసన తక్కువగా ఉంటుంది. దినుసులు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఘాటు పెరిగి రుచి పాడవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని