మిక్స్‌డ్‌ వెజ్‌ ఇడ్లీ...

బ్రేక్‌ఫాస్ట్‌ అనగానే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది ఇడ్లీనే. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కూరగాయలతో కలిపి ఇలా కొత్తగా ప్రయత్నించి చూడండి.  

Published : 24 Apr 2022 00:56 IST

బ్రేక్‌ఫాస్ట్‌ అనగానే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది ఇడ్లీనే. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కూరగాయలతో కలిపి ఇలా కొత్తగా ప్రయత్నించి చూడండి.  

కావాల్సినవి: రవ్వ- కప్పు, పెరుగు- అర కప్పు, నూనె- మూడు చెంచాలు, జీలకర్ర- అర చెంచా, శనగపప్పు, మినప్పప్పు- చెంచా చొప్పున ఇంగువ- చిటికెడు, కరివేపాకు- రెబ్బ, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కాజూ, క్యారెట్‌, క్యాప్సికమ్‌, బీన్స్‌ తరుగు- చెంచా చొప్పున; బఠాణీలు, పల్లీలు- కొన్ని; పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, కొత్తిమీర తురుము- కొద్దిగా, వంటసోడా- చిటికెడు.

తయారీ: పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి. పోపు దినుసులతోపాటు కరివేపాకు, ఇంగువా వేసుకోవాలి. ఆపై పచ్చిమిర్చి, అల్లం తరుగు, కాజూ వేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత క్యారెట్‌, క్యాప్సికమ్‌, బీన్స్‌ తరుగు, బఠాణీలు వేసి వేయించాలి. కావాలనుకుంటే ఇతర కూరగాయల ముక్కలనూ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు, పసుపులతోపాటు రవ్వను వేయాలి. మంట చిన్నగా చేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. స్టవ్‌ ఆఫ్‌ చేసి ఈ పొడిని మరో గిన్నెలోకి మార్చి చల్లార్చాలి. ఇందులో పెరుగు, తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా కలపాలి. కొత్తిమీర తురుమును జత చేయాలి. 15 నిమిషాల తర్వాత కొన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. ఇడ్లీ ప్లేట్‌కి నెయ్యి రాసి పిండిని ఇడ్లీలా వేసుకోవాలి. కుక్కర్‌లో పెట్టి పదిహేను నిమిషాలు మధ్యస్థ మంటపై ఉడికించాలి. అంతే మిక్స్‌డ్‌ వెజ్‌ ఇడ్లీలు రెడీ. వీటిని కొబ్బరి చట్నీ, సాంబార్‌తో తింటే చాలా బాగుంటాయి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని