సేంద్రియ చేపలు తిందామా..!

మంచి ఆహారంతోనే.. ఆరోగ్యవంతమైన సమాజం.  ఈ ఆలోచనే ఆ యువకులను వైవిధ్యమైన లక్ష్యాన్ని ఎంచుకునేలా చేసింది. సేంద్రియ పద్ధతిలో మేకలు, గొర్రెలు, కోళ్లు, చేపల పెంపకానికి శ్రీకారం చుట్టేలా చేసింది.

Published : 20 Jan 2019 00:16 IST

సేంద్రియ చేపలు తిందామా..!

మంచి ఆహారంతోనే.. ఆరోగ్యవంతమైన సమాజం.  ఈ ఆలోచనే ఆ యువకులను వైవిధ్యమైన లక్ష్యాన్ని ఎంచుకునేలా చేసింది. సేంద్రియ పద్ధతిలో మేకలు, గొర్రెలు, కోళ్లు, చేపల పెంపకానికి శ్రీకారం చుట్టేలా చేసింది. విజయవాడలో మొదలైన ఈ ‘ఆర్గానిక్‌ మీట్‌’ ట్రెండు గురించి తెలుసుకుందాం..

పురుగుమందులు, రసాయనాల ప్రస్తావన లేని సేంద్రియ వ్యవసాయం గురించి మనకు తెలుసు. మరి సేంద్రియ మాంసం గురించి తెలుసా?. కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు, రొయ్యల పెంపకంలో కూడా ఎటువంటి రసాయనాల సేంద్రియ చేపలు తిందామా..!ప్రభావం లేకుండా పెంచుతూ ఆరోగ్యకరమైన రీతిలో ఉత్పత్తి చేసే మాంసమే సేంద్రియ మాంసం. బిట్స్‌ పిలానీలో బీటెక్‌ చదివిన గౌతమ్‌, లండన్‌లో విద్యను అభ్యసించిన ప్రమోద్‌,  పుణెలో ఎంటెక్‌ చదివిన దాట్ల శశిధర్‌ వర్మ... ఈ ముగ్గురి ఆలోచనల్లోంచి పురుడుపోసుకున్నదే ఈ ఆర్గానిక్‌ మీట్‌ ఆలోచన. ఆలోచనైతే వచ్చింది కానీ... ఆచరణలో పెట్టడం అంత తేలిగ్గా అవ్వలేదు వాళ్లకి. ఈ ఆలోచన కార్యరూపంలోకి రావడానికి రెండేళ్లు పట్టింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో... కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకంలో అనుభవం ఉన్న కొండప్రాంతవాసులతో ముందుగా మాట్లాడారు. వాళ్లకు మేకలు, గొర్రెలు, కోళ్లు ఇచ్చి... వాటి పెంపకంలో ఎటువంటి యాంటీబయోటిక్స్‌ వాడకుండా సహజసిద్ధ పద్ధతుల్లో పెంచేవిధంగా వారికి అవగాహన కల్పించారు. ఇచ్చిన వాటిల్లో నూటికి అరవై జంతువులు బతికినా చాలని వాళ్లకి భరోసా ఇచ్చారు. ఐటీడీఏ ద్వారా ఒక్కో కుటుంబానికి ఆరు పిల్లలు ఇచ్చారు. అలా 300 నుంచి 400 కుటుంబాలకు ఇచ్చారు. వాటినుంచి నికరంగా పది కిలోల మాంసం వచ్చే వరకు పెంచాలి. తయారైన గొర్రెలు, మేకలను తమకే ఇవ్వాలని ఒప్పందం చేసుకొని ఇచ్చారు. ఇందుకోసం రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆలోచన విజయవంతం అవ్వడంతో ఏడాది తరువాత విజయవాడ పటమట పంటకాల్వ రోడ్డులో ‘ది హార్వెస్ట్‌ మీట్‌’ కంపెనీ పేరుతో 2018 అక్టోబరులో స్టోర్‌ను ఏర్పాటు చేశారు.

నది చేపలను తీసుకొస్తున్నారు..
ఇక చేపల విషయానికి వస్తే .... పోలవరం డ్యామ్‌ దగ్గర నదిలో జాలర్లు చేపలు, రొయ్యలు పడుతుంటారు. అక్కడి జాలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు గౌతమ్‌ బృందం. అక్కడ దొరికిన గాజు రొయ్యలు, పండుగొప్పలు, వంజరాలు, పీతల్ని తెచ్చుకుంటారు.

సేంద్రియ చేపలు తిందామా..!

వాటిని ట్యాంకుల్లో శుద్ధజలంలో పెంచుతున్నారు. సేంద్రియ మాంసానికి,  బయట విక్రయించే మాంసానికి తేడా ఏం ఉంటుందనే సందేహం రావొచ్చు. ప్రకృతి సిద్ధంగా పెరిగిన గొర్రెలు, మేకల్లో అదనపు కొవ్వు ఉండదు. రుచిలో తేడా ఉంటుంది. ఎటువంటి రసాయనాల ప్రభావం ఉండదు. మాంసం, చేపలు కడగడానికి, శుభ్రం చేయడానికి దేనికైనా శుభ్రమైన ఆర్వో నీటినే వాడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో గొర్రె మాంసం కేజీ రూ.600కు ఇస్తుంటే, హార్వెస్ట్‌ మీట్‌ కంపెనీలో కేజీ రూ.700కు విక్రయిస్తున్నారు. నెలకు వెయ్యి కిలోల మటన్‌, 4వేల కిలోల చికెన్‌ విక్రయాలు జరుపుతున్నామని శశిధర్‌ తెలిపారు. ఆదివారానికి రెండు, మూడు రోజులు ముందుగానే కొరమీనులను బుక్‌ చేసేసుకుంటున్నారట స్థానికులు.

చిరుతిళ్లనీ అందిస్తున్నారు..
మాంసాహార ప్రియులు, నగర వాసులు సాయం సంధ్యవేళ రుచికరమైన మాంసాహార వంటలను ఆరగించేందుకు వీలుగా స్నాక్స్‌ విభాగాన్ని కూడా ఇటీవల ప్రారంభించారు.  నగరంలోని రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులంతా ఇక్కడి ఖాతాదారులే.

- షేక్‌ ముర్తుజా, అమరావతి


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని