పొద్దుపొద్దునే...తాజ్‌ బిర్యానీ..!

పొద్దునే హోటల్‌కెళ్లి ఏమున్నాయ్‌ అని అడిగితే... ఇడ్లీసాంబార్‌, వడ, దోసె, పూరీ ఇలా మనకి చాలా పెద్ద జాబితానే వినిస్తుంది. ఆ లిస్ట్‌లో పొరపాటున కూడా చికెన్‌ బిర్యానీ అని వినిపించదు కదా? అదే మీరు చిత్తూరు జిల్లా మదనపల్లెకి వెళ్లిచూడండి....

Published : 07 Apr 2019 00:53 IST

పక్కాలోకల్‌

పొద్దునే హోటల్‌కెళ్లి ఏమున్నాయ్‌ అని అడిగితే... ఇడ్లీసాంబార్‌, వడ, దోసె, పూరీ ఇలా మనకి చాలా పెద్ద జాబితానే వినిస్తుంది. ఆ లిస్ట్‌లో పొరపాటున కూడా చికెన్‌ బిర్యానీ అని వినిపించదు కదా? అదే మీరు చిత్తూరు జిల్లా మదనపల్లెకి వెళ్లిచూడండి. పొద్దుపొద్దునే చికెన్‌ బిర్యానీ రుచి మీ ముక్కుపుటాలని తాకి తినమని మనసుని కవ్విస్తూ కనిపిస్తుంది. కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చే ప్రయాణికులు, ఆ పరిసర ప్రాంత ప్రజలు మదనపల్లెలోనే భోజనాన్ని తినేందుకు ఇష్టపడుతారు. ఎందుకంటే ఇక్కడ అన్నిరకాల ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రుచులు అందుబాటులో ఉంటాయి కాబట్టి. అవన్నీ పక్కనపెడితే మాంస ప్రియులకు ఇక్కడ ఓ ప్రత్యేకమైన హోటల్‌ ఉంది. అదే తాజ్‌. 1980 సంవత్సరంలో మదనపల్లెకు చెందిన కె.ఎల్‌ అతావుల్లా దీన్ని ఏర్పాటు చేశారు. ఆయన తర్వాత వాళ్లబ్బాయి మన్సూర్‌ ఈ హోటల్‌ని నిర్వహిస్తున్నాడు. బిర్యానీ ఏ హోటల్‌లో అయినా చేస్తారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దీనికో ప్రత్యేకత ఉంది. ఉదయం టిఫిన్‌ టైంకే ఇక్కడ బిర్యానీ సిద్ధంగా ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. తాజ్‌ బిర్యానీ మదనపల్లెలో ప్రసిద్ధి. బిర్యానీ ప్రియులు ఉదయాన్నే అల్పాహారం బదులు బిర్యానీ తినేందుకు వరుస కడతారు. మాంసాహారప్రియులు మదనపల్లె వైపు వస్తే ఈ హోటల్‌లో బిర్యానీ తినకుండా వెళ్లరు. బిర్యానితో  పాటు మటన్‌ పాయా ఈ హోటల్‌ మరో ప్రత్యేకత. చిట్టిముత్యాల బియ్యంతో బిర్యానీ చేస్తుండటంతో ప్రజలు ఎక్కువగా ఈ హోటల్‌కు వెళ్లేందుకు ఇష్టపడతారు.

- గాదె.ఆరోగ్యరెడ్డి, తిరుపతి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని