అక్కడ సెనగలే అమృతం!

తెలిసిన వాళ్లు చోలేబతురా అంటారు. తెలియని వాళ్లు సింపుల్‌గా పూరీ సెనగల కూర అంటారు. అమృత్‌సర్‌ వెళ్తే మాత్రం ఇదే చోలేబతురాపై ఏకంగా ఓ పుస్తకమే రాసుకోవచ్చు. అమృత్‌సర్‌లో ఏమూలకు వెళ్లినా పెద్ద సెనగలతో చేసిన బోలెడు రకాల ‘చోలే’లు దొరుకుతాయి....

Published : 05 May 2019 00:30 IST

పొరుగింటి పుల్లకూర

తెలిసిన వాళ్లు చోలేబతురా అంటారు. తెలియని వాళ్లు సింపుల్‌గా పూరీ సెనగల కూర అంటారు. అమృత్‌సర్‌ వెళ్తే మాత్రం ఇదే చోలేబతురాపై ఏకంగా ఓ పుస్తకమే రాసుకోవచ్చు. అమృత్‌సర్‌లో ఏమూలకు వెళ్లినా పెద్ద సెనగలతో చేసిన బోలెడు రకాల ‘చోలే’లు దొరుకుతాయి. వాటి తయారీకోసం అవసరం అయిన మసాలా దినుసుల దుకాణాలే లెక్కలేనన్ని ఉంటాయి...

తెల్లగా, పెద్దగా ఉండే కాబూలీ సెనగలు మనవి కావు... ఇవి 18వ శతాబ్ధంలో మన దేశానికి దిగుమతయ్యాయి అంటాడు ఆహార చరిత్ర పరిశోధకుడు కేటీ ఆచార్య. ఏ ముహూర్తాన ఈ కాబూలీ సెనగలు పంజాబ్‌ వాళ్లకి పరిచయమయ్యాయో తెలియదు కానీ అమృత్‌సర్‌కి చోలేబతూరా ప్రత్యామ్నాయ పదంగా మారిపోయింది. టిఫిన్‌ అంటే వాళ్లకు... అమృత్‌సర్‌చోలే, చనా మసాలా, పాలక్‌చనా, ఆలూచోలే, చావల్‌చోలే, చోలేకుల్చే, మత్తే చనా ఇలాంటివే ఉంటాయి. వీటన్నింటిలో కాబూలీ సెనగలతో చేసిన రుచికరమైన మసాలా కూర కామన్‌. ఈ కూరని పూరీలు, సమోసాలు, కుల్చారొట్టెలతో తింటారు. సెనగల కూరలోని అసలు రుచంతా దాన్లో వాడే మసాలాల్లోనే ఉందని అంటారు అమృత్‌సర్‌ వాసులు. ధనియాలపొడి, జీలకర్రపొడి, వాము, కసూరీమేథీ, ఆమ్‌చూర్‌ ఇలా వివిధ రకాల మేళవింపులతో భిన్నమైన రుచులని తీసుకొస్తుంటారు. మరి.. సంప్రదాయ సెనగలకి స్థానమే లేదా అంటే ఉంది. ఆమ్‌చూర్‌ పొడి చల్లి కాలాచనా(కొమ్ముసెనగలు)తో పూరీలు తయారుచేస్తారు.

చనామసాలా:
కావాల్సినవి: నానబెట్టిన సెనగలు- కప్పున్నర, నూనె- మూడు చెంచాలు, జీలకర్ర- చెంచా, బిర్యానీ ఆకులు- రెండు, యాలకులు- రెండు, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, టమాటా ముక్కలు- కప్పున్నర, వెల్లుల్లి పలుకులు- చెంచా, అల్లం తురుము- చెంచా, పచ్చిమిర్చి- మూడు, కారం- చెంచాన్నర, ఉప్పు, పసుపు- తగినంత, బంగాళాదుంపలు- రెండు, గరంమసాలా- ముప్పావుచెంచా, కసూరీమేథీ- చెంచా
తయారీ: కడాయిలో నూనె వేసి వేడిచేశాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలి. ఆపై ఉల్లిపాయలు కూడా వేసి వేగనివ్వాలి. ఇందులోనే టమాటాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. టమాటాలు బాగా ఉడికిన తర్వాత సెనగలు, బంగాళాదుంపలు, రెండు కప్పుల నీళ్లు వేసుకుని ఎక్కువ విజిల్స్‌ రానివ్వాలి. కూరని బాగా దగ్గరకు రానిచ్చి గరంమసాలా, కసూరీమేథి వేసుకుంటే ఘుమఘుమలాడే చనామసాలా కూర సిద్ధం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని